నేను పదిమందిలో ఉన్నప్పుడే కాదు.. ఒంటరిగా ఉన్నా.. ఆనందంగా గడపగలను. నరుగురిలో ఉంటే ఫర్వాలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనసూరుకోదు. చెలరేగి పోతుంటుంది. దానికి తోడు ఈ పాడు బుద్ధి ఒకటీ.. ఓ... తెగ ఆలోచించేస్తుంది. ఇక ఇవి రెండూ కలిసి చేసే గొడవ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఖాళీగా ఉండను. ఒకవేళ ఎప్పుడైనా ఉన్నా ఏ పుస్తకమో ముందేసుకు కూర్చుంటా. అప్పుడప్పుడూ బండి ఇంట్లో పడేసి బస్సులో పోవడం నాకు చాలా ఇష్టం. అలా అప్పుడప్పుడూ ఏ ప్రయాణంలో ఉన్నప్పుడో అదునుచూసుకుని మరీ యుద్ధానికి దిగుతాయి ఈ పాడు బుద్ధీ, మనసూ. అది నాకూ ఇష్టమేననుకోండి..
ఈ మధ్య ఓ రోజు అలాగే ఏదో సినిమాకి ఆర్. టి. సి. ఎక్స్ రోడ్ వెళదామని, మెహదీ పట్నం బస్టాప్ లో డైరెక్ట్ బస్(113 ఐ/m) కోసం ఎదురుచూస్తున్నాను. రైతు బజారుకూడా పక్కనే ఉండడంతో వచ్చేపోయ్ళే జనాలతో మెహదీపట్నం బస్టాప్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కూరలమ్మేవాళ్లూ, పళ్లమ్మేవాళ్లూ, కాలేజ్ స్టూడెంట్స్, తల్లీ బిడ్డలూ, ప్రేమ జంటలూ, ముసలి వాళ్లూ, ఉద్యోగస్థులూ ఇలా చాలామంది వచ్చి పోతుంటారు. అలా వచ్చి పోయే జనాలని గమనిస్తూ, వాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ కాలక్షేపం చేయడం నాకు చాలా ఇష్టం. జనాల మొహంలో నవ్వుంటే నాకూ నవ్వొస్తుంది. ఎవరైనా దిగులుగా కూర్చుంటే వీళ్ల దిగులుకు కారణమేమై ఉంటుందా అని నేనూ దిగులుపడి పోతాను. వాళ్ల కష్ట సుఖాల గురించి తెగ అంచనాలు వేసేస్తుంటాను. నా అంచనాలు నిజమైపోతాయని కాదు. కానీ అదో ఆనందం. అచ్చం సినిమా చూస్తున్నంత ఆశక్తిగా ఉంటుంది. (మీరూ ఓ పాలి ప్రత్నించి సూస్తే పోలే...) నేను వెళ్లాల్సిన సినిమాకి చాలా సమయం ఉండడంతో బస్సు గురించి కంగారుకూడా లేదు. ఇక మనకి తెలియకుండానే ఊహల్లో తేలిపోతూన్నాం. ఆ ఊహలన్నీ సినిమాస్టోరిలుగా కూడా అల్లేసుకుంటున్న సమయంలో... ఓ బిచ్చగాడొచ్చాడు. అతనికి కళ్లులేవు. ఓ 50 ఏళ్లుంటాయి అతనికి. అడగ్గానే ఓ రెండు రూపాయలేశాను. దూరంగా ఓ 10 ఏళ్ల అబ్బాయి ప్లాస్టిక్ సంచీలు అమ్ముతున్నాడు. వాడు చదువుకోకుండా కవర్లు అమ్ముకుంటుంటే వాళ్ల అమ్మా నాన్నా ఏమీ అనరా? ఒకవేళ వాళ్లే అమ్మిస్తున్నారా? అలా ఆలోచిస్తుంటే మళ్లీ ఓ 13 ఏళ్ల అమ్మాయి డబ్బులిమ్మని అడుగుతూ వస్తోంది. మాసిన బట్టలు అక్కడక్కడా చిరుగులు పట్టాయి. ఈమెకు డబ్బులు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. వొకవేళ ఇస్తే ఆమెను అడుక్కునేందుకు పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందేమో. ఇవ్వక పోతే ఆమె ఎంత కష్టంలో ఉంటే అలా రోడ్డున పడిందో? ఇంతలో నామనసు " వెధవాలోచనలాపి చేతనైనంత ఇవ్వవోయ్" అంది. ఇక దాని మాట కాదనలేక ఓ 2 రూపాయలు వెయ్యబోయాను. అంతలో దూరంగా ఉన్న స్వాతీ టిఫిన్స్ కనబడి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. డబ్బులివ్వడం కంటే టిఫిన్ ఇప్పిస్తే మంచిదనిపిచ్చి టిఫిన్ తింటావా..? అన్నాను. ఆమె తలూపడంతో ఆమెను తీసుకు వెళ్లి ఇడ్లీ ఆర్డరిచ్చాను. ఆమె అదోలా మొహం పెట్టి "దోసె చెప్పన్నా" అంది. సరే అదే ఇప్పించి వచ్చేశాను. ఇక అప్పుడు మొదలయ్యింది యుద్ధం. అది నాలో నాకు, నాతో నాకు ( మనసుకీ, బుద్ధికీ) జరిగిన యుద్ధం . దాని సారాశం సరదాగా మీముందుపెడతాను.
బుద్ధి: మనసా... నీపని నువ్వు చూసుకోక ఊ రికే నా ప్రతి పనిలో తలదూరుస్తావెందుకే..?
మనసు: నీ పనేంటీ.. నా పనేంటి బాసూ.. ప్రతి పనీ మనదే కదా? ఏదో ఆడపిల్ల అడిగింది. చేతనైనంత ఇవ్వక ఆ ఆలోచనలేటి?
బుద్ధి: ఆ మాత్రం నాకు తెలీదా? కానీ ఇలా ఎంతమందికి వెయ్యాలి? అదిగో అటు చూడు. దూరంగా ఇంకో నలుగురైదుగురు కనపడుతున్నారు. ఇంకాసేపు కూచుంటే వాళ్లుకూడా వస్తారు. వాళ్లక్కూడా వెయ్యాలా..?
మనసు: అందుకే నిన్ను `బుద్దూ' అనేది. నువ్వు ఇక్కడ కూర్చున్న అరగంటలో వాళ్లు క్యూ కట్టుకుని వచ్చేస్తారేంటి? వాళ్లొచ్చినప్పుడు గదా? అయినా రోజూ ఎంతమందికి దానం చేసేస్తున్నావేంటీ..? ఈ నెలమొత్తంలో ఎంతచేశావో..? ఓసారి లెఖ్కెయ్యమ్మా..!
బుద్ధి: ఆ... నిజానికి ఈ నెలలో ఇదే చెయ్యడం. కానీ ఇలా పదులూ పరకలూ ఖార్చు పెట్టేంత లేదుకదా మనకి. నువ్వు మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ రెండురూపాయలే వేసి ఊరుకుండే వాడిని, లేదా అసలు ఆపేసేవాడిని. అలాంటి చిన్నపిల్లల్ని చదువుకోమనో, కష్టపడి సంపాదించమనో చెప్పి ఆలోచింప చేయాలి కానీ కనిపించిన ప్రతీ వాడికీ దానం చెయ్యలేం కదా...
మనసు: ఆహా నీకు కనిపించిన క్షణంలో నీతులు బోధించేస్తావా.. వాళ్లు ఆచరించేస్తారనే...
బుద్ధి: దేనికైనా మనసుంటే మార్గముంటుంది. అంటే నువ్వు నాతోడుంటే ఏదైనా సాధించవచ్చు.
మనసు: టచ్ చేశావు. నేనెప్పుడూ నీతోడే మామా. కానీ ఎప్పుడైనా నువ్వు గాడి తప్పుతున్నా, మానవత్వాన్ని మరుస్తున్నా.. ఇలా గుర్తు చేస్తానంతే. ఈ మాటలు ఎవరైనా అమ్మాయిల దగ్గర చెప్పు వర్కవుట్ అవుతాయేమో..
బుద్ధి: ఇప్పుడొచ్చిన వాళ్లు కాస్త ఫర్వాలేదు, ఇకొంతమంది ఉంటారు తాగుబోతులూ, తిరుగు బోతులూ. వీళ్లకి వేరే పని చేతకాదు. అడుక్కోడమే వీరి పని. అడుక్కుని ఆ వచ్చిన డబ్బులతో తాగి రోడ్లమీద పడి దొర్లుతుంటారు. చిన్నపిల్లలకి డబ్బులేయడం ద్వారా వాళ్లని సోమరులుగా తYఆరు చేసినవాళ్లం అవుతాము కదా..? వాళ్లూ పనీ పాటా చేతకాక, ఇలా తాగు బోతులవ్వాల్సిందేనా?
మనసు:అయినా నువ్విచ్చే రూపాయికి ఇంతలా ఆలోచించాలా.. చూడగానే నీకు దానంచెయ్యాలీ అనిపించిందనుకో చేసేయ్... ఆలోచించకు. దానం చేసిన తరువాత వాళ్లు దేనికి ఉపయోగిస్తున్నారో అని కూడా బాధ పడకు... మంచి మనసుతో చేసే ప్రతి పనీ మంచికే దారితీస్తుంది.
బుద్ధి: నువ్వన్నట్టు రూపాయికీ పాపాయికీ ఆలోచించనవసరం లేదు. కానీ మనం మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో తెలుసుకోవాలిగా? వాళ్లు నిజంగా కష్ట పడలేని ముసలివాళ్లూ, అవిటి వాళ్లూ అయితే ఇంతలా ఆలోచించను. కానీ చిన్న పిల్లలయితేనే కాస్త ఆలోచించాలి. సోమరి పోతులయితే అసలు వెయ్యమనుకో.. పైగా ఇప్పుడుంకో గొడవ వీళ్లని చేరదీసి రౌడీలు డబ్బులు సంపాదిస్తున్నారుట.
మనసు: నీకెలా తెలుసేంటి?
బుద్ధి: "సినీమాలు చూడట్లేదేంటి?"
మనసు: "నీకేం బాబూ" ఆలోచించడమే నీకు తెలీసు. కానీ స్పందించడమే నాకు తెలుసు. వాళ్ల కళ్లల్లో దైన్యమే కనబడుతుంది నాకు. కాబట్టి నామాట కూడా కాస్త విను. వాళ్లని పూర్తిగా మనమెలాగూ పోషించలేం. కనీసం మన స్థితిని బట్టీ, వాళ్ల పరిస్థితిని బట్టీ నీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వు. కానీ ఇచ్చేది మనసారా ఇవ్వు. ఆనందంతో ఇవ్వు.
బుద్ధి: అదే ఆ జెనీలియా డైలాగులే వద్దనేది. "నీకేం బాబూ" అంట... ఏమీ తెలియని నంగనాచిలా ఎంత అమాయకంగా చెబుతావో... ఎంత వారైనా నీ ముందు ఓడి పోవలసిందే కదా..
సరేలే.. ఆ బుంగ మూతి మార్చు. నీమాటలు నేనెప్పుడు కాదన్నానని.
మనసు:మిగతావాళ్లలా నా నోరు నొక్కేయకుండా.. నేను చెప్పేది కాస్త ఆలోచిస్తావు. అందుకే నువ్వు నచ్చుతావు గురూ..
ఇలా చాలా చర్చ జరిగిందండీ.
మరేమో నండీ... నాకేమో సంఘ సేవకుణ్ణయిపోవాలని పేద్ధ కలండీ. నాకులాగే చాలామందికి కూడా అదే కల అండీ. కానీ అది ఇంకా కలే నండీ.. నిజం కాలేదండీ... ఎందుకంటే మేమింకా రూపాయిల దగ్గరే పైపైన ఆలోచిస్తున్నాము కానీ కాస్త లోతుగా ఈ చెల్లా చెదురైన వాళ్ల జీవితాలు ఎలా బాగు పడతాయో ఆలోచించమండీ. ఎందుకంటే ఆలోచించిన కొద్దీ బాధ్యత తీసుకోవలసి వస్తుందేమో అనే భయమండీ.
Tuesday, February 24, 2009
పూజ చెయ్యబోతున్నారా? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి.
పూజలు చాలామంది చేస్తూనే ఉంటారు. అయితే ఎంతమందికి కోరిన కోరికలు తీరాయి? ఎంతమందికి ఆత్మ సంతృప్తి లభిస్తోంది? అలా ఫలితం కనిపించని వారికోసమే ఈ వ్యాసం.
కోరికలు కోరడం తప్పా కాదా అనేది ఇప్పుడు చర్చించటం లేదు. ఒకవేళ ఏదైనా కోరి పూజలు చేస్తుంటే అవి తీరుతున్నాయా అని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. కొంతమంది చెప్తారూ.. దేముడికి పూజ చేస్తూ కోరికలు తీరుతున్నాయా? లేదా? అని ఆలోచించడం తగదని. మళ్లీ అలాంటి గొప్పవారే చెప్తారు "కామి గాని వాడు మోక్ష గామి కాలేడని". ఇవన్నీ వింటూ కూర్చుంటే ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడతారు. నేను చెప్పేది ఏమిటంటే కోరుకోండి మీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. మీ కోరికలో ఎంత మంచి ఉంటే అంత తొందరగా నెరవేరతాయి. పరోపకారంతో కూడిన నిస్వార్ధమైన వి చాలా ఉత్తమమైనవి. మీ మంచి కోరేవి మధ్యస్థం. పక్కన వాడికి చెడు కోరేవి అథమం. ఈ అథమ కోరికలు కోరితే అవి నెరవేరక పోగా మీ వినాశనానికే దారితీస్తాయి. ఉత్తమ, మధ్యస్థ కోరికల గురించి మాత్రమే నేను చెప్తున్నాను.
పూజ చేసే ఏ కొద్ది మందికో ఫలితం లభిస్తోంది. దానికి కారణాలు అనేకం. అందులో మీ తప్పులు సరిదిద్దు కోండి ముందర. మిగతావి ఎలా వాటంతట అవే ఎలా తొలగి పోతాయో చూడండి.
పూజ చెయ్యాలంటే మొదట కావలసింది "శ్రద్ధ". పూజను నేడు చాలా మంది భయంతోనో, తప్పదు కనకనో చేస్తున్నారు. మీకు ప్రాణ సంకటం వచ్చినప్పుడో, ఇక ఎవ్వరి వల్లా మీకొచ్చిన కష్టం తొలగే మార్గం లేదు అనిపించినప్పుడో భగవంతుడు కావలసి వస్తున్నాడు. అప్పుడైనా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప, చిత్తశుద్ధి లేదు. ఇలాంటి వారికి కూడా నాసలహాలు( పూజ విషయంలో) పని చెయ్యవు.
పూజ చెయ్యాలంటే మీకు ఉండాల్సిన ఒకే ఒక్క అర్హత "శ్రద్ధ". అది మీకు ఇప్పటికే ఉన్నా, లేదా ఇక ముందు కల్పించుకుంటాము అన్నా నేను మీకు చెప్పేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, మీరు కోరుకునేది ఏదైనా తప్పక మీకు ఫలితం లభిస్తుంది. అందుకు మీరే నిదర్శనం. మీరే ఏదో ఒక రోజు నేను చెప్పినది నిజమే నంటూ సభా ముఖంగా చెప్తారు.
సుచిగా స్నానం చేసి, శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి, శుభ్రంగా ఉన్న స్థలంలో దేముని విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహాన్ని కడిగి బొట్టుపెట్టి పూజకు ఉపక్రమించాలి. ఇంత వరకూ అందరూ చేసేదే. కానీ విచిత్రం అసలైన పూజ మాత్రం చాలా మంది విధి విధానంగా చెయ్యలేక పోతున్నారు. ఇక్కడ అందరి ఇళ్లల్లో జరిగే సాధారణ తంతు వోసారి గమనిద్దాం.
రామనాధం అనే అతను తనకు ప్రమోషన్ వచ్చిన సంధర్భంగా సత్యనారాయణ వ్రతం చెయ్యాలనుకున్నాడు. అతని ఉద్యోగం చిన్నదే అయినా క్షణం తీరికలేనిది. అయినా ఎప్పుడో మొక్కుకున్నాడు కనక ఓ ఆదివారం ఏ పనీ పెట్టుకోకుండా ఖాళీగా ఉంచుకుని ఆరోజు సాయంత్రం వ్రతం తలపెట్టాడు. రామనాధం దంపతులు చాలా సంత్సరాల తరువాత పూజ చేసుకుం టున్నాం కనుక నలుగురినీ పిలుద్దాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే కాస్త వాళ్ల శక్తికి మించిన పనే అయినా ఆఫీసు వాళ్లని, బంధువులనీ, చుట్టు ప్రక్కల వాళ్లానీ భోజనాలకు కూడా పిలిచారు. ఆ దగ్గరలో ఉన్న పురోహితుడిని పిలిచారు. వ్రతానికి కావలసిన సామాగ్రిని ఆదివారం ఉదయం పూట తెచ్చాడు రామనాధం. సాయంత్రం ఎంత తొందరగా మొదలు పెడదామన్నా జానకమ్మ చుట్టు ప్రక్కల వాళ్లని పిలవటం, ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకోవటం, వంటవాళ్లకి కావలసిన సామాగ్రి అందివ్వటంతో మొదలు పెట్టేటప్పటికి ఆలస్యమైపోయింది. పంతులుగారు వచ్చి తొందర పెట్టిన అరగంటకి ఇద్దరూఫ్ వ్రతానికి కూర్చున్నారు. ఈ లోపులో రామనాధం చెల్లెలు పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసింది. వ్రతం మొదలుపెట్టే సమయానికి అందరూ రావడం మొదలైంది. వ్రతం చేస్తూ అందరినీ అక్కడినుండే పలకరిస్తూ కూర్చోమని చెబుతున్నారు ఆ దంపతులు. మంత్ర పుష్పం సమయంలో మనస్పూర్తిగా నమస్కారం చేసుకున్నాడు రామనాధం. కధ సమయంలో పంతులుగారి అనుమతితో ఏవో అవసరమైన ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాడు. గం: 1.30 ని.లు వ్రతానికి కూర్చుని కూర్చుని కాళ్లు నొప్పులు పుట్టాయి. పంతులు గారికి దక్షిణ ఇచ్చి అందరితో భోజనాలు చేశారు రామనాధం దంపతులు.
ఇంతే కదండి అందరిళ్లల్లో పూజల తంతు. దీనికి మీకు లభించే ఫలితమేమిటో చెప్పనా... " ఖర్చు". అంతే అంతకంటే ఏమీ లభించదు. తృప్తి లభిస్తోంది అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అక్కడ మీరు పూజ చేస్తే కదా తృప్తైనా మిగిలేందుకు. పూజ అనే తంతు( పని) మాత్రమే చేశారు. పూజ మాత్రం కాదది. దీనికంటే రోజూ మీరు ఇంట్లో చేసే దీపారాధన వేయి రెట్లు నయం. పోనీ వచ్చిన నలుగురూ మిమ్మల్ని అభినందించారా అంటే... అవును మీ ఎదురుకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశావోయ్ అని చెప్పి, మీ వెనుకగా రిసీవింగ్ సరిగా లేదనీ, పట్టించుకునే వాళ్లే లేరనీ, తమ దర్పం చూపడానికే అందర్నీ పిలిచి ఆర్భాటంగా చేశారనీ ఇలా చాలా మాటలు అని ఉంటారు. అందులో కొన్ని మీచెవులని తాకి వుంటాయి కూడా... అందుకే అంటున్నా మీకు మిగిలింది ఖర్చు మాత్రమే అని. వీటన్నిటికీ కారణం మీరే. మీరు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే అన్నీ సవ్యంగా జరిగి ఉండేవి.
పూజను "మనసా వాచా కర్మణా" ఆచరించాలి. అప్పుడే అది సంపూర్ణమైన పూజ అవుతుంది. మీరు కర్మని(పని) మాత్రం ఆచరించి నేను పూజ చేశాను అని చెప్పడం ఎంతవరకూ న్యాయం. పూజ చేస్తే మనసుకు ఒక అద్వితీయమైన, ఆనందకరమైన, సున్నితమైన భావన కలగాలి. అది కలగలేదు అంటే అక్కడ మీమనసు లేదు అని అర్ధం.
మనసారా అంటే మనం పూజ చేసేటప్పుడు ఏమి చేస్తున్నామో తెలుసుకుని దాన్ని చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి.
ఉదా: "పుష్పం సమర్పయామి" అన్నప్పుడు "పుష్పాన్ని సమర్పిస్తున్నాను స్వామీ స్వీకరించు" అని మనసులో ప్రార్ధించాలి. ఆ వేశే పుష్పం సాక్షాత్తూ భగవంతుడి పాదాల వద్ద పడుతోంది అని భావించాలి. దాన్ని ఆ భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తున్నట్లు భావించాలి.
వాచా అంటే వాక్కు ద్వారా కూడా ఆ స్వామిని సేవించాలి. అంటే పూజ చేస్తున్నంత సేపూ భగవత్ నామస్మరణ చేయాలి.
కర్మణా అంటే కర్మ ద్వారా సేవించాలి. భగవంతునికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించడమే కర్మ(పని). ఏ సమయానికి ఏది చేయాలో కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వారు పెద్దలని గురువులని పురోహితులనీ అడిగి తెలుసుకుని చేయండి. త్వరలో " పూజా విధానం" అనే పోస్టు రాస్తాను. అది చదివితే మీకు పూజ చేయడమెలాగో సులభంగా అర్ధమౌతుంది.
ఈ పోస్టు ఇంకా విపులంగా రాయాలి. కానీ సమయా భావం వల్ల కొంత తగ్గించి రాస్తున్నాను. చదువుతుంటే మీకు ఏమైనా సందేహాలు వస్తే వ్యాఖ్యలలో రాయండి. సమాధానం తప్పక ఇస్తాను.
Sunday, February 8, 2009
పూజ అంటే ఏమిటి? పూజను ఎందుకు చేయాలి?

భగవంతుణ్ణి చేరుకోవడానికి పెద్దలు చెప్పిన అనేక మార్గాలలో `పూజా లేదా `అర్చనా అనేది ఒక మార్గం. మన ఇంటికి వచ్చిన పెద్దవారిని ఏవిధంగా గౌరవించి అథిధి సత్కారం (రండి బాబాయ్ గారు. ఇంత ఎండ వేళ వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా..! ఈ మజ్జిగ తీసుకోండి... ఇలా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేయడం) చేస్తామో.., అలాగే మన ప్రార్ధన మన్నించి మనం పిలవగానే మన ఇంటికి వచ్చే భగవంతుడికి మనం చేసే సేవనే `పూజా అంటాము. ఈ పూజలో 16 రకాలైన సేవలతో భగవంతుడిని తృప్తిపరచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతాడు భక్తుడు. ఈ 16 రకాల సేవలనూ పూజావిధానం అనే టపాలో విపులంగా వివరిస్తాను.
అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, చీకటి నుండి వెలుగులోకి, దానవత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వం వైపు మన మనస్సును పురోగమింప చేయడానికి పూజను చేయాలి.
Subscribe to:
Posts (Atom)