Saturday, April 21, 2012

నేటి విద్యావిధానం ఎంతవరకు సమంజసం? ఎలాంటి విధానం రావాలి?


      ఒకటి నుండి పది వరకూ కల పాఠాలన్నీ ఒక సంవత్సరంలో నేర్చుకో గలిగే వీలుందా? అలాంటి సిలబస్ ను ఎవరైనా తయారు చేశారా? అలా నేర్పగలిగిన సమర్థత ఉన్న ఉపాధ్యాలు నేటి సమాజంలో ఎందరు ఉన్నారు? ఒక వేళ ఉంటే కనుక అనేక కారణాల వల్ల చిన్నప్పుడు స్కూలుకు సరిగా వెళ్లలేక చదువులో వెనకబడిన ఎందరో విద్యార్థులకు అది ఒక వరంగా మారుతుంది. ముఖ్యంగా మావంటి వంశపారంపర్య వృత్తులు అవలంబించే కుటుంబాల విద్యార్థులకు చాలా అవసరం.
   ఒక పిల్లవాడు చిన్నప్పుడు తెలియని తనం వల్ల స్కూలు పాఠాలపై ఆసక్తి చూపక ఆటలలో పడి మొద్దుగా తయారయాడనుకుందాం. అంటే అతనికి నిజంగా తెలివితేటలు, ఙ్ఞాపకశక్తి లేవని అర్థమా? కానేకాదు. అతనికి పాఠాలపై ఆసక్తి కలుగలేదని మాత్రమే అర్థం చేసుకోవాలి మనం.  ఆసక్తి ని కలుగజేయగలిగితే అతను స్కూలు పాఠాలలోనూ రాణించగలడు. ఒక వేళ ఏ పదవతరగతికి వెళ్లిన తరువాతో అతనికి ఆసక్తి కలిగితే అతను పాఠాలపై పట్టు సాధించడం ఎలా?
  ఒక అనాధ పిల్లవాడినో, ఏచెత్త ఏరుకునే వాడినో తీసుకువచ్చి వాడికి చదువుకునే ఏర్పాటు చేశామనుకోండి వారు చదువుతారా? వీరికి ప్రథమంగా ఆసక్తి ఉండదు. ఒకవేళ కలిగించినా పెరిగిన వాతావరణం వల్ల క్రమశిక్షణ కొరవడి చదువులో రాణించలేరు. ప్రాథమిక స్థాయినుండీ ప్రస్థుతం వారి వయసుకు సరిపడు తరగతి స్థాయి వరకు చెప్పవలసిన అంశాలన్నిటినీ క్లుప్తీకరించి చెప్పగల విద్యాసంస్థలు ఏవి? 
  ఇంకో తరహా విద్యార్థులు కూడా ఉంటారు. వారు చిన్నప్పుడు వృత్తి విద్యలు నేర్చుకుని ఆక్రమంలో ఆంగ్ల విద్యపై సరైన శ్రద్ధపెట్టక ఏ పదహారు సంవత్సరాల వయసులోనో టెంత్ రాయాలని ఆసక్తి కలిగి ప్రయత్నించే వారు. ఉదాహరణకుబ్రాహ్మణ కుటుంబాలలో చిన్నప్పుడు ఐదవ తరగతి వరకు స్కూలుకు పంపుతారు. తరువాత వేదవిద్య నేర్పుతారు. మళ్లీ పదిహేను పదహారు సంవత్సరాల సమయంలో వాళ్లకి స్కూలుకు వెళ్లి టెంత్ రాయగల అవకాశం దొరుకుతుంది.  కానీ వారి స్థాయి ఐదవతరగతి లో ఉంటుంది. ఒకేసారి పదోతరగతి స్థాయి పాఠాలు చెప్పడం ప్రారంభిస్తే వేదవిద్యలో అద్భుతంగా రాణించిన విద్యార్థులే ఆంగ్లవిద్యలో బాగా వెనకబడి పోతారు. గుణింతాలే రానివాడికి త్రికోణమితి, శ్రేఢులు, మాత్రికలు స్థాయిలో చెప్తే ఏమి ఎక్కుతుంది?
   ఇటువంటి వారికి నేర్పడానికి సరైన విద్యా సంస్థలు లేవు. సరైన సిలబస్ లేదు. అప్పటికప్పుడు ముక్కునపట్టి బోధించుటకు వెళ్లే ఉపాధ్యాలు అధికంగా ఉన్న రోజులలో తమ సబ్జక్ట్ పై పూర్తి ( కనీసం పదవతరగతి వరకు కావలసిన ) అవగాహన కలిగి పిల్లవాడు ఏస్థాయిలో ఉన్నాడో గుర్తించి, ఆ స్థాయినుంచి బోధింగల ఉపాధ్యాయులు చాలాచాలా తక్కువ.
  వీరికి చదుకునే అవకాశం ఇక లేదా? ఏ చదువు అయినా చదవగల సత్తా ఉన్నవాడికి, అవకాశం ఉన్నవాడికీ నేర్పడం కాదు కదా మనలక్ష్యం. చదువురాని వాడికి, దానికి కారణాలు తెలుసుకుని అవిసవరించుకుంటూ ముందుకు తీసుకువెళ్లగలిగినపుడే పిల్లల్లో ఎక్కువశాతం మందికి న్యాయం జరుగుతుంది.