Tuesday, March 31, 2009

భద్రాచలంలో శ్రీ రామ నవమి


ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఆరాధ్యదేముడవడం వల్ల ఎంతో మందికి జీవితంలో ఒక్కసారైనా శ్రీ రామ నవమికి భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించాలని కోరిక.ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నా, మా అసలు ఊరు భద్రాచలం అవడంవల్ల ఆ కోరిక సులభంగానే నెరవేరింది. హైదరాబాదు వచ్చి 7 ఏళ్లు అవుతోంది. ఇక్కడికి వచ్చినా భద్రాచలంతో సంబంధ బాంధవ్యాలు తెగలేదు. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం 1,2 సార్లు వెళ్లి వస్తూనే వుంటాము.

ఎండాకాలం వచ్చేసింది. భద్రాచలం అనగానే శ్రీ రాముడి తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది ఎండలే. ఇక్కడ అప్పుడే ఎండలు తట్టుకోలేక అబ్బ ఏమెండలో మండిపోతున్నాయి అనుకుంటున్నాం. ఇక భద్రాచలంలో ఎండలు ఎలాఉంటాయో ఊహించండి. విచిత్రం ఏమో కానీ ఆ ఎండాకాలంలోనే శ్రీ రామ నవమీ వస్తుంది. మరింత విచిత్రం ఎండలు ఎంతలా పెరుగుతున్నాయో భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్యా అలా పెరుగుతూనే ఉంది. వీరి సౌకర్యం కోసం వసతి గృహాలుకూడా ఏ ఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయి.

పూర్వం ఊరంతా తాటాకు పందిళ్లు వేశేవారుట. ఆకాశమంత పందిరి అన్నమాట. భద్రాచల తాటాకు పందిళ్ల గురించి ఆంధ్ర దేశమంతా చెప్పుకునే వారట. నాచిన్నప్పటికి అంతలా కాకపోయినా చాలా భాగం వేశేవారు. రాను రాను వీటి పరిమితి తగ్గినట్లుంది. కానీ ఇప్పటికీ గుడిలోనూ, కళ్యాణ మండపం చుట్టూతా, గుడినుండి గోదావరికి వెళ్లే దారిలోనూ చాలా బాగా వేస్తారు. భద్రాచలం వచ్చిన యాత్రికులు కొందరు ఆ పందిళ్లకిందే కాలక్షేపం చేస్తుంటారు.

ఇంకా ఆ కళ్యాణానికి వచ్చిన భక్తులకు తాటాకు విశనకర్రలు పంచిపెడుతుంటారు. భక్తుల దాహం తీర్చడానికి, వారికి వేడి చేయకుండా ఉండడానికీ కళ్యాణ మైన వెంటనే మిరియపు పొడి వేసిన బెల్లం పానకం, మజ్జిగా పంచి పెడుతుంటారు. కళ్యాణానికి వచ్చే జనం సంఖ్య వేలు దాటుతుంది. అందుకే పానకం పెద్ద పెద్ద డ్రమ్ములతో కలిపి కళ్యాణ మండపానికి నాలుగువైపులా పెడతారు. ఇదంతా దేవస్తానం వారే కాదు, భద్రాచలంలో ఉండే భక్తులు, వారి సాయంతో ఆశక్తి ఉన్న ఇతర భక్తులూ ఈ విశనకర్రలూ, పానకాలూ పంచిపెడుతుంటారు.

చిన్నప్పుడు శ్రీ రామ నవమి వచ్చిందంటే మాకు సందడే సందడి. ఎక్కడెక్కడి నుండో రకరకాల వ్యాపారులు వచ్చి చిన్న చిన్న స్టాళ్లు పెట్టే వారు జాతరలు జరిగినప్పుడు పెడతారే అలాగన్నమాట. కాకపోతే ఇక్కడ కాస్త ఎక్కువ. ఈ స్టాళ్లలో జీళ్లు, బొమ్మలు, కొత్త కొత్త ఆట వస్తువులూ, బట్టలూ అబ్బో ఒక్కటేమిటీ చాలా ఉండేవి. ఈ స్టాళ్లు నవమికి రెండు రోజుల ముందు నుండీ 2 రోజుల తరువాత వరకూ పెట్టే వారు. జైంటు వీల్, సర్కస్ లాంటివి కూడా ఉంటాయి. ఇది ఒక వైపు అయితే, మరో వైపు ఇంటికి చుట్టాలు వచ్చే వాళ్లు. గుడికి మా ఇల్లు దగ్గరగా ఉండడంతో సత్రాలు దొరకని పేద యాత్రికులు మాఇంటి ఖాళీ స్థలంలో వంట చేసుకుని, అక్కడే ఓ ప్రక్కగా పడుకునే వారు. బంధువులు వచ్చినా రాక పోయినా అంత బాధ అనిపించేది కాదు కానీ వీళ్లు రాక పోతే అరే ఫలానే వాళ్లు ఈ సంవత్సరం రాలేదే అని బాధ పడే వాళ్లం.
కళ్యాణ రాముణ్ణి చూస్తారా...!?


చాలా అందంగా ఉన్నారు కదు...
ఇంతకీ శ్రీ రామ నవమి ఎప్పుడో తెలుసా..? అందరికీ 3వ తారీఖున అయితే, భద్రాచలంలో మాత్రం 4వ తేదీన చేస్తున్నారు. అదేంటీ అంటే వాళ్ల వైష్ణవ ఆగమం ప్రకారం మిగులు తిథి చేస్తారు. ఇది చాలా కధ ఉంది లెండీ... మొత్తానికి శ్రీ రామ నవమి దశమినాడు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ రోజు కళ్యాణం చూడడానికి అదృష్టం ఉండాలి. ఈ సంవత్సరం నాకు చూసే అవకాశం దొరికే టట్టు లేదు. కానీ నా స్నీహితులు వెళ్తున్నారు... వీలయితే నాలుగు తలంబ్రాలు తెచ్చి పెట్టమని చెప్పాను లెండి. :)

Wednesday, March 25, 2009

మీరు కోరిన ఉద్యోగం దొరకటంలేదా...

ఈ మధ్య మంచి ఉద్యోగాలు దొరకడం మాట దేముడెరుగు, మంచిదో చెడ్డదో ఉన్న పాత ఉద్యోగాలు కూడా (అమెరికాలో గాలివీస్తే ఇండియాలో) రెప రెపలాడుతున్నాయి. ఇటువంటి సందర్భంలో ఎవ్వరికీ మనశ్శాంతి ఉండడంలేదు. పని ఒత్తిడి పెరుగుతోంది. ఆ వత్తిడి వల్ల ఇంటికి వచ్చినతరువాతకూడా చిరాకుగా గడుపుతున్నారు. ఎప్పుడు పోతాయో తెలియని ఉద్యోగాలతో జీవితంమీద భరోసా కరువవుతోంది. ఒక వైపు ఖర్చులకు అలవాటైన జీవితం ఉన్నట్టుండి జాగ్రత్తలు నేర్చుకోవాలంటే తట్టుకోలేక పోతున్నారు. అనేకరకాల ఆలోచనలతో మానసిక ఆందోళనలకు కూడా గురవుతున్నారు.

విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి ఏదైనా దానికి చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ శ్లోక పారాయణ.

ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుహ్ఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.

నవగ్రహ శ్లోకాలు:


ఈ పై చిత్రాన్ని క్లిక్ చేసి దాన్ని పెద్దదిగా చూడండి ( లేదా ) సేవ్ చేసుకోండి .


నవ గ్రహ శ్లోకం :
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహం ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3,4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. మీరు జపం చేసుకోలేని పక్షంలో బ్రాహ్మణుల చేత చేయించుకోవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా మీ కోరిక ఎంత పెద్దదైనా ఖచ్చితంగా తీరుతుంది. ఏది ఏమైనా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించడం మంచిది.

నవగ్రహ అనుగ్రహం పొందటానికి మరో సులువైన మార్గం:

41 రోజులు ప్రతీ రోజూ దేవాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తూ, 108 సార్లు "ఆదిత్యాచ సోమాయ....." అనే శ్లోకాన్ని పఠిస్తే మీరు ఎంతటి కష్టంలో ఉన్నా దానినుండి బయటపడగలుగుతారు. మీకోరిక తప్పక నెరవేరుతుంది. ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ, పని చేసుకుంటున్నప్పుడు కుడా వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. మొత్తం 41 రోజులు అయిన తరువాత నవగ్రహాలకు పూజ చేయించుకోవాలి.

ఫలితం తప్పక రావాలంటే...
నేను ఇక్కడ రాశే ప్రతీ ఒక్కటీ తప్పక ఫలితాన్నిస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవి కావు, ఎందరో అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పినవి. అయితే చేసే మీదగ్గరే ఉంటుంది ఫలితం రావడం, రాకపోవడం. ఎందరో ఎన్నో పూజలూ, వ్రతాలూ చేస్తున్నారు. మరి వాళ్లందరికీ ఫలితాలు వస్తున్నాయా అంటే రావట్లేదనే చెప్పాలి. ఫలితాలు వచ్చినవాళ్లకీ, రాని వాళ్లకీ తేడా ఒక్కటే... "నమ్మకం" అవును "నమ్మకమే". అది ఉన్ననాడు ఫలితం తప్పక వస్తుంది. దానికి "ప్రయత్నం" తోడవ్వాలి. అలాంటి నమ్మకంతో కూడిన ప్రయత్నం చేస్తే " అదృష్టం" మీదవుతుంది.

ఉదాహరణకు: మీకు చిన్న ఉద్యోగం ఉంది. దానికి వచ్చే జీతం మీ అవసారలకు సరిపోక పోగా అప్పులపాలవుతున్నారు. సమస్యలు చుట్టుముట్టాయి. మీకు పెద్ద జాబ్ చేయగలిగె విద్య ఉంది, కానీ తగిన అవకాశాలు రావటంలేదు. అప్పుడు మీరు నగ్రహ ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మీకు చక్కటి జాబ్ దొరుకుతుంది. అయితే ప్రదక్షిణలు చేశాను కదా అని కాలుమీద కాలేసుకుని కూర్చుంటే జాబ్ మీ చేతుల్లోకి రాదు. ప్రదక్షిణలు చేస్తూనే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. వచ్చిన ఇంటర్వ్యూలను మీకు తెలిసినంతవరకూ చక్కగా ప్రిపేరై హాజరు అవ్వాలి. ఒక వేళ అది పోయినా మరో దానికి నమ్మకంతో ప్రయత్నించాలి. అప్పుడు చక్కటి జాబ్( 41 రోజుల ప్రదక్షిణలు చేసిన 3 నెలల్లో) మీకు తప్పక దొరుకుతుంది.

"ఆహా ఏమి చెప్పారండీ... మా అర్హతకు తగిన జాబ్ కోసం `నమ్మకం'తో మళ్లీ, మళ్లీ `ప్రయత్నం' చేస్తూ పోతే జాబ్ దొరక్క ఎక్కడికి పోతుందీ? అలా చేస్తే ఎవరికైనా జాబ్ దొరుకుతుంది. పది రాళ్లు విసిరితే ఒక్కటైనా తగలక పోదా..? ఆ మాత్రం దానికి 41 రో...జు...లు... మీరు చెప్పినట్లు చేయండందేనికి? " అంటారా....?

అవును మీరనుకునేది నిజమే... "నమ్మకంతో కూడిన ప్రయత్నం ఎక్కడ ఉంటుందో అక్కడ అదృష్టం ఉంటుంది". మీమీద మీకు అంత నమ్మకం ఉన్నంత వరకూ ఏ పూజా అవసరంలేదు. కానీ (పోనీ) ఆ ఆత్మవిశ్వాసం మీకు లేనప్పుడే నేను చెప్పిన ప్రదక్షిణలు చెయ్యండి. మీచుట్టూ సమస్యలున్నప్పుడే... మీ వల్లకాదు అనుకున్నప్పుడే... ఎవ్వరూ మీకు సాయపడలేరు అనుకున్నప్పుడే... పది సార్లు కాదు ఇరవై సార్లు మీ సొంత ప్రయత్నం చేసిన తరువాతే ఈ ప్రయత్నం చేసి చూడండి.

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మ విశ్వాసం ఎవరికి ఉంటుంది? అటువంటి సమయంలో మీకు వచ్చే మంచి జాబ్ అవకాశాలను కూడా సరిగా వాడుకునే శక్తి మీకు సన్నగిల్లుతోంది. దానికి కారణం మీకు ఆ జాబ్ కు సంబంధించిన పరిజ్ఞానం తగినంత లేకపోవడం కాదు, మీకు తగినంత ఆత్మ విశ్వాసం లేకపోవడం. మీ "ఆంతరంగిక భయం". ఇంటర్వూకి వెళ్లినప్పుడు ఒకవేళ ఇ అవకాశం పోతే నా పరిస్థితి అధోగతే అనే ఆలోచనలతో, తెలియని ఆందోళనతో వంట్లో సన్నని వణుకు లాంటిది కూడా వస్తోంది. ఇక నావల్ల కాదు అని మీకు అనిపించింది. నిరాశ ఆవహించింది. ఏ దిక్కూ తోచటంలేదు. పోనీ అప్పుడే ప్రయత్నించండి. కాని చేతులు కాలేదాకా వేచి ఉండడం కన్నా... పరిస్థితులు మీకు కష్టంగా మారుతున్నాయి అని తెలిసిన వెంటనే ప్రత్నించడం మంచింది.

ఉగాది నాడు ఎలాగో పంచాంగం చెప్పించుకుంటారు కదా... అప్పుడే మీ జాతకం కూడా చూపించుకుని జాతక రీత్యా, గోచార రీత్యా ఏఏ గ్రహాలను శనత పరచాలో తెలుసుకుని, ఆ యా గ్రహాలకు తగిన విధంగా జపం చేసుకోండి. విజయం మీదే.
నవ గ్రహాలకు ఇష్టమైనవి:


సూర్య:
ఇష్టమైన వారం: ఆది వారం, ఇష్టమైన రంగు: ఎరుపు, గ్రహ అధి దేవత: నారాయణుడు, చేయ వలసిన జప సంఖ్య: 6000, దానం ఇవ్వవలసిన ధాన్యం: గోధుమలు, హోమం చెయ్య వలసిన సమిధ: జిల్లేడు, ధరించ వలసిన రత్నం: మాణిక్యము (కెంపు).

చంద్ర:
ఇష్టమైన వారం: సోమ వారం, ఇష్టమైన రంగు: తెలుపు, గ్రహ అధి దేవత: లక్ష్మి, చేయ వలసిన జప సంఖ్య: 10000 , దానం ఇవ్వవలసిన ధాన్యం: ధాన్యం (బియ్యం), హోమం చెయ్య వలసిన సమిధ: మోదుగ, ధరించ వలసిన రత్నం: ముత్యం.

కుజ:
ఇష్టమైన వారం: మంగళ, ఇష్టమైన రంగు: ఎరుపు, గ్రహ అధి దేవత: కుమార స్వామి, చేయ వలసిన జప సంఖ్య: 7000, దానం ఇవ్వవలసిన ధాన్యం: కందులు, హోమం చెయ్య వలసిన సమిధ: చండ్ర, ధరించ వలసిన రత్నం: పగడం.

బుధ:
ఇష్టమైన వారం: బుధ వారం, ఇష్టమైన రంగు: ఆకుపచ్చ, గ్రహ అధి దేవత: విష్ణువు / గణపతి, చేయ వలసిన జప సంఖ్య: 17000, దానం ఇవ్వవలసిన ధాన్యం: పెసలు, హోమం చెయ్య వలసిన సమిధ: ఉత్తరేణి, ధరించ వలసిన రత్నం: పచ్చ.

గురు:
ఇష్టమైన వారం: గురు వారం, ఇష్టమైన రంగు: పసుపు, గ్రహ అధి దేవత: శంకరుడు, చేయ వలసిన జప సంఖ్య: 16000, దానం ఇవ్వవలసిన ధాన్యం: శనగలు, హోమం చెయ్య వలసిన సమిధ: రాగి, ధరించ వలసిన రత్నం: కనక పుష్యరాగం.

శుక్ర:
ఇష్టమైన వారం: శుక్ర వారం, ఇష్టమైన రంగు: తెలుపు/ గోధుమ, గ్రహ అధి దేవత: మహా లక్ష్మి, చేయ వలసిన జప సంఖ్య: 20000, దానం ఇవ్వవలసిన ధాన్యం: బొబ్బర్లు, హోమం చెయ్య వలసిన సమిధ: మేడి, ధరించ వలసిన రత్నం: వజ్రం.

శని:
ఇష్టమైన వారం: శని వారం, ఇష్టమైన రంగు: నలుపు, గ్రహ అధి దేవత: శివుడు / వేంకటేశ్వరుడు , చేయ వలసిన జప సంఖ్య: 19000 దానం ఇవ్వవలసిన ధాన్యం: నల్ల నువ్వులు, హోమం చెయ్య వలసిన సమిధ: జమ్మి, ధరించ వలసిన రత్నం: ఇంద్ర నీలం.

రాహు:
ఇష్టమైన వారం: శుక్ర వారం, ఇష్టమైన రంగు: బూడిద రంగు, గ్రహ అధి దేవత: దుర్గ/ సుభ్రమణ్య స్వామి, చేయ వలసిన జప సంఖ్య: 18000, దానం ఇవ్వవలసిన ధాన్యం: మినుములు, హోమం చెయ్య వలసిన సమిధ: గరిక, ధరించ వలసిన రత్నం: గోమేధికం.

కేతు:
ఇష్టమైన వారం: బుధ వారం, ఇష్టమైన రంగు: చిత్ర వర్ణం( రంగు రంగుల పువ్వులు, చుక్కలు ఉన్న వస్త్రాన్ని వాడ వచ్చు), గ్రహ అధి దేవత: కాళి/గణపతి, చేయ వలసిన జప సంఖ్య: 7000, దానం ఇవ్వవలసిన ధాన్యం: ఉలవలు, హోమం చెయ్య వలసిన సమిధ: దర్భ, ధరించ వలసిన రత్నం: వైఢూర్యం.

శ్రీ విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. :)

Friday, March 20, 2009

మీరు కష్టంలో ఉన్నప్పుడు...

ఇదివరకటి తరంకంటే నేటి తరానికి స్మస్యలు, కష్టాలు ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అందుకు కారణాలు అనేకం. సాధారణంగా కష్టంలో ఉన్నప్పుడే మనకు ఒక తోడు అవసరం. అది మనుషులు తీర్చగలిగే సమస్య కానప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. మనలో ఏమూలో దాక్కున్న భక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలో చించని వారు సైతం పరమ భక్తులు అవుతుంటారు.

కనీసం మనం కష్టంలో ఉన్నప్పుడైనా ఆ భగవంతుడిని శరణు వేడడం ఆనంద దాయకం. అప్పుడు కూడా ఆ భగవంతుడిని నమ్మక ఏదో ప్రయోగాలు చేస్తూ అష్ట కష్టాలు పడుతున్న వారూ ఉన్నారు. బయట పడుతున్న వారూ ఉన్నారు. కానీ అది చాలా తక్కువ శాతం.

మీరు నిజంగా కష్టంలో ఉంటే అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్కసారి... ఒకే ఒక్కసారి ఆ సర్వేస్వరుడిని ప్రార్దించండి. మనస్ఫూర్తిగా మీ కష్టాలనన్నింటినీ ఆయనకు నివేదించండి. ఆయన మీ సమస్యలు తీరుస్తాడని నమ్మండి. మీకు కనిపించే మార్గంలో ప్రయాణించండి. మీ గమ్యానికి తప్పక చేరుకుంటారు.

మీరు పూర్తి ఆనందంతో జీవిస్తుంటే ఏపూజా చేయనఖర్లేదు, ఏ శ్లోకాలూ చదవనఖర్లేదు. కానీ బాధలో ఉంటే... కష్టాలలో ఉంటే... ఆ సమస్య ఎంత పెద్దదైనా... చిన్న చిన్న పరిష్కార పద్ధతుల ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు.
అలాంటి పద్దతులలో అందరూ ఆచరించదగిన, సులభమైన పద్దతి శ్లోక పారాయణ ఒకటి. ఈ శ్లోకాలు ప్రతినిత్యం చదవడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి.నేను నాపురోహితంలో చాలా మందిచేత వివిధ పద్దతులలో చదింవించి మంచి ఫలితాలు రాబట్టాను. బ్లాగు మిత్రులందరికీ కూడా ఈ శ్లోకాలు ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తున్నాను.
అన్ని విఘ్నాలూ తొలగి, అనుకున్న పనులు సకాలంలో సిద్ధించుట కొరకు ఈ క్రింది శ్లోకాన్ని ప్రతినిత్యం మూడు సంధ్యలలో భక్తితో పఠించాలి. విద్య, ధనం, సంతానం, మోక్షం కోరుకున్నది ఏదయినా ఆరు నెలలలో ఫలితం లభిస్తుంది. సంవత్సరంలో మంత్ర సిద్ధి కలుగుతుంది. ఇందులో సంశయం లేదు. తరువాత ఈ శ్లోకాన్ని స్వయంగా రాసి ఎనిమిది మంది బ్రాహ్మలకు/ బ్రహ్మచారులకు/విద్యార్థులకు ఇచ్చినట్లైతే వారికి అఖండ విద్య లభిస్తుంది.

1. సంకటనాశన గణేశ స్తోత్రం:

నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం,
భక్తా వాసం స్మరేన్నిత్యం, ఆయుహ్ కామార్ధ సిద్ధయే.

ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకం,
తృతీయం కృష్ణ పింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం.

లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవచ,
సప్తమం విఘ్నరాజంచ, ధూమ్ర వర్ణం తథాష్టమం.

నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకం,
ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం.

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యహ్ పఠేన్నరహ్,
న చ విఘ్న భయం తస్య, సర్వ సిద్ధికరం ప్రభో!

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం.

జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైహ్ ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధించ, లభతే నాత్ర సంశయహ్.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యహ్ సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతహ్.

ఇతి శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణం.


సర్వ గ్రహ బాధలు తొలగి, అన్నిటా విజయం లభించుట కొరకు

2. శ్రీదేవీ ధ్యానం:


ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

ఓం సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతనే
గుణాశ్రయే గుణ మయే నారాయణి నమోస్తుతే.

ఓం శరణాగత దీనార్తా పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే.

ఓం ఓంకార పంజరశుకీం ఉపనిషమదుద్యాన కేళీ కలకంఠీం
ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం.

ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే.


మరిన్ని శ్లోకాలు త్వరలో.... :)