Monday, June 18, 2012

మడి అంటే ఏమిటి?

మడి అంటే ఏమిటి? : మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి.  నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి? : రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం.  ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక  ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల  అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )  మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే  సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు.  ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు.  ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.   
 
మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని  గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో  గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటి తరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్ది కొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.  ఆసక్తి కలిగిన వారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవ్వాలి. మనల్ని మనము కాపాడు కోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవత్వం అనుభవము లోకి వస్తాయి. 

  నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.  

శుభంభూయాత్!

Wednesday, June 13, 2012

తిరుమలలో అంగప్రదక్షిణకు ఏ సమయంలో అనుమతిస్తారు?

తిరుమలలో  అంగప్రదక్షిణ చేయవలసిన  విధానం:



ముందుగ తిరుమలలో  విచారణ కార్యాలయము  దగ్గరలో ఉన్న సేవ టికెట్ కార్యాలయములో  సాయంత్రం ఏడు గంటలకు టోకెన్ ఇస్తారు. ( రు. 200 లు చెల్లించి టోకెన్ తీసుకోవాలి) - భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని  సాయంత్రము 4 గం. నుంచి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఎదురుగా క్యూలో నిలబడి మీరే స్వయముగా వెళ్లి, ముందుగా మీ వేలి ముద్రలు ఇచ్చి, టిక్కెట్లు అక్కడనే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఎదురుగా , విజయ బ్యాంకు కౌంటరులో తీసుకోవలెను. టికెట్టు ఎవరికి వారే తీసుకోవాలి. ఇతరులను రానీయరు, అంగ ప్రదక్షణ చేసే వాళ్ళను మాత్రమే రాణిస్తారు.

     టోకెన్ తీసుకున్న వారు అదే రోజు రాత్రి ఒంటి గంట సమయములో కోనేరులో స్నానము చేసి తడి బట్టలతో (ఆడవారు అయితే చీర, సల్వార్ కమీజ్, మగ వారు చొక్కా లేకుండా) వైకుఠం క్యూ  సముదాయం ద్వారా   లొపలికి ప్రవేశించాలి. అంగప్రదక్షిణ  చెసే భక్తులకి సుప్రభాత సేవ  తరువాత  గర్భ అలయ ప్రాకారములో సుమారు 3 నుంచి 4 గంటల  మధ్యలో   గర్భాలయములో ప్రవేసించే ద్వారం దగ్గర నుండి హుండీ ఉన్న ప్రదేశము వరుకు  అంగప్రదక్షిణ చేయనిస్తారు.  ఆ తరువాత వారిని దర్శనానికి గర్భ అలయములొ ప్రవేసించే ద్వారం ద్వారా లోనికి పంపుతారు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కడుపులో తిప్పటం లేక వాంతి అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక ముందు రోజు ఎంత తక్కువ తింటే అంత తేలికగా ప్రదక్షిణలు చేయవచ్చు.