కార్తీకా మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు. ఆసేతు హిమాచలమూ కార్తీక పూర్ణిమ నాడు ఇలా దీపాలను వెలిగిస్తారు. అలా వెలిగించిన దీపంలో దామోదరుని గానీ త్య్రంబకునిగానీ ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.
||శ్లో|| కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః|
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతిత్వం శ్వపచాహి విప్రాః||
చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని నమ్మక కేవలం తన సుఖం కోసమే కర్మలను ఆచరించేటటువంటి వాడుకూడా ఈ దీప కాంతి ప్రసరించడం చేత అభ్యున్నతి కలిగి మరుజన్మలో వేదమునేర్చి లోకోపకారియైన బ్రాహ్మణజన్మను పొంది ఉద్ధరింప బడాలి.
సంకల్ప శక్తి గురించి మన పురాణలలో అనేక కథలున్నాయి. పరబ్రహం యొక్క సంకల్పం నుండే ఈ సృష్టి ప్రారంభమైనదని తెలుస్తుంది. ఋషి పరంపర మనకు నేర్పిన “లోకా స్సమస్తా స్సుఖినో భవంతు” అన్న సంకల్పం నేటికీ మన భారతీయులందరూ చెప్పుకుంటారు. మనం చేయలేని పనులు కూడా ఒక్కోసారి మన సంకల్ప శక్తి వలన పూర్తవ్వడం గమనించవచ్చు. ఒక మంచి సంకల్పం వలన మనమే కాక మన చుట్టూ ఉన్నవారుకూడా లబ్దిని పొందుతారు. ఎవరికి ఏ శక్తి ఉందో ఎవరం చెప్పగలం. ప్రతీ ఒక్కరూ దీపాన్ని వెలిగించి పై శ్లోకాన్ని చెప్పి, దాని భావాన్ని మననం చేసుకుంటూ సంకల్పం చెస్తే ఇంతమంది ప్రార్థన ఊరికే పోతుందా!? ఆ ఈశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. లోకాలను తరింప చేస్తాడు.
వైదిక సంబంధమైన కర్మలు మనకోసం చేసుకున్నా అవి లోకకళ్యాణానికి కారణమౌతాయి. నేటికీ ఆర్తితో ప్రార్థించిన వారికి తగిన సహాయం అందున్నది అంటే, లోకంలో మంచి అన్నది కనిపిస్తున్నదీ అంటే ఇటువంటి ప్రార్థనల ఫలితమే కదా! కనుక అందరం కార్తీక మాసంలో ప్రతీ రోజూ దీపాన్ని దర్శించి ఈ ప్రార్థన చేద్దాం!