Monday, May 30, 2011

రాముడు ఏమి తపస్సు చేశాడు?

      రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?

     కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు. నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత " ధర్మాచరణం " .  ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి. ఇందులోని విచిత్రమేమిటంటే  ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.

తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.  అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  |అని ఉపనిషద్వాక్యం.


 ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము , వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే. 



    దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.

  కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు. అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".  ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు. 



Sunday, May 29, 2011

ఈ పేద పిల్లల చదువుకు సహాయమందించండి

నమస్కారం
     నేను పురోహితుడినైనా అనవసర భేషజాలకు పోకుండా నేను నివసించే ప్రాంతంలోని గుడిసెలలోని వారితో అప్పుడప్పుడు మాటలు కలుపుతుంటాను. వారి పిల్లలో గల ఆత్మన్యూనతను పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి అవీ ఇవీ పెట్టి మాటలలో వారి వివరాలు తెలుసుకుంటూ ఉంటాను. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ పాఠాలు ఎలా జరుగుతున్నాయో పిల్లల ద్వారా తెలుసుకుంటాను. వారికి ఆడుకోవడానికి కావలసిన వస్తువులు, చదువుకు కావలసిన నోటు పుస్తకాలు కొనిపెడుతుంటాను. వారికి అప్పుడప్పుడూ చిన్న చిన్న తరగతులు నిర్వహిస్తూ ఉంటాను.

అలా నాకు తెలిసిన ఒక అమ్మాయి పదవ తరగతి పాసయింది. కానీ తల్లికి పక్షవాతం రావడంతో ఇంటి పని వల్ల, పెద్దలు ప్రోత్సహించక పోవడం వల్ల, ధనము లేక ఇంటర్ కు వెళ్ల లేక పోతోంది. ఒక సంవత్సరం ఖాళీగా గడిపింది. చాలా రోజుల తరువాత మొన్న నాకు కలిసి విషయం చెప్పి నాకు చదువుకోవాలనుంది అని చెప్పింది.  "ఎవరైనా సహాయం చేస్తే నువ్వు చదువుకుంటావా?" అని అడిగితే తప్పకుండా చదువుతాను అని చెప్పింది.

తల్లి తండ్రులు కూలి పని చేసుకునే వారు. వాళ్ల ఇళ్లలో పదవతరగతి పూర్తిచేసినది ఈ అమ్మాయి మాత్రమే. ఇంటర్ చదవాలను కుంటోంది. సంవత్సరానికి ఎనిమిది నుండి తొమ్మిది వేలు అవుతాయి. రెండుసంవత్సరాలు సహాయం కావాలి. ఇది ఒక్కరే అందించినా ఫర్వాలేదు. నలుగురైదుగురు కలిసైనా ఫర్వాలేదు. ఏదో విధంగా ఆ అమ్మాయిని చదివించగలిగితే తప్పక ఆ అమ్మాయి వృద్ధిలోకి వస్తుంది. 

అలాగే మరో అమ్మాయి ఉంది. ఆమెకు పన్నెండు సంవత్సరాలు ఉంటాయేమో. ఇళ్లలో పాచి పనికి వెళుతుంది. కానీ ఆ అమ్మాయి పనిచేస్తూ పాటలు పాడుతుంది. ఉన్నది ఉన్నట్టు గా అద్భుతంగా పాడుతుంది. ఈశ్వర ప్రసాదం వలన ఆ అమ్మాయికి చక్కటి స్వరం ఉంది. ఎవరైనా సహాయపడి సంగీతం నేర్ప గలిగితే ఆ సినిమా పాటలకు బదులు చక్కటి కీర్తనలు పాడుకుంటూ తరిస్తుంది. దయచేసి ఎవరైనా సహాయం అందించండి.

ఆసక్తి కలిగిన వారెవరైనా ఉంటే నాకు మెయిల్ చెయ్యగలరు.


rajasekharuni.vijay@gmail.com


Cell no : 9000532563

నేను చెయ్యగలిగినది మధ్యవర్తిత్వం ఒక్కటే. నాదగ్గర ధనములేదు. కానీ అవసరం ఎక్కడ ఉందో నేను సూచించ గలను. ఎవరైనా స్పందించి సహాయపడితే ఆపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అన్నదే నాతపన. అందుకే ఈ చిన్ని ప్రయత్నం.  ఈశ్వరానుగ్రహం కలిగి ధన సమృద్ధులైన వారు ముందుకు వచ్చి సహాయం అందించండి. ఒక వేళ మీరు సహాయం చేయలేక పోయినా, దానికి సమర్థులైన మీ స్నేహితులకు ఈ టపా చిరునామా ( post link ) ని మెయిల్ చెయ్యండి. మీరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదించిన వారవుతారు.

ధన్యవాదములు

Sunday, May 15, 2011

సంధ్యావందనం తరగతులు నిర్వహించ బడుతున్నాయి

నమస్కారం

వైశాఖ బహుళ విదియ  అనగా May 19 వతేదీ నుండి సంధ్యావందనము నేర్ప బడుతున్నది. ఉపనయనము ఐనవారు పాల్గొన వచ్చును.

ముద్రలతో , సుస్వరము గా నేర్చుకొన దలచిన వారికి, భాగ్యనగర వాసులకు ఇది మంచి అవకాశము. సద్వినియోగ పరుచుకొనగలరు.


సంధ్యా హీనో2శుచిర్నిత్యం అనర్హస్సర్వ కర్మసు
యదన్యత్ కురుతే కర్మ తత్సర్వం నిష్ఫలం భవేత్

సంధ్యాహీనుడైన వాడు నిత్యము అశుచి అవుతున్నాడు. అతడు కర్మలు చేయుటకు అనర్హుడు. ఒకవేళ ఏదైనా కర్మ చేసినా అది నిష్ఫలమే అవుతుంది.  

రోజూ స్నానం చేయుటచేత దేహము ఎలా శుభ్ర పడుతున్నదో, అదేవిధముగా మనము రోజూ చేసే సంధ్యావందనము మన మనస్సును శుభ్ర పరుస్తున్నది. రోజు ప్రారంభమున స్నానము చేయుట ఎంత ప్రధానమో, ఏ కర్మ చేయుటకైనా ముందు సంధ్యావందనము చేయుట ద్వారా మనసును స్థిర పరుచుకొనుటకూడ అంతే అవసరమని తెలుస్తున్నది.

కనుక బ్రాహ్మణులైన ప్రతీ ఒక్కరు సంధ్యావందనమును తమ కనీస కర్తవ్యముగా గుర్తించి, ప్ర్తీతితో నిర్వహించాలి.

మనము చేయడమే కాక మన చుట్టూ ఉన్న నలుగురికి నేర్పి ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశముతోనే  కొన్నిటినైనా ( సంధ్యావందనం, మంత్ర పుష్పం, నమక చమకములు వంటివి ) సుస్వరంగా నేర్పాలని ఈ ప్రయత్నము చేస్తున్నాను.   

అమ్మ అనుగ్రహముతో ఎంత ఎక్కువమంది నేర్చుకోగలిగితే అంత సంతోషము.

పాల్గొన దలచిన వారు నాకు మెయిల్ చేసి లేదా నాకు ఫోన్ చేసి ( సాయంత్ర పూట మాత్రమే )  సంప్రదించ గలరు.


rajasekharuni.vijay@gmail.com

cell no : 9000532563

ధన్యవాదములు
--

ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

http://rajasekharunivijay.blogspot.com/  

దేవాలయాలు - నిర్వహణ - కొన్ని విశేషాలు

      పూర్వం రాజులు ఆయా ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడ తమకు ఎదురైన దేవతా మూర్తుల అద్భుత శక్తులకు ముగ్ధులై దేవాలయములను నిర్మించే వారు. అలాగే దేశమున కరువు కాటకములు, మానసిక పైత్యములు ప్రబలినపుడు  పండితుల సూచన మేరకు కొందరు  రాజులు దేవాలయములను నిర్మించే వారు.  ఇది ఉత్తమమైన పద్దతి.

   కొందరు పేరు ప్రతిష్ఠలు లేదా అధికారము చిరకాలము నిలుపుకొనుటకు నిర్మించేడివారు. నేడు కూడా పేరు కోసమో, పరపతి తెలుపుకొనుటకో/ పెంచుకొనుటకో, మరికొంచెం నీచ స్థాయికి దిగి దేవాలయాల పేరుతో ధనమును చేకూర్చుకొనుటకో దేవాలయములు నిర్మిస్తున్నారు.

                                               

ఇవేవీ కాక మరో కారణం వలన కూడా దేవాలయములను నేడు నిర్మించు వారు కనిపిస్తున్నారు.

   మనలో చాలా మందికి ఎంతోకొంత సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉంటుంది. కొందరికి అది సంకల్పంగానే ఉంటుంది. కొందరి విషయంలో అది కార్య రూపం దాలుస్తుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం, అనాథలకు - వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, అన్నార్తులకు అన్నదానం చేయడం, ఉచిత వైద్య సేవలు అందజేయడం ఇలా అనేక  రూపాలలో తమ సేవను సమాజానికి పంచుతుంటారు. వీటన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి అని అందులో కొందరు కొంచం ముందడుగు వేసి ఆలోచిస్తారు. మన జీవిత గమ్యం సర్వవ్యాపి అయిన ఆపరమేశ్వరునిలో లీనమవడమే అని నమ్మిన కొందరు సాధ్యమైనంత ఎక్కువ మందికి అటువంటి పురోగతిని సాధించుటలో సహాయపడడమే నిజమైన సేవ అని తెలుసుకుంటారు. కొందరికి ఆకలి బాధ ఉండవచ్చు. కొందరికి ఆరోగ్య బాధ ఉండ వచ్చు. కాని నేటి రోజులలో ఎందరికో మానసిక బాధలు. అన్నీ ఉన్న వానికీ, ఏమీలేనివానికీ కూడా ఈ మనోవ్యధలు తప్పడం లేదు. ఈ మానసిక అస్థిరతను సరిచేయుటకు వేద సాంప్రదాయమున అనేక ఉపాయములు ఉన్నవి. అందు ‘భక్తి మార్గము’ ఒకటి. అటువంటి భక్తి మార్గమును అవలంబిచుట వలన ఇహమున కల అనేక సమస్యలను సరిదిద్దుకొన గలుగుటయే కాక, ఏదైతే జీవన పరమ గమ్యమని ఆధ్యాత్మికులు నమ్ముదురో ఆ గమ్యమును చేరుటకూడా సులభతరమౌను. కనుక ఈ విషయముల యందు అత్యంత నమ్మిక ఉన్న కొందరు ఒక దేవాలయమును  నిర్మించెదరు. సద్గురువులైన పండితులను అర్చకులుగా నియమించి, వారి ఆదేశానుసారం నడుస్తూ తాము తరించడమే కాక అనేక మందికి ఒక ఆధారామును ఇచ్చి తరింపచేసిన వారవుతున్నారు.   వీరు ఉత్తమమైన ధర్మకర్తలు అని చెప్పవచ్చు.


    ఒక విగ్రహము పెట్టి, అందంగా  నాలుగు గోడలు నిర్మించినంత మాత్రమున అది దేవాలయము అయిపోదు. ఒక వేళ అలా పిలువబడినా  అది ప్రాణం లేని దేహముతో సమానము. సర్వఙ్ఞుడైన ఆచార్యుడు( అర్చకుడు), అతని ఆదేశానుసారము నడుచుకొను ధర్మకర్త , ఆచార్యుని ఉపాసనచే కలుగు మంత్ర శక్తి, ధర్మనిష్ఠ, నియమ పాలన  అనునవి ఐదు పంచప్రాణముల వంటివి. నిర్మాణము కేవలము దేహము మాత్రమే.  దేవాలయము అనునది ఒక అద్భుత శక్తి కేంద్రము. దేవాలయము నుండి ఆశక్తి తరంగములు అక్కడి ఉపాసనా శక్తిని బట్టి దేశ దేశాంతరములు ప్రసరిస్తాయి. కేవలము మనము మాత్రమే పూజలు జరిపితే అక్కడ కొంత శక్తిమాత్రమే కేద్రీకృతమౌతుంది. అనేక మంది, అనేక పర్యాయములు నిరంతరాయంగా జరుపుతూ ఉంటే అక్కడ అఖండ శక్తి ప్రసారం జరుగుతుంది. ఆ అవకాశం దేవాలయములలో మాత్రమే ఉంది. తత్కారణం గా ఎన్నో అలజడులతో దేవాలయమునకు వచ్చిన వారికి కూడా దేవాలయములో అడుగు పెట్టగానే ఒక చక్కటి ప్రశాంతత కలగడం, అసలు పరిష్కారమే లెదు అనుకున్న సమస్యలకు కూడా భగవంతుని సన్నిధిలో ఒక పరిష్కారం లభించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పేద, ధనిక భేదంలేదు. ఎవరు ఎలా వచ్చినా ఆర్తితో ప్రార్థన చేసినంత మాత్రముననే ఒక సద్భావన మనసును ఆక్రమిస్తుంది. అటువంటి ఉత్తమ ఫలితాలు కలగాలంటే ధర్మకర్తలు, అర్చకులు ఉత్తములై ఉండాలి. మొదట వీరిద్దరు భక్తులైన నాడు మిగిలిన వారికి మార్గము చూపగలరు. కేవలము చూపులకు భక్తి నడవడిక కలిగిన ధర్మకర్తలు, అర్చకులు దేవాలయమును  ఉత్తమముగా తీర్చిదిద్దలేరు. ఒకరికొకరు పరస్పర సహకారము వలన మాత్రమే శక్తి కేంద్రమైన దేవాలయము తయారవగలదు. 


సేవలన్నిటిలోకీ ఉత్తమమైన సేవ ఈ దేవాలయ నిర్వహణ. దీని ద్వారా ఎందరో ఆర్తులకు పరమేశ్వరుని అనుగ్రహము కల్పించ వచ్చు.  భక్తి తత్పరులైన ధర్మకర్తలు  పరమ భక్తులైన, ఉపాసకులైన అర్చకులను నియమించి వారి సలహా ప్రకారము దేవాలయమును నిర్వహించవలెను. అప్పుడు అది ఆనంద నిలయము అవుతుంది. లేనిచో కేవలము పేరుకు మాత్రమే దేవాలయముగా నిలచి చేతలకు అది ఒక వ్యాపార కేంద్రము అవుతుంది.

"దేవాలయాలు" అనే లేబుల్ తో ఉన్న మరిన్ని టపాలను ఇక్కడ చూడండి.