Friday, August 24, 2012

శ్రీ రామ నామ మహిమ

 



జపమనగా :

శ్లో// జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః/
తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః //

‘జ’ కారము జన్మ నాశనమును ( మోక్షము ను ), ‘ప’ కారము పాపనాశనమును సూచించును. అనగా పాపములను నాశనము చేసి, మరల జనన మరణములు లేకుండా మోక్షమొసంగు నట్టిది గనుకనే " జపం" అని చెప్పబడినది.

శ్లో// ప్రణవో థనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే/
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్//

భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు. ఆత్మయైన సాధకుడే బాణము. బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము.  సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని,  నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురిచూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మమునందు జేరి తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.

జపానికి ఇంతటి శక్తి ఉంటే!, ఇక " శ్రీ రామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!?

శ్రీ రామ నామ మహిమ :

శ్లో// గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః
వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః//

 తా: గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటికంటెనూ అధిక ఫలము ఈ రామ నామ జపము వలన కలుగు తుంది. 

రామ నామము జపించుచుండుట వలన గాని, ఈ రామ నామమునే మరణాసన్నులైన వారి కుడి చవిలో ఉపదేశించుట వలన గానీ, ఎవరయినను మోక్షము బొందెదరని శ్రీరాము శివునకు ఉపదేశించెనట.

  "ర" అగ్ని బీజం - దహింప జేయునది,
  " ఆ" వాయు బీజం - సర్వగతము, ఆకర్షకము,
"మ" ఆకాశ బీజం - శతృ మోహన కరము

  ఇటువంటి అగ్ని బీజ, వాయుబీజ, ఆకాశ బీజ సమ్మిళితమైన " శ్రీ రామ" నామ మహిమ ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.

 శ్లో// చిద్వాచకో ర కారస్స్యాత్ సద్వాచ్యో2కార ఉద్యతే/
మకారానంద వాచస్స్యాత్ సచ్చిదానంద మవ్యయమ్//
  "ర" కారము చిత్తు,  "ఆ" కారము సత్తు,  "మ" కారము ఆనందము. వీటి సంయోగముచే నాశరహితమైన "సచ్చిదానంద రూపమే శ్రీరామ" నామము.
అలాగే "ర" కారము వైరాగ్యమునకు హేతువు, "ఆ" కారము ఙ్ఞాన కారణము, "మ" కారము భక్తికి కారణము కనుక నిత్యము రామనామమను జపించు వారలకు భక్తి, ఙ్ఞాన, వైరాగ్యములు కలుగును.

శ్లో// "తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం//"
‘రామ రామ ’ అని క్షణ క్షణము జపించుచుండట వలన యమ దూతలు దరికి జేరుటకు కూడా భయపడి దూరముగా పారిపోవుదురు.

శ్లో// అఙ్ఞానాదధ వాఙ్ఞానా దుత్తమ శ్లోక నామయత్/
సంకీర్తిత మఘం పుంసోదహేత్యేవ యథానలః //
ప్రజ్వరిల్లెడి అగ్ని కట్టెలను కాల్చు చందమున, భగవన్నామ శక్తి తెలిసి కాని, తెలియక కాని ఏవిధంగా చేసినా మానవుల యొక్క పాపములను దహించి వేయును. 

 కనుక అటువంటి ‘రామ’ నామజపాన్ని మనము చేయుట వలన జన్మజన్మాంతరములలో చేసిన పాపములన్నీ నాశనమొంది ఇహమున సమస్త సంపదలూ పొందటమే కాక, పరమున మోక్ష ప్రాప్తిని పొందుదురు. 

రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది...

త్రేతాయుగంలోనే శ్రీ రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ. ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆనొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది!? అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

 రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలం గా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు, ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితోఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా!? నేనే ఇంత బాధపడుతున్నాను’ అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత  రామ నామ గానం చేస్తూ.. ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.
కనుక ఇటువంటి రామనామన్ని మనం చేస్తూ నలుగురి చేతా చేయిస్తూ పునీతులమౌదాం!


Thursday, August 16, 2012

నవగ్రహ జపం


విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా చేసుకునే జపమే ఉత్తమం. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.

 ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది.

నవగ్రహ శ్లోకాలు:

ఈ పై చిత్రాన్ని క్లిక్ చేసి దాన్ని పెద్దదిగా చూడండి ( లేదా ) సేవ్ చేసుకోండి .


నవ గ్రహ శ్లోకం :
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

రవి: 6000 సార్లు
జపాకుసుమ సంకాశం, కాస్యపేయం మహాద్యుతిం,
తమోరిం సర్వ పాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం.

చంద్ర: 10,000 సార్లు
దధి శంఖ తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం,
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం.

కుజ: 7,000 సార్లు
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం,
కుమారం శక్తి హస్తం, తం మంగళం ప్రణమామ్యహం.

బుధ: 17,000 సార్లు
ప్రియంగు కలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం,
సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

గురు: 16,000 సార్లు
దేవానాంచ ఋషీణాంచ, గురుం కాంచన సన్నిభం,
బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం.

శుక్ర: 20,000 సార్లు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం,
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం ప్రణమామ్యహం.

శని: 19,000 సార్లు
నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం.

రాహు: 18,000 సార్లు
అర్థకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్ధనం,
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం.

కేతు: 7,000 సార్లు
ఫలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం,
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం.

ఈ నవగ్రహ శ్లోకాలు ఎవరైనా పఠించవచ్చు. పైన గ్రహ శ్లోకాలు వాటి ప్రక్కనే చేయవలసిన జపసంఖ్య చెప్పడం జరిగింది. ఒక్కో సారి పరిస్ఠితుల తీవ్రతను బట్టి 2,3 లేక 4 గ్రహాలకు కూడా జపాలు చేసుకోవలసి రావచ్చు. ఆ జపసంఖ్యను పూర్తిచేయడానికి చాలాసమయం పడుతుంది కనుక ఒకేరోజులో పూర్తిచేయవలసిన అవసరం లేదు. కొన్ని రోజులు ( ఉదా: 3 లేదా 5 లేదా 9 లేదా 11 లేదా 21 లేదా 41) నియమం పెట్టుకుని రోజుకి కొంత పూర్తి చేసుకుని, ఆ గ్రహానికి ఇష్టమైన ధాన్యం ఇష్టమైన వారంలో దానం చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. నవ గ్రహాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నవ గ్రహాలను ప్రార్ధించడం ద్వారా ధర్మ బద్ధమైన మీ కోరిక ఎంతటిదైనా ఖచ్చితంగా తీరుతుంది. ముందుగా మీకున్న సమస్య ఏమిటో, దాన్ని తీర్చగలిగే శక్తి ఏ గ్రహానికుందో తెలుసుకోవటానికి అనుభవజ్ఞులైన జోతీష్యులను సంప్రదించి వారి సలహాపై జపం ప్రారంభించాలి.

ఈ 41 రోజులు దీక్షపూని, సాత్విక ఆహారాన్ని భుజిస్తూ, మితంగా మాట్లాడుతూ ఉండాలి. ఉదయాన్నే చేసే జపం సంఖ్యానియమం కలిగి ఉండాలి. అంటే రోజుకు వెయ్యి చేస్తాననో, రెండు వేలు అనో నియమం పెట్టుకోవాలి. అది ఎట్టి పరిస్థితులలోనూ ఆపకుండా సంఖ్య పూర్తి అయ్యే వరకూ రోజూ చెయ్యాలి. అలాగే మిగతా సమయంలో ( పనులు చేసుకుంటున్నప్పుడు ) కుడా  వీలయినన్ని సార్లు ఆ శ్లోకాన్ని చదువుతూ ఉండాలి. కానీ ఉదయం పూజా స్థలంలో కూర్చుని చదివే సంఖ్య మాత్రమే లెక్కకు వస్తుంది.

ఉదా: శుక్రునికి మొత్తం జప సంఖ్య 20,000 అయితే రోజుకు 1,000 చేస్తాము అన్న నియమంపెట్టుకుంటే మొత్తం జపం 20 రోజులు పడుతుంది. అదే 2 వేలు చేస్తాము అనుకుంటే 10 రోజులలో జపం పూర్తవుతుంది. మీ శక్తిని, సమయాన్ని బట్టి సంకల్పం చేసుకోవాలి.

 ఈ శ్లోక జపం చేసే రోజులలో మనసు జపం పై మరింత లగ్నం అవ్వడానికి ఏదో ఒక పురాణ ప్రవచనాన్ని వినే నియమాన్ని విధించుకోండి.   మీరు జపం చేద్దామని సంకల్పించ గానె పూర్తిచేయలేరు. గ్రహాలు మధ్య మధ్యలో అవాంతరాలు కలిగిస్తాయి. ఆపరీక్షకు తట్టుకుని పూర్తి చేయాలంటే మీ జప దీక్షా సమయంలో నవగ్రహ  ప్రదక్షిణం, గ్రహ జపం, పురాణ కథా శ్రవణం అను మూడూ నిత్యం జరగాలి.  ప్రదక్షిణ, జపం ఉదయం 6 నుండి 8  లోపు పూర్తి చేయాలి. పురాణం సాయంత్రమైనా వినవచ్చు.  ఈ మూడూ ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. జపానికి మధ్యలో అవాంతరాలు రాకుండా  మిగతా రెండూ మిమ్మల్ని కాపాడతాయి.

ఫలితం తప్పక రావాలంటే...
నేను ఇక్కడ రాశే ప్రతీ ఒక్కటీ తప్పక ఫలితాన్నిస్తాయి. ఇవన్నీ నేను చెప్పేవి కావు, ఎందరో అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పినవి. అయితే చేసే మీదగ్గరే ఉంటుంది ఫలితం రావడం, రాకపోవడం. ఎందరో ఎన్నో పూజలూ, వ్రతాలూ చేస్తున్నారు. మరి వాళ్లందరికీ ఫలితాలు వస్తున్నాయా అంటే రావట్లేదనే చెప్పాలి. ఫలితాలు వచ్చినవాళ్లకీ, రాని వాళ్లకీ తేడా ఒక్కటే... "నమ్మకం" అవును నమ్మకమే! అది ఉన్ననాడు ఫలితం తప్పక వస్తుంది. దానికి "ప్రయత్నం" తోడవ్వాలి. అలాంటి నమ్మకంతో కూడిన ప్రయత్నం చేస్తే " అదృష్టం" మీదవుతుంది.

ఉదాహరణకు: మీకు చిన్న ఉద్యోగం ఉంది. దానికి వచ్చే జీతం మీ అవసారలకు సరిపోక పోగా అప్పులపాలవుతున్నారు. సమస్యలు చుట్టుముట్టాయి. మీకు పెద్ద జాబ్ చేయగలిగె విద్య ఉంది, కానీ తగిన అవకాశాలు రావటంలేదు. అప్పుడు మీరు నగ్రహ ప్రదక్షిణలు చేయండి. తప్పకుండా మీకు చక్కటి జాబ్ దొరుకుతుంది. అయితే ప్రదక్షిణలు చేశాను కదా అని కాలుమీద కాలేసుకుని కూర్చుంటే జాబ్ మీ చేతుల్లోకి రాదు. ప్రదక్షిణలు చేస్తూనే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. వచ్చిన ఇంటర్వ్యూలను మీకు తెలిసినంతవరకూ చక్కగా ప్రిపేరై హాజరు అవ్వాలి. ఒక వేళ అది పోయినా మరో దానికి నమ్మకంతో ప్రయత్నించాలి. అప్పుడు చక్కటి జాబ్( 41 రోజుల ప్రదక్షిణలు చేసిన 3 నెలల్లో) మీకు తప్పక దొరుకుతుంది.

"ఆహా ఏమి చెప్పారండీ... మా అర్హతకు తగిన జాబ్ కోసం `నమ్మకం'తో మళ్లీ, మళ్లీ `ప్రయత్నం' చేస్తూ పోతే జాబ్ దొరక్క ఎక్కడికి పోతుందీ? అలా చేస్తే ఎవరికైనా జాబ్ దొరుకుతుంది. పది రాళ్లు విసిరితే ఒక్కటైనా తగలక పోదా..? ఆ మాత్రం దానికి 41 రో...జు...లు... మీరు చెప్పినట్లు చేయండందేనికి? " అంటారా....?

అవును మీరనుకునేది నిజమే... "నమ్మకం తో కూడిన ప్రయత్నం ఎక్కడ ఉంటుందో అక్కడ అదృష్టం ఉంటుంది". మీమీద మీకు అంత నమ్మకం ఉన్నంత వరకూ ఏ పూజా అవసరంలేదు. కానీ (పోనీ) ఆ ఆత్మవిశ్వాసం మీకు లేనప్పుడే నేను చెప్పిన ప్రదక్షిణలు చెయ్యండి. మీచుట్టూ సమస్యలున్నప్పుడే... మీ వల్లకాదు అనుకున్నప్పుడే... ఎవ్వరూ మీకు సాయపడలేరు అనుకున్నప్పుడే... పది సార్లు కాదు ఇరవై సార్లు మీ సొంత ప్రయత్నం చేసిన తరువాతే ఈ ప్రయత్నం చేసి చూడండి.

సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మ విశ్వాసం ఎవరికి ఉంటుంది? అటువంటి సమయంలో మీకు వచ్చే మంచి జాబ్ అవకాశాలను కూడా సరిగా వాడుకునే శక్తి మీకు సన్నగిల్లుతోంది. దానికి కారణం మీకు ఆ జాబ్ కు సంబంధించిన పరిజ్ఞానం తగినంత లేకపోవడం కాదు, మీకు తగినంత ఆత్మ విశ్వాసం లేకపోవడం. మీ "ఆంతరంగిక భయం". ఇంటర్వూకి వెళ్లినప్పుడు ఒకవేళ ఈ అవకాశం పోతే నా పరిస్థితి అధోగతే అనే ఆలోచనలతో, తెలియని ఆందోళనతో వంట్లో సన్నని వణుకు లాంటిది కూడా వస్తోంది. ఇక నావల్ల కాదు అని మీకు అనిపించింది. నిరాశ ఆవహించింది. ఏ దిక్కూ తోచటంలేదు. పోనీ అప్పుడే ప్రయత్నించండి. కాని చేతులు కాలేదాకా వేచి ఉండడం కన్నా... పరిస్థితులు మీకు కష్టంగా మారుతున్నాయి అని తెలిసిన వెంటనే ప్రత్నించడం మంచింది.


( పాత టపానే కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రచురించాను )

Wednesday, August 15, 2012

వైదిక వివాహ పద్ధతులలో - అనాచారములు




వైదికమైన షోడశ సంస్కారములలో వివాహము అతి ముఖ్యమైనది. అది వరునికి, వధువునకు కూడా మరు జన్మ వంటిది. అప్పటి వరకు తాము ఇద్దరిగా ఉన్నవారు వివాహమైన నాటి నుండీ ఇద్దరు కలిసి ఒక్కటిగా అవుతారు. ఆ ఇద్దరిని ఒక్కరిగా మార్చే ప్రక్రియే వివాహ క్రతువు. ఇది ఇద్దరి శరీరాలకు సంబంధించినది మాత్రమే కాదు, అది ఇద్దరి మనసులకు సంబంధించినది. ఆ మనసులను కలిపే ప్రక్రియ వివాహ మంత్రాలకు ఉన్నది అనుటలో ఎటువంటి సంశయము అవసరం లేదు. 

 ఇద్దరు వ్యక్తుల మనసులు కలవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక కార్యాలయం ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆ ఆఫీస్ లో బాస్ కి, అతని క్రింది ఆఫీసర్లకీ సరిఅయిన సమన్వయం కుదరాలి. ఓ క్రికెట్ జట్టు గెలవాలంటే ఆ జట్టు కోచ్ కి, లీడర్ కి, జట్టు సభ్యులకి సరిఅయిన మానసిక బధం ఏర్పడాలి. అలాగే ఓ కుటుంబం చక్కని ఉన్నతిని పొందాలంటే ఆ కుటుంబంలోని వ్యక్తుల మనసుల మధ్య ప్రేమ అంకురించాలి. ఆకుటుంబంలోని భార్య, భర్త ఎలా ఉన్నారు అన్నదానిని బట్టే వారి పిల్లలు ఎలా ఉన్నారు అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకే ఇంటిలో ఇద్దరు వ్యక్తులను సంవత్సరాల తరబడి ఉంచినంత మాత్రాన వారి మధ్య ప్రేమానురాగాలు జనిస్తాయనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.  దానికి మానవ ప్రయత్నంతో పాటు దైవబలం తోడవ్వాలి. అటువంటి దైవబలాన్ని ఇచ్చే ప్రక్రియే మన వైదికవివాహ పద్ధతి.   

 అత్యంత శ్రద్ధతో జరుప వలసిన ఈ వివాహపు తంతు నేడు కలి మాయ వలన ఆర్భాటాలకు లోనై అవైదికమైన పద్ధతులతో జరుగుతున్నది. వైదికంగా వివాహం జరుపుకోవాలన్న ఆసక్తి కలిగిన వారికి నేడు ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పేవారు కరువయ్యారు. ఎంతో కష్టపడి వివాహం గురించి తెలుసుకుని ఆవిధంగా నడుచుకోవాలన్న తపన ఏ ఒక్కరికో ఉన్నా అది మిగతా బంధువులు, స్నేహితులు సాగనివ్వడం లేదు. కానీ ధర్మాన్ని ఆచరించాలంటే ఇతరులు ఏమంటారో అన్న సంశయానికి లోనైతే కుదరదు. మనం ఒంటరిగానే ప్రయాణం ప్రాంరంభించ వలసి ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే మనకు కొందరు తోడవుతారు. తరువాతి తరాలకు మనం ఆదర్శమౌతాము. 

అటువంటి ఆసక్తి ఉన్నవారికి పెద్దలద్వారా తెలుసుకున్న కొన్ని సూచనలు  ఇక్కడ ప్రస్థావించ దలచాను. ఏ ఒక్కరికైనా అవి ఉపయోగ పడితే అది ఈశ్వరకృపగా భావిస్తాను. 

౧.వివాహ ముహూర్త విషయంలో ఆదివారం కావాలి. అదీ ఉదయమే కావాలి. లేదా రాత్రే కావాలి. రిసెప్షన్ చేసుకునే అవకాశం ఉండాలి అన్న విషయాలు గమనిస్తున్నారు. కానీ అది వధూవరుల భావి జీవనాన్ని నిర్ణయించేది. కనుక అటువంటి ముహూర్తము అత్యంత శ్రేష్ఠమైనది ఎప్పుడు కుదురుతుందో అప్పుడు నిర్ణయించండి అని అడిగేవారు చాలా అరుదు.
౨.    పెళ్లి మండపానికి మామిడి తోరణాలే ఉండడం లేదు.
౩. ఘటికా యంత్ర పూజలేదు.
౪. నాగటి కాడి పురోహితులు పట్టుకెళ్లాలి, అది ఆట వస్తువులా చిన్నది ఉంటుంది.  ఎద్దుల మెడపై కట్టి పొలం దున్నిన నిజమైన నాగటి కాడి  వాడాలన్న శ్రద్ధ ఎవరూ వహించడం లేదు.
౫. స్ప్రేల వంటివి చల్లుకోవడం, జీలుగు బండి ఉండలు, చంకీలు ప్లాస్టిక్ ముక్కలు తలంబ్రాల సమయంలో ఒకరిపై ఒక రు పోసుకోవడం, కొబ్బరి బోండాలకు సూదులు గుచ్చడం, మండపంపై బాంబులు పేల్చడం మొదలైన వికారములు మొదలైనవి.
౬. కెమేరా మెన్ వంటి వారు బూట్లతోనే మండపం పై తిరుగుతారుముందు కెమేరామెన్ హిందువాకాదా అన్నది ఎవరూ గుర్తించడం లేదు. ఇతర మతస్థులకు మన మత గౌరవం ఎక్కడ ఉంటుంది? చాలా పెళ్లిళ్లలో దీపం కుందులు పడతోసేది కెమేరామెన్ లే!
౭. పూర్వ సువాసినులు మండపంపై ఆసనాలు వేసుకుని కూర్చుంటారు. ముత్తైదువలు పందిరిలో ఎక్కడో చివరన కూర్చుని కబుర్లాడుతుంటారు.
౮. ఒంటి బ్రాహ్మణునితో వివాహం మొత్తం జరిగి పోతుంది. నలుగురు వేదపండితులని పిలవడం లేదు. ఆశీర్వచనం లేదు. వీడియోలకు, బ్యాండ్ మేళాలకు వేలు ధారపోస్తారు. వేదపండితులకు ఇవ్వడానికి అవసరమా అని అడుగుతారు.
౯. మధుపర్కాలకు బదులు రంగురంగుల పెళ్లి చీరలు వస్తున్నాయి.
౧౦. తెరసల్లా ఆర్భాటాలను ప్రదర్శిస్తుంది. ఒక్క కుంకు బొట్టు ఉండదు. అసలు దీనికి పేయింట్ వెయ్యకూడదు.
౧౧. పూజకు తలంబ్రాలకు - ముక్కిపోయిన విరిగిన ఎందుకూ పనికిరాని బియ్యం వాడుటలో యజమానుల విశాల హృదయం వెల్లడి అవుతుంది
౧౨. భోజనాలలో ఆర్భాటం పెరుగుతున్నది కానీ కాటరింగ్ వారు వడ్డన చేస్తున్నారు. బంధువులు వడ్డించే ఆచారం పోయింది.  కుర్చీలలో ( లేదా )  ప్లేటు పట్టుకుని భోజనం చేయాలి. క్రింద కూర్చుని ఎవరూ చేయడంలేదు, ఎవరూ పెట్టడం లేదుఇది మనం అతి ఆర్భాటానికి పోయి ఎక్కువమందిని పిలుచుకోవడంలో వస్తున్న చిక్కు.

  యజమానులకు చెప్పి సరిగా చేయించ వలసిన బాధ్యత పురోహితులయందు ఉన్నది. పురోహితులు చెప్పినట్లు ఆచరించాలన్న శ్రద్ధ యజమానులకు ఉండాలి. సత్యనారాయణ వ్రతంలో వక్కలు వందగ్రాములు కావాలంటే  తొమ్మిది గ్రహాలే కదా తొమ్మిది వక్కలు చాలు అని వాదించే వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. చెప్పేవారు దొరకడం అరుదు. చెప్పినా వినేవారు దొరకడం మహాఘనం. బ్రహ్మగారు, యజమానులు ఇద్దరూ శ్రద్ధకలవారై, బంధువుల మాటలకు వెరవక ధర్మం ఎదో అది ఆచరించే వారైనప్పుడు అది చక్కని వివాహం అవుతుంది. ఆజంట ఆజన్మాంతం అన్యోన్య అనురాగంతో సహజీవనం సాగిస్తారు. లేకపోతే విపరీతముగానే ఉంటాయి ఫలితాలు.