Wednesday, January 20, 2016

భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నిరూపించగలరా?


       అయ్యా “నీళ్లలో నిప్పు ఉన్నది” అసలు నీరే నిప్పుగా ఉన్నది ( ఆపోవా అగ్నేరాయతనం... ) మాకు వేదంలో ఉన్నది అని ఎవరైనా వేదపండితులు చెప్పారనుకోండి, ఎవరూ నమ్మరు. నీళ్లలో నిప్పు వేస్తే ఆరిపోతుంది.  అలాంటిది నీళ్లలో నిప్పు ఉండడమేమిటి? ఈయన ఎంత అమాయకుడో? ఇంకా ఇటువంటి ఉపన్యాసాలు చెప్పి జనాలను నమ్మించాలని చూస్తున్నారు అని మనసులోనేనవ్వుకుంటారు. ఎందుకంటే చాలామందికి తెలిసి నీళ్ళలో నిప్పు అనేది దాక్కొని ఉండడం అసంభవం. తమ నమ్మకం తప్పని అంత త్వరగా ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధపడి లేరు. 
   అదే ఓ సైంటిస్టు అయ్యా “నీళ్లలో నిప్పు ఉన్నది” అని చెప్పాడనుకోండి, ఆశ్చర్య పోతారు. అయినా పూర్తిగా నమ్మరు. ఏది ఎలాగ నిరూపణ చేయండి అంటారు. ఆయన చెప్తారు. “ నీటిని చేతితో తాకగలం, కంటితో చూడగలం. కానీ నీటిలో ఉండే నిప్పును తాకలేం, నేరుగా కంటితో చూడలేం. ఎందుకంటే దాని శక్తి అమోఘం. తాకితే మనం కూడా కాలిభస్మమై పోతాం. ఒక వస్తువుగుండా ప్రవహింప చేసినట్లేతే కనుక దానిని అనేక పనులకు సాధనంగా ఉపయోగించవచ్చు. దీపంగా వాడుకోగలం, ఆ వెలుగును చూడగలం. భూమిలో నుండి నీటిని తోడగలం. అనేక పనులు చేయగలం. ఆ నీటిలో నుండి వెలికి వచ్చిన నిప్పునే మనం “విద్యుత్” అని పిలుచుకుంటున్నాం...”  
ఇదంతా విని అవునవును నిజమే నీటిలో విద్యుత్ చ్ఛక్తి ఉంది. దానిని మనం వాడుకుంటున్నాం కదా!? అంటూ ఒప్పుకుంటారు. 
    ఒక వేదపండితుడు చెప్పిన విషయాన్ని నమ్మడానికి ఇష్టపడని మనం ఒక సైంటిష్టు చెప్పగా నమ్ముతున్నాం. కారణం చాలా సమయాలలో మనం బుద్ధిని ఉపయోగించకపోవడమే! వేదపండితుడు - సైంటిష్టు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. కానీ వేదం అనగానే నేటి ఆధునికుల దృష్టిలో పెద్ద బూటకం. అది పాతచింతకాయ పచ్చడి వంటిది. ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. వేదం అంటే పూర్వకాలంలో కాలక్షేపానికి రాసుకున్న ఒక జీవన పద్ధతి. ఆరోజులలో ప్రజలు బావిలో కప్పలు. వారికి ప్రపంచం తెలియదు. తమ చిన్న ప్రపంచంలో జీవించడానికి పెద్ద పనేమీ ఉండేది కాదు. అందుకే ఖాళీ ఎక్కువై రాసుకున్న గ్రంథాలు అవన్నీ. ఈ రోజులకు సరిపోవు. అయినా నిరూపణకు సరిపోని అంశాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక అవి అన్నీ అసమంజసమైనవే. వాదనలకు నిలువలేవు – అని నేడు చాలామంది ఆధునికులయొక్క అభిప్రాయం
చాలామంది గొర్రెలవలెనే ఆలోచించడానికి అలవాటుపడి నేటికీ అదే విధానంలో ఉన్నారు. ఒక గొర్రె ఎటువెళితే వెనకాల గొర్రెలన్నీ అటే వెళతాయి. అలాగే నేటి కాలంలో పాప్ సాంగ్స్, ఫేస్ బుక్, వాట్సప్, సినిమాలు, డబ్బు మొ. వాటిలో కొట్టుకు పోతున్నారే కానీ మనమెటు వెళుతున్నాం అన్నది ఆలోచించడంలేదు. నూటికి ఎవరో ఒక్కరు మాత్రమే మనిషిలా తమ బుద్ధిని ఉపయోగించగలరు. వారే నాయకులవుతున్నారు. మిగతావారు గొర్రెల వలె లోకాన్ని అనుసరిస్తున్నారు. 
  కంటితో చూసినవి మాత్రమే నమ్ముతామంటే కారెట్ తింటే ఏ-విటమిన్ వస్తుంది అని డాక్టరు చెప్పినప్పుడు మీరు నమ్మకూడదు. కానీ నమ్ముతున్నారే! విద్యుత్ ను కంటితో చూడలేదు, చేతితో స్పర్శించ లేదు. కానీ విద్యుత్ అనేది ఉంది అని నమ్ముతున్నాము. విద్యుత్తు వలెనే భగవంతుడిని కూడా కంటితో చూడలేం, చేతితో స్పర్శించలేము. ఎందుకంటే ఆయనను భరించ గలిగే శక్తి ఈ శరీరానికి లేదు. విద్యుత్ తగిలితే శరీరం ఎలా తట్టుకో లేదో అలాగే భగవంతుని స్పర్శనీ ఈ శరీరం తట్టుకోలేదు. 
  ఒక పరిమితికి లోబడిన వస్తువులను మాత్రమే మనం కంటితో చూడగలం. ఆ పరిమితికంటే తక్కువ ఉన్నా(అణువు), ఎక్కువ ఉన్నా (సూర్యుడు) మనం కంటితో చూడలేం. అలా చూడడానికి మనకి భూతద్దం వంటి ఓ సాధనం కావాలి. ఆలాగే పరిమితికి లోబడిన శబ్దాలను మాత్రెమే మనం చెవులతో వినగలం. శబ్దం ఎక్కువ ఉన్నా వినలేం( చెవుడు వస్తుంది ), శబ్దం తక్కువ ఉన్నా మనకు వినబడదు. అంటే మనం చూడడానికి, వినడానికి, ముట్టుకోవాడనికి, వాసన చూడడానికి రుచి చూడడానికి వీటన్నిటికీ పరిమితులు ( Limitations ) ఉన్నాయి. పాంచభౌతికమైన మన శరీరమే పరిమితమైనది అయినప్పుడు అపరిమిత శక్తి కలిగిన భగవంతుని మనం ఈశరీరంతో ఎలా చూడగలం, ఎలా మాట్లాడగలం? అలా చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది.

విద్యుత్తును ఒక బల్బు ద్వారా ప్రసారం చేసి వెలుగుగా ఎలా చూడగలుగుతున్నామో అలాగే మనసు అనే సాధనమును ఉపయోగించి మాత్రమే ఆ భగవంతుని దర్శించగలం. మనకు తెలియని విషయాలు అన్నీ అసత్యాలు కాదు. మన బుద్ధికి తెలియనంత మాత్రాన భగవంతుడు లేడనడం అవివేకం. జీర్ణప్రక్రియను మనకంటితో చూడలేదు. కానీ ఎవరో ఒక సైంటిష్ట్ చెప్పాడని అది నమ్ముతున్నాం. మరి మన పూర్వీకులు ఋషులు చెప్పిన విద్యను మాత్రం బూటకం అని కొట్టిపాడేయడం ఎంతవరకు సబబు? వేదం అంటే అది ఓ సైన్స్, ఋషులు సైంటిస్ట్ లు. వారు ఎంతో కఠోర శ్రమచేసి సాధించిన ఫలాలను వేదం రూపంలో మనకు అందించారు. ప్రపంచం బట్టకట్టడం నేర్వకపూర్వమే ఇక్కడ సైన్స్ లో ఎన్నో అద్భుతాలు చేసి చూపారు. వారు మనకు తెలిపిన పరమ సత్యం ఒక్కటే! 

" భగవంతుడనే వాడు ఉన్నాడు. ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి ఆర్తితో తండ్రీ రక్షించు అని పిలిస్తే నడి సముద్రంలో కూడా చేయందించి కాపాడుతాడు"
---------------------------------  రాజశేఖరుని విజయ్ శర్మ

Friday, January 8, 2016

జాతక చక్రంలో ప్రేమ వివాహ సూచనలు ( LOVE MARRIAGE IN ASTROLOGY )

      జాతక చక్రంలో ప్రేమను ఐదవభావం, వివాహన్ని ఏడవ భావం సూచిస్తాయి. ఈ రెండు భావాధిపతుల పరివర్తన, లేదా పరస్పర వీక్షణ లేద ఇద్దరూ ఒకే భావంలో కలిసి ఉన్నా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తింది.
*****
జాతక చక్రంలో ప్రేమను సూచించే గ్రహం శుక్రుడు. పంచమభావం జాతకుని యొక్క ప్రేమను, సరదాను ( Fun ) సూచిస్తుంది. శుక్రుడు ప్రథానంగా పంచమ గృహంలో ఉంటే ప్రేమ వివాహం అనిచెప్పవచ్చు. ఐదు, రెండు, ఏడు, పదకొండు గృహాలలో శుక్ర స్థితి ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. శుక్రుడు ఏ భావంలో ఉన్నాడన్నది ప్రథానం కాదు. ఏభావంలో ఉన్నా కుజ సంబంధం ఉంటె ప్రేమకు ఆస్కారం ఉంది.

కుజుడు అంటే కోరిక ( Passion ), శుక్రుడు అంటే ప్రేమ. ఈరెండిటి కలయిక కాముకతను సూచిస్తుంది. కుజుడు శుక్రునితో కలిసి ఉన్నా ( conjunction ) , కుజుని 4, 7 వ దృష్టి ( aspect ) శుక్రుని పై పడి వీరిద్దరిలో ఒకరికి సప్తమ భావంతో గానీ, భావాధిపతితోగానీ సంబంధం ఉంటే ప్రేమ వివాహం ఉందని చెప్పవచ్చు. కుజుని 8వ దృష్టి పనికిరాదు. ప్రేమ లో విడిపోవడాన్ని సూచిస్తుంది.

శుక్రునితో చంద్రుడు కలిసి ఉన్నా కూడా ప్రెమ వ్యవహారం ఉందని గుర్తించాలి. ముఖ్యంగా ఐదు, పదకొండు భావాలలో కనుక వీరిద్దరూ కలిసి ఉంటే అది తప్పక ప్రేమవివాహానికి దారితీస్తుంది. పదకొండభావం మీపరిచయాలు, స్నేహితులు, సరదా మొదలైనవాటిని గురించి తెలుపుతుంది. కనుక ఇందులో శుక్ర, చంద్ర కలయిక ద్వారా మీ స్నేహితులలోనే ఒకరు జీవితభాగస్వామి కావడాన్ని కూడా సూచించ వచ్చు. జాతక చక్రంలో చంద్రుని నుండి ఐదు, ఏడు భావలలో శుక్రుడు ఉన్నాకూడా అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.

కుజ, శుక్ర కలయిక అంశచక్రంలో (D-9 చార్ట్ లో) ఉన్నదేమో కూడా పరిశీలించాలి. ఇదికూడా ప్రేమవివాహాన్ని తెలుపుతుంది. కుజ, శుక్ర కలయిక విడాకులకు దారితీస్తుంది అనుకుంటే అది పొరపాటు. అటువంటి పనిచేసేది శుక్ర, రవి గ్రహాల కలయిక

*****
పై గ్రహస్థితులు ఉన్నప్పటికీ శని దృష్టి ఆయా భావాలకు, గ్రహాలకు కలిగినచో అది వివాహం వరకు దారితీయదు. అలాగే ష్టష్టమ స్థానాధిపతి సంబంధం ఉన్నా, షష్టమంలో ఆయా గ్రహాలు పడినా అది ప్రెమికులిద్దరూ విడిపోవడాన్ని, గొడవలు పడడాన్ని సూచిస్తుంది. ఆరవ భావంలో ఉన్న గ్రహం దృష్టి సోకినా కూడా అది సంభవిస్తుంది. ఇదేవిధంగా అష్టమ, వ్యయ స్థానాల నుండి గూడా గ్రహించాలి. ఆయా స్థాలతో, స్థానాధిపతులతో, ఆస్థానాలలో ఉన్నగ్రహాలతో శుక్ర,కుజులకు, పంచమ,సప్తమాలకు ఉన్న సంబంధంకూడా ప్రేమ వ్యవహారంలో విభేధాలను సూచిస్తాయి. శుక్ర శని గ్రహాల కలయిక ఒకటికంటె ఎక్కువ ప్రెమ వ్యవహారాలను, సంబంధం బెడిసికొట్టడాన్ని కూడా తెలుపుతుంది.  రాహు, శుక్రుల కలయిక ప్రేమవ్యవహారాన్ని సూచిస్తుంది కానీ, రాహు మహర్దశా అంతర్దశలలో ఈ వ్యవహారం బెడిసి కొట్టే ప్రమాదముంది. 
*****
ప్రేమ, వివాహం, ధైర్యం అనే మూడు విషయాల కలయికతో ప్రేమ వివాహం ఏర్పడుతున్నది. 

జాతకంలో 
వివాహం (7 వ భావం, 7 వ స్థానాధిపతి, శుక్ర/గురు గ్రహాలు ) నకు ఈక్రింది వాటి సంయోగం ఉంటే ప్రేమ వివాహం సూచితమవుతుంది.

ప్రేమ మరియు భావుకత (5 వ భావం, 5 వ భావాధిపతి, చంద్రుడు, శుక్ర గ్రహాలు)
నిర్ణయింతీసుకునే ధైర్యం (3 వ భావం, 3 వ స్థానాధిపతి, కుజుడు, రాహు గ్రహాలు) 

ఈ మూడిటి సంయోగంచే ప్రేమ+వివాహం సంభవిస్తుంది. ముఖ్యంగా మొదటి దైన వివాహ కారకత్వానికి రెండు,మూడు ల సంబంధం కలగాలి. వివాహకారక భావాలతో గానీ గ్రహాలతొ గానీ  సంబంధం కలగనట్లైతే అది వివాహం వరకు వెళ్లకపోవచ్చు.
రాజశేఖరుని విజయ్ శర్మ