Wednesday, December 30, 2009

మూఢనమ్మకాలు

రహమతుల్లా గారు నా ఆస్తిక-నాస్తిక వాదన అనే టపాకు వ్యాఖ్యగా మూఢనమ్మకాలపై మంచి విషయాలు ప్రస్థావించారు. అక్కడ వెంటనే ప్రచురింప బడక పోవడం వల్లననుకుంటా నా క్రితం టపా కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా? అనే టపాలో కూడా వ్యాఖ్యగా రాశారు.

ఇక వారు ప్రస్థావించిన అన్ని విషయాలనూ నాకు నేను ప్రశ్నించుకుంటే వాటికి ఏ సమాధానాలు ఇచ్చుకుంటానో వాటిని ఇక్కడ తెలియజేస్తాను. అవి చాలా మందికి కలిగే సందేహాలు కనుక ఈ టపా అందరికీ ఉపయోగ పడవచ్చు.

ఇక వరుసగా ఆ విషయాలు ( ప్రశ్నలు )చూద్దాం.


1* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం

ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా చూస్తేకానీ ఏమీ స్పందించలేను. ఎందుకంటే ఇక్కడ ఒకరి ఎంగిలి ఒకరు ఎంతో మక్కువతో తింటున్న ప్రజలను చూస్తున్నాను. హోటళ్లలో అయితే అది శాఖాహారమా, మాంసాహారమా అని కూడా ఆలోచించటం లెదెవరూ. చక్కగా చికెన్ తో ఏదో వేపుడు చేసిన మూకుడు లోనే, నూడుల్స్ వేయిస్తాడు. జనాలు అవి ఆవురావురుమని తింటున్నారు . దీనిని చూసిన నాకు అదేమీ అంత పెద్ద పైత్యమనిపించడంలేదు. కానీ ప్రత్యక్షంగా చూస్తే మరోలా అనిపించవచ్చునేమో.

2* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఆచరించవలసిన విధానమే. దేవాలయం అంత విశాల ప్రాంగణంలో కట్టాలి అని తెలియజేయడానికి ఇది సంకేతం. మన ఇల్లు కట్టినట్టు చిన్న చిన్న స్థలాలలో దేవాలయాలు కట్టకూడదు. వంటిల్లు, హాలు ఒకేలా కట్టము కదా? అలగే దేవాలయాన్ని ఎలా నిర్మించాలి అనే విషయంలో కొన్ని విధనాలు పాఠించాలి మనం.

3* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.

ఇది నిజంగా మూఢనమ్మకమే. ఇది తప్పక ఖండించాలి.

4* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.

ఇది నేను ఇదివరకు వినలేదు. గ్రామ వాతావరణంలో అది సబబేనేమో.. ఆ జాతరలు జరిగే రోజులు అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో వస్తాయా? అలా అయితే అది సమంజసమే కదా? శుభకార్యాల పేరుతో జనాలు ఎక్కువగా ఒక్కచోట చేరటం వల్ల అవి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా? పూర్వం గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా ఈ వ్యాధులకు ఎంతో మంది బలైపోయేవారు. అందుకే అటువంటి నమ్మకం ఏర్పరచుకుని ఉంటారు. అది మంచిదే అనిపిస్తోంది.


5* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

అవునా? నాకు ఈ విషయం తెలియదు. ఏదీ సరిగా తెలియకుండా వ్యాఖ్యానించడం అంత సబబుకాదు. అందుకే నేనేమీ చెప్పలేను.

6* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఇది దారుణం. చేత బడుల గురించి వినడమే గానీ , నిజంగా చూడలేదు.అయితే చేతబడులు లేవని నేను నమ్మలేను. అది ఒక హిప్నాటిజం లాంటిది.పూజలు అనేవి మానసిక బలాన్ని పెంచగలవని నమ్ముతాను.అలాగే చేతబడులు మానసికంగా కృశింపచేయడానికి ఉపయోగ పడతాయేమో అనుకుంటున్నాను. కానీ నేడు అంత దీక్షగా చేయగలిగే వారెంతమందీ అన్నదే సందేహం.

7* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.

ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం. ఆ పూజారి ప్రజల బలహీనతలతో బ్రతుకుతున్నాడని చెప్పగలను.


8* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంతగా పనిచెయ్యవు. ఆకాశంలో జరిగే క్రియలు మన దేహంపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నది నేను నమ్ముతాను. చంద్రుడి వెన్నెల మనసుకు ఎలా ఆనందాన్నిస్తుందో, సూర్యుడి వేడి దేహానికి తాపాన్ని ఎలా కలుగజేస్తున్నదో అలాగే ఆ గ్రహణ సమయంలో కూడా మన దేహం ( ఈ ప్రకృతి మొత్తం ) దాని ప్రభావానికి లోనవుతుంది. వేసవి కాలంలో పల్చని వస్త్రాలు ధరించాలి. సీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరించాలి. అలా అని అది నియమం కాదు. ధరించక పోతే ఏమౌతుంది? ఆ బాధను భరించవలసి ఉంటుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో భోజనాదులు కూడా నిషిద్ధం. అలా చేయటం చేయక పోవడం వారి వారి నమ్మకం మీద ఉంటుంది.

అన్నీ కంటికి కనపడవు. కొన్ని కంటికి కనిపిస్తే , కొన్ని బుద్ధికి తడతాయి మరి కొన్ని మనసుకు గోచరిస్తాయి. వేటి కీ అందక పోయినా అవి అసత్యాలని కాదు. ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలియాలంటే నిరంతర వినయంతో కూడిన, తప్పును సరిదిద్దుకోగలిగిన వివేచన మాత్రమే మనకు దారి.

9* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.

ఇక కొన్ని ఇలాంటి నమ్మకాలు కొంత సత్యానికి , కొంత కల్పన చేర్చి మరింత చేసి మసి పూసి మారేడు కాయ చేసినవన్నమాట. నాకు సరిగ్గా తెలియదు కానీ తుమ్మగానే మనలో రక్త ప్రసరణ స్తంభించడం, గుండె ఆగడం వంటివేవో అనేక మార్పులు జరుగుతాయట. ఇది సైంటిఫిక్ రీజన్. అందు వలన ఓ క్షణం ఆగి ఏ పనైనా ప్రారంభించమనడం వరకూ నేను ఆచరిస్తాను. ఇక మన తప్పును ఎవరి తుమ్ముపైనో రుద్ధడం అనేది చేతకాని తనం.

10* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.

కన్యా దానం అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ, ఇలా కాదు సరైన వరునికి దానమివ్వమని చెప్పారు. తద్వారా వారికి సంతానం కలిగి వంశ అభివృద్ధి జరుగుతుంది. ఆ పుట్టిన వారు పితృకర్మలు చేస్తే వీరికి పుణ్యగతులు కలుగుతాయి. అందుకోసం కన్యాదానం చెయ్యమన్నారు. కానీ అది ఇలా వదిలించుకోవడంగా రూపుమారడం శోచనీయం.

11* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.

ఆవుకు మనిషి పుట్టడం నిజంగా జరిగిందా? ఒక వేళ జరిగితే దీపాలు వెలిగించడం అనేది ఓవిధంగా మంచిదే. ఈ విషయం వల్ల నిరూపణవుతున్నదేమిటీ----? మనిషికి కామం మితిమీరిందన్నది తెలుస్తున్నదికదా? ఆ కామాన్ని అదుపులో పెట్టు నాయనా అని ఎవరికి చెప్పాలి. అందరూ పశుప్రవృత్తినుండి, మానవ ప్రవృత్తికి రావాలి ( మనలో చాలా వరకూ పశు ప్రవృత్తి ప్రబలుతోంది అన్నది అందరూ అంగీకరించని నిజం ). అలా రావాలంటే ఈ పూజలూ మొదలైనవి చాలా సహాయపడతాయి. పైగా ఇవి లోకక్షేమంకోరి చేస్తున్నామంటే మరింత త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువ. ( తను బాగుపడడానికి ఎంతో బద్ధకించే వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉన్నారో..., లోక కళ్యాణం కోసం అనగానే అందరికంటే శ్రద్ధగా చేసేవాళ్లు అంతకంటే ఎక్కువమంది నేడు ఉన్నారన్నది కూడా పచ్చి నిజం . అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను పూజలు చేయించే చోట్ల చాలా మందికి చెప్తాను. మీరు ఇలా రోజూ దీపారాదనచెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అంటే వినేవాళ్లు తక్కువే. కానీ నేను లోక క్షేమంకోరి ఓ యాగం చేస్తున్నాను. మీరు వచ్చి తప్పక పాల్గొనాలి అని పిలిచినదే తడవు నాకు అనేక విధాలు సాయపడ్డవారు చాలామంది ఉన్నారు. ) ఈ విధంగా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం అనేది అనాలోచితమైన పని కాదు. ఎంతో ఆలోచించి ఓ మహాను భావుడెవరో ప్రవేశపెట్టిన ఓ పథకం.

ఈ పని ఇలా జరగడమే ఉత్తమం కూడా. మన నేతలలో ఎవరో చాలా పెద్ద కుంభకోణాలలో ఉన్నారనుకోండి. అది ప్రత్యక్షంగావెలుగు చూపితే వచ్చే మంచి కంటే చెడే ఎక్కువ. లోపల వారిని శిక్షించి పైకి మరొ విధమైన రూల్ ని పాస్ చెయ్యడమే తెలివైన ప్రభుత్వం చేసే పని. తద్వారా ప్రజలకు అభద్రతా భావం ఏర్పడకుండా ఉంటుంది. అటువంటిదే ఈ పని కూడా.


12* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

వాటి ప్రాశస్త్యం ఏమిటో నాకైతే తెలియదు. ఇలాంటివి గ్రామాలలో ఇంతలా ఎలా పెరుగుతున్నాయో ఓసారి ఆలోచించాలి. కోరికలు పెరగడమే ఈ నమ్మకాలు పరాకాష్టకు రావడానికి కారణంగా తోస్తోంది. ఏదైనా అతి పనికి రాదు.

13* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]

ఇది ఓ పిచ్చి లాంటిదే. ఆ డబ్బును బీదప్రజలకు దానంగా ఇస్తే ఎన్ని కుటుంబాలకు తిండీ గుడ్డా అందుతాయో కదా..? :(

14* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm


ఇటువంటి వ్యక్తులను ఎలానమ్ముతారో ప్రజలు. ఇటువంటి దొంగ బాబాలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి ప్రభుత్వం.


15* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

కేరళ జ్యోతీష్యాన్ని గురించిన పూర్తి వివరాలు నాకు తెలియదు. నా వరకూ జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది మనం కష్టంలో ఉన్నప్పుడు చుక్కానిలా పనిచేస్తుంది. ఏదారీ తోచని వారికి ఓ వెలుగు బాట చూపుతుంది. కానీ ఎల్లప్పుడూ ఆ జ్యోతీష్యం అవసరం లేదు. మీరు ఎవరూ తీర్చలేని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఆధారపడండి అని అందరికీ చెప్తుంటాను.


16* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

వీటి విషయంలో కూడా ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరిగింది. దీనికి ముఖ్యకారకులు రాళ్ల వ్యాపారులు. జ్యోతీష్యులను పావులుగా చేసి జనాల బలహీనతలతో ఆటలాడారు/ఆడుతున్నారు.

జనాలు కూడా అమాయకులై ధరించడం లేదు. నేను ఇన్ని వేల రత్నాన్ని ధరించాను అని చెప్పుకోవడం ఓ గౌరవం, ఓ దర్జా అయిపోయిందిప్పుడు. నేను ఎవ్వరికీ రాళ్లు పెట్టుకోమని చెప్పను. ఒకవేళ పెట్టు కుంటమన్నా దానికి వేలకు వేలు ఖర్చుపెట్టవద్దు అని ఖచ్చితమైన సలహా ఇస్తాను. దానికంటే రోజూ ఇంట్లో దీపారాధన చెయ్యడం వెయ్యిరెట్లు మంచిది. కానీ జనాలకు శ్రమలేకుండా, పనయ్యే మార్గం కావాలి. దానికి ఎంతైనా ఖర్చుపెడుతున్నారు.

17* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట

చీము,నెత్తురుతో జుగుప్సాకరంగా ఉండే వైతరిణీ నదిని దాటవలెనంటే గోదానం చెయ్యాలి. ఆ గోదాన మహిమ వల్ల దానిని దాటగల శక్తి వస్తుంది.

గోదానానికే ఎందుకంత ప్రశస్తి కలిగింది? అంటే దీనికే కాదు (పైన 10 లో చెప్పినట్టు) ఇంకా అనేక దానాలకు కూడా చాలా గొప్పదనం కలదని చెప్పారు మన పెద్దలు. ఇక్కడ ముందు ఆలోచించ వలసింది గోదానం గొప్పేమిటని కాదు. దానం గొప్పేమిటని?

పూర్వం ధనాన్ని గోవులతో కొలిచే వారు. అంటే అతనికి ఎంత గోసంపద ఉంటే అంత ధనవంతుడన్నమాట. అలాగే ఈ గోపోషణ అనేది పరమ ఉత్తమమైన పనిగా ఎంచబడేది. అలాగే ఈ వైతరిణీ నది అంటే మరేదో కాదు మన జీవితమే అనేక పాపాలతో కూడుకున్న జుగుప్సాకరమైన వైతరిణీ నదికి సంకేతం. ఈ విధంగా పోల్చుకుంటే

మన జీవితాన్ని సునాయాసంగా దాటడానికి దానం అనేది పరమ సాధనంగా ఉపయోగ పడుతుంది. అంటే మనం సంపాదించినది పరోపకారార్థం ఏకోరికాలేకుండా దానం చేయగలిగిన నాడు ఆ జీవితం సుఖదుఃఖాలకు అతీతంగా ఆనందడోలికల్లో తేలిపోతుంది.

హిందూ సాంప్రదాయంలో ( హిందూ అనే కాదు చాలా సాంప్రదాయాలలో ) ఉన్న నిగూఢార్థం అర్థమవ్వాలంటే ఎంతో తపన ఉండాలి. సత్యమునే పలకండి అని అన్ని మతాలు చెప్తున్నాయి. ఆసత్యాన్నే ఎందుకు పలకాలి ? అలా పలికితే మనకు మంచి ఎలా జరుగుతుంది? పలకక పోతే పాపమెలా కలుగుతుంది? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటే దాని పూర్వాపరాలు తెలుస్తాయి. దీనికి చక్కని ఉదాహరణ మన చిన్నప్పుడు చదివిన " నాన్నా పులి" అనే గొర్రెలు కాచే పిల్లవాడి కథ . ఇలాంటి అనేక కథల ప్రభావమో, జీవితానుభవమో మొత్తానికి సత్యాచరణం మంచిదని ఒప్పుకోవడానికి చాలా మందికి అభ్యంతరమేమీ లేదు. కానీ ఇలాంటి కొన్ని ధర్మాలను ఒప్పుకోవడానికి అనేక సంశయాలు వేధిస్తుంటాయి. దానికి వినయంతో కూడిన అన్వేషణే మార్గం.


మన బుద్ధికి,ఊహకు అందని / సమంజసమనిపించని చాలా విషయాలను మనం ముఢనమ్మకాలుగా చెప్తాం. కానీ మనకు తెలిసినవే సమగ్రమైనవి, సరిఅయినవి అనే అభిప్రాయం సరి కాదు. నాకు లేదు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. మీకు నచ్చితే మరికాస్త ఆలోచించండి. లేదంటే మరల ప్రశ్నించండి. :)

Tuesday, December 15, 2009

శ్రీ లలితాదేవి పూజ




శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా.
ఓం నారాయణాయ స్వాహా.
ఓం మాధవాయ స్వాహా.



ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.

సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.

భూతోచ్ఛాటన:

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.

ప్రాణా యామః :

ఓంకారాన్ని మనసులొ స్మరిస్తూ ముక్కుతో గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ).

సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే సంకల్పం పనికి వస్తుంది.)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- ....................... సంవత్సరే ............ ఆయనే ......... ఋతౌ ............. మాసే ............ పక్షే ........... తిథౌ ........ వాసరే ........... శుభ నక్షత్రే ......... శుభ యోగే .......... శుభ కరణే

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-

శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-

ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )


మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే.




శ్రీ లలితాపూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధనం


కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆయాంతు శ్రీ లలితా దేవీ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య.


1.అథ ధ్యానం:

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం

సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం


2.ఆవాహనం:

నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కౄపాకరే.

శ్రీ లలితాదేవ్యైనమః ఆవాహయామి.

3.ఆసనం:

అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
మనశ్చిత్రం మనోహారి సింహాసన మిదం తవ.


శ్రీ లలితాదేవ్యైనమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి.


4.పాద్యం:

అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతౄకే
మనశ్శుద్ధం మయాదత్తం గంగామంబుపదోస్తవ.

శ్రీలలితాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి.


5.అర్ఘ్యం:

సర్వ తీర్థమయం హౄద్యం బహుపుష్ప సువాసితం
ఇదమర్ఘ్యం మయాదత్తం గౄహాణ వరదాయిని.


శ్రీలలితాదేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

6.ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే
గౄహాణాచమనం దేవి నిర్మల రుచి పూరకం.

శ్రీలలితాదేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:

మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరా జల సంయుతం
మధుపర్కం గౄహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే.

శ్రీలలితాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి.

7.స్నానం:

నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతౄకే
ఇదం శుద్ధోదక స్మానం స్వీకురుష్వ దయామతే.

శ్రీలలితాదేవ్యైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.

పంచామౄత స్నానం:

దధి క్షీర ఘౄతోపేతం శర్కరా మధు సంయుతం
నారికేళ జలైర్యుక్తం స్నానమంబ మయార్పితం.

శ్రీలలితాదేవ్యైనమః పంచామౄత స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

8.వస్త్రం:

అంబరంచాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం
వస్త్రమేతన్మయాదత్తం కౄపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

వస్త్ర యుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

9.యఙ్ఞోపవీతం:

నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్ర కోటి మనోహరే
ఉపవీతమిదందేవి గౄహాణత్వం ప్రసీదమే.

శ్రీలలితాదేవ్యైనమః యఙ్ఞోపవీతం సమర్పయామి

యఙ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

ఆభరణం:
నానా విధాని రత్నాని మాంగళ్యాభరణానిచ
సౌవర్ణాని చ దీయంతే గౄహాణ పరదేవతే

శ్రీ లలితాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి.


10.గంధం:

ఇష్ట గంధ ప్రదం దేవి అష్ట గంధాధి వాసితం
అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం.

శ్రీలలితాదేవ్యైనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి.


హరిద్రాచూర్ణం:

హరిద్రా చూర్ణమేతద్ధి స్వర్ణ కాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః హరిద్రాచూర్ణం సమర్పయామి.


కుంకుమాచూర్ణం:

కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే.

శ్రీలలితాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి.

అక్షతాన్:

ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే
స్వర్ణాక్షతామయాదత్తాః కృపయా పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః సువర్ణాక్షతాన్ సమర్పయామి.


పుష్పం:

నానా విధైశ్చ కుసుమైః బహు వర్ణైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి.

అక్షతైః పుష్పైః పూజయామి.

ఇక్కడ 108 లేదా 1008 నామములతో అమ్మవారిని పూజించ వచ్చు.

11.ధూపం:

జగదంబే నమస్తేస్తు కరుణాపూర పూరితే
ధూపమేతన్మయాదత్తం గౄహాణ వరదేంబికే.

శ్రీలలితాదేవ్యైనమః ధూపం సమర్పయామి.


12.దీపం:

కౄపాపరే మహా దేవి జగద్రక్షణ తత్పరే
చంద్ర రేఖాంక మకుటే దీపోయం పరి గౄహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః దీపం దర్శయామి.

ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

13.నైవేద్యం:

భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వ దేవాత్మికే దేవి నైవేద్యం పరిగౄహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి.

మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి. పాదౌ ప్రక్షాళ యామి. పునరాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

తాంబూల పూరితముఖి సర్వ విద్యా స్వరూపిణి
సర్వ మంత్రాత్మికేదేవి తాంబూలం పరిగౄహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి.

తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

14.నీరాజనం:

కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే
నీరాజనం మయాదత్తం కౄపయా పరి గౄహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

15.మంత్రపుష్పం:

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.


శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాః :

యానికానిచ పాపాని జన్మాంతరకౄతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపాసంభవహ్
త్రాహిమాం కౄపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దౄష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే.

శ్రీలలితాదేవ్యైనమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి.

అపరాధ నమస్కారం:

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః అపరాధ నమస్కారం సమర్పయామి.

యస్యస్మౄత్యాచ నామోక్త్యా తపహ్ పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ
యత్పుజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే.

అనయధ్యాన ఆవాహానాది షోడశోపచారపూజయా
భగవతీ సర్వాత్మకహ్ శ్రీ లలితా దేవీ స్సుప్రీతాస్సుప్రసన్నో వరదో భవతు.


16.ఉద్వాసనం:

శ్రీలలితాదేవ్యైనమః ఉద్వాసయామి. ఆవాహనం నజానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి

శ్రీలలితాదేవ్యైనమః యధాస్థానం ప్రవేశయామి.



ఇక్కడ వివరణ లేకుండా కేవలం పూజా శ్లోకాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. వివరణకూడా కావాలంటే ఇక్కడ నొక్కండి.


కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా?


"కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి" ఏదేవాలయానికి వెళ్లినా సాధారణంగా దేముడి కంటే ముందుగా పెద్దపెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఈ బోర్డు. కొన్ని దేవాలయాలలో ఉండదు. అంటే అవి ఈ మధ్యే కట్టిన దేవాలయాలు అని తెలుసుకోవచ్చు. ఆ దేవాలయ కమిటీ వారికి ప్రజలనుండి సంపాదించే మార్గాలు ఇంకా పూర్తిగా తెలియలేదు అని అర్థం. అలా అని ఎల్లకాలం అలానే ఉండరండీ. త్వరలోనే వారికి కాస్తో కూస్తో భగవంతుడిమీద ఉన్న భక్తి కాస్తా, ధనం మీదకి మళ్లు తుంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎవరినుండి ఎంత ఎలా చందాగా పోందవచ్చు? ఈ చందాలు కాకుండా ధనాన్ని కూడ కట్టడానికి ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయి? అనే అన్వేషణ మొదలవుతుంది ధర్మకర్తలలో. ఇక ఆక్రమంలో ఈ బోర్డు వచ్చేస్తుంది. ఇది సాధారణమైపోయింది ఈమద్య దేవాలయాలలో.

భక్తులు హుండీలో మాత్రమే కానుకలు వేయాలి అని బోర్డు పెట్టడంలో ఆంతర్యం. భక్తులు కానుకలు హుండీలో కాక మరెక్కడ వేస్తున్నారు. ఎక్కడవేస్తారు? అర్చకునికి దక్షిణగా ఇస్తారు. ఇదే ఇదే ఇక్కడే చిక్కంతా. మరి దేవాలయం వారిచ్చే వెయ్యి, రెండు వేలు కాకుండా? వారిచ్చే ఓ స్టోర్ రూములాంటి వసతి గది కాకుండా ఇంకా ఆ అర్చకుడు పై ఆదాయం సంపాదించుకుంటుంటే దేవాలయం ఏమైపోవాలి? దాని అభివృద్ధి ఎమైపోవాలి? అర్చకుడు అభివృద్ధి చెందితే సరిపోతుందా? గుడి గురించి ఎవరు పట్టించుకుంటారు? అని ధర్మకర్తలు తెగ మథనపడి ఇలాంటి ధర్మ నిర్ణయం తీసుకుంటారన్నమాట.

అసలు ఇది ఎంత వరకు సమంజసం. చందాల ద్వారా గుడిని అభివృద్ధి పరచాలనుకోవడం కొంతవరకూ సమంజసం. ఇది కూడా ఓ విధంగా చేతకాని తనమే.
పూర్వకాలంలో రాజులు, లేదా గ్రామ పెద్దలు దేవాలయాలు నిర్మించే వారు. వారికి ధనానికి కొరతేమిటి? దేవాలయ నిర్మాణం ఖర్చులన్నీ ఒక్కరే భరించే వారు. గుడి కట్టిన తరువాత దాని పోషణకు కావలసిన ధనాన్ని ,అర్చకుని జీవనానికి కావలసిన ధనాన్ని కూడా వారే ఇచ్చేవారు. ఇందుకోసమే ఒక్కో దేవాలయానికీ కొన్ని వందల ఎకరాల భూములను రాసిచ్చే వారు. ఆ భూములలో పండిన పంటల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ఖర్చులన్నీ నడిచేవి.

కాలం మారింది. తరువాతి కాలంలో ప్రభుత్వాలు ఆ భూములను ఎలా స్వాధీన పరుచుకున్నాయో,అర్చకులకు ఏ మాత్రం మిగిల్చాయో అదంతా జగద్విదితమే.
మరి నేడు కొత్త గా కట్టే దేవాలయాల సంగతి ఏమిటి? దేవాలయాలు ఎందుకు కడుతున్నారు? చాలా చోట్ల నేడు భూములు అన్యాక్రాంతమవకుండా, దానిమీద కొంత పెత్తనం చెలాయించడానికి దేవాలయాలు కడుతున్నారు. కట్టే వారు వారిధనంతో కట్టేంత ఉద్దాత్త హృదయం ఉండదు ( ఒక వేళ వారి వద్ద ఓ దేవాలయం నిర్మించ గలిగే ధనం ఉన్నా సరే ). అందరివద్దా చందాలు వసూలు చేయాలి. దానీ లో వీరిదీ ఓ 5% వాటా ఉంటుంది . అంతకూడా ఉండదు. మొత్తానికి వారిచిన్న ధనంతోనూ , వీరిచ్చిన ధనంతోనూ దేవాలయం పూర్తిచేస్తారు. మరి గుడి కట్ట గానే కళ్యాణ మవుతుందా? దానికి ఓ అర్చకుని నియమించాలి. అతనికి జీతం సమకూర్చాలి. మరి నిత్యం ఓ కొబ్బరికాయ కొట్టాలన్నా ఖర్చు ఉంటుంది కదా? దీపారాధనకు నల్ల నువ్వుల నూనె ఎంత ప్రియం అయిపోయిందో. ఆ ఖర్చులన్నీ ఎలా? మళ్లీ చందాలకోసం ఎదురు చూపులు. గుడి కడుతున్నామంటే ఏదో చందా ఇస్తారు కానీ. నిత్య ఖర్చులకు అంతగా ఎవరూ చందా ఇవ్వడానికి ముందుకు రారు. కొంత కాలం ఎదో తప్పదనుకుంటూ ఖర్చు పెడతారు మన ధర్మకర్తలు. కానీ అది ఎంతోకాలం సాగదు. మొత్తం సంపాదించిన డబ్బులన్నీ గుడికే ఖర్చుపెడితే ఇంట్లో ఆడవాళ్లు గరిటలు తిరగేస్తారు మరి. దానితో ధర్మ కర్తల దృష్టి అర్చకుని ఆదాయం మీద పడుతుంది. రోజూ వచ్చే భక్తులు ఏవొ పూజలు చేయించుకుని ఎంతో కొంత దక్షిణ సమర్పించుకుంటూ ఉంటారు. ఆ ఆదాయంతో అర్చకుడు తెగసంపాదించేస్తున్నాడని వీరికి మనసులో ఆవేదన మొదలవుతుంది. దాని ఫలితమే ఇదంతా?

కొంతమంది దేవాలయాన్ని పూర్తిగా తమఖర్చుతో కట్టించే ధర్మక్ర్తలూ ఉన్నారు. తరువాతి కాలంలో ఖర్చులు కూడా వారే భరిస్తారు. కానీ అర్చకుని ఆదాయం వద్దకు వచ్చేసరికి ఒకరకమైన బాధ మొదలవుతుంది. అతని ఆదాయానికి, తమ హుండీ ఆదాయానికీ పోలిక మొదలవుతుంది. నెమ్మదిగా పైన చెప్పిన బోర్డు వస్తుంది. కుదరదని వ్యతిరేకించిన అర్చకుడు తొలగించ బడి ఓ కొత్త అర్చకుడు వస్తాడు.( ఆ వచ్చే అర్చకుడు ఎందుకు వస్తాడో తెలుసా. అతనికి ఆ గుడి వారిచ్చే వెయ్యా, రెండు వేలు కూడా గతిలెదు కనుక. )

ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు వచ్చే భక్తులు కానుకలు వేసే ఆచారం ఎందుకు వచ్చింది?
1. అర్చకుని చేత పూజ చేయించుకున్న తరువాత అతనికి దక్షణ సమర్పించే ఆచారం ఎప్పటి నుండో వున్నది. అది ఎందుకో తెలుసా? మన హిందూ వ్యస్థను ప్రధానంగ 4 వర్ణాలు గా విభజించారు. ఒక్కో వర్ణానికీ ఒక్కో బాధ్యత అప్ప గించబడింది. బ్రాహ్మలు వేదవిద్యను అభ్యసించి, అందు గల ధర్మాలను నలుగురికీ తెలియచెప్పాలి. క్షత్రియులు ఆ వేద ధర్మాన్ని అందరూ అనుసరించే టట్టు చూడాలి. వైశ్యులు ధర్మానుసరణకు కావలసిన ధనమును సముపాదించాలి. శూద్రులు కృషీ వలులై అన్న సమృద్ధిని కలిగించాలి. ఈ బ్రాహ్మలు వేదాధ్యయనంలో ఉండి ధర్మ సూక్ష్మాలను గ్రహించి తమతో పాటు నలుగురికీ తగిన ముక్తి మార్గమును ఉపదేశిస్తూ ఉండాలి. మిగతా వర్ణాల వారు ఆ ధర్మాలను ఆచరిస్తూ ధర్మ మును సంరక్షించుటలో ఆ బ్రాహ్మణులకు సహాయపడాలి. విద్యనర్జించటమె కానీ , సంపాదించటం తెలియని బ్రాహ్మల కుటుంబ పొషణ ఎలా జరగాలి? అందుకోసం ప్రతి వర్ణం వారు ఈ బ్రాహ్మణ వర్ణానికి తగిన విధంగా సహాయపడటం మొదలైంది. ఈ క్రమంలో దక్షిణ అనే సాంప్రదాయం ఏర్పడింది. ఇక సంపాదన గురించి దిగులు లెనప్పుడు ఆ బ్రాహ్మణులు ముక్తి మార్గాన్వేషకులై ఆ మార్గంలో నలుగురినీ నడిపి లోక హితం చేసే వారు.


( ఇక్కడ గ్రహించ వలసిన ప్రథాన విషయం ఒకటుంది. ఈ సాంప్రదాయంలో అన్ని వర్ణాలకూ తగిన న్యాయం జరగలేదని వాదించే వారు నేడు చాలా మంది ఉన్నారు. ఈ వర్ణ విభజన ఆర్థికంగా చూస్తే రాజుకు రాజ్యాధికారం వచ్చింది. వైశ్యునకు ఆర్థిక వ్యవహార చక్షతనిచ్చింది. శుద్రునకు భూమిని ప్రసాదించింది. మరి బ్రాహ్మణునకు ఏమి ఇచ్చింది? విద్యను ఇచ్చింది. కేవలం విద్యను మాత్రమే. ఆ విద్యకు గౌరవం ఇచ్చి మిగతా వారు తమ తమ సంపదలను దానం గా ఇచ్చే వారు. అంటే దానం తీసుకునే స్థితిలోనే బ్రాహ్మడు ఉన్నాడు కానీ. ఇవ్వ గలిగే స్థితి కాదతనిది.

సరే ఇది కాదు గమనించ వలసిన విధానం. మన వ్యవస్థ ఆర్థిక దృష్టితో చేయబడినది కాదు. మోక్షం అనే దృష్టితో చేయబడినది. అందరికీ మోక్షం కలగాలి. అదే మన జీవన విధాన ప్రధాన లక్ష్యం. మోక్షం అంటే ... ఎందరో ఎన్నో చెప్పారు. అది మరో టపాలో చూద్దాము. ఒక్కమాటలో చెప్ప్పాలంటే మోక్షమంటే ఆనందం. నిశ్చల ఆనందం. ఆ ఆనందం అందరికీ సమానంగా ఉండాలి అదే మన హిందూ మత సాంప్రదాయ ప్రధాన లక్ష్యం. మరి అందిందా అందరికీ ఆనందం . నిస్సంకోచంగా అందింది. ధర్మం పాఠించిన ప్రతీ ఒక్కరికీ అందింది. జీవించినంతకాలం ఆనందం వారి జీవితాలలో తాండవించింది. ధర్మం తప్పిన ప్రతీ ఒక్కరికీ అది దూరమయ్యింది. దూరమవుతూనే ఉంది. బ్రాహ్మలు కూడా దీనికతీతులు కారు. )
2. భక్తులు మొక్కులు మొక్కి హుండీలలో కొంత ధనాన్ని వేస్తారు. లేదా ఎటువంటి మొక్కూ లేకపోయినా దేవాలయ నిమిత్తం హుండీలో కానుకలు వేస్తారు. దేవాలయం కోసం అని వేసే విశాల హృదయులు నేడు చాలా తక్కువ. మొక్కుల రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ. మొక్కుల ద్వారా వచ్చే ఆదయానికి ఆశపడి కొన్ని దేవాలయాల వారి ప్రచారం మరీ ఎక్కువవుతున్నది.

ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని ధర్మ కర్తలు, అర్చకుని ఆదాయాన్ని నియంత్రించే మార్గాలను వెతుకుతారు. అతనికి హారతి పళ్లెంలో వసే చిల్లరతో సహా అతను హుండీలోనే వేయాలి అనే నియమంతో అర్చకుని నియమిస్తారు. ఒక వేళ ఏ భక్తుడైనా ఇదేమిటని ప్రశ్నించి నేను అర్చకునికే వేస్తాను అని వాదించింనా లాభం లేదు. అతను వెళ్ల గనే ఆ దక్షిణ హుండీలో పడాలి. ఎండోన్ మెంటు దేవస్థానాలలో ఇది మరీ అధ్వాన్నం. అలా పళ్లెంలో వేసే ధనాన్ని అర్చకుడు దొంగ తనంగా ఎవ్వరి కంటా కనపడకుండా ఇంటికి తీసుకు వెళ్ల్లాలి. ఇలా మొదలైన దొంగతనాలు నగల వరకూ ప్రాకు తాయి కొందరు అర్చకుల విషయంలో. ఇది నిస్సంకోచంగా ఖండించ వలసిన విషయం. ఇందులో ఎవరూ ఆ అర్చకులను వెనకేసుకు రాకూడదు.అసలు దొంగతనం ఎందుకు చేయాలి అర్చకుడు?
తన డబ్బును దేవస్థానం వారు అదో హక్కులా లాక్కుంటుంటే అర్చకుడు చూస్తూ ఊరుకోవలసిందేనా? దీని కేమిటి పరిష్కారం? మీదృష్టిలో ఇది సబబేనా?

గమనిక: ఏ దేవాలయంలోనూ నేను అర్చకుడిని కాదు. సర్వ స్వతంతృడి నైన పురో హితుడిని. పూజ చేయించమని గౌరవంతో ఎవరైనా నా దగ్గరకు వస్తే చేయిస్తాను. లేదా ఇంట్లో కూర్చుంటాను. అర్చకునిగా మొదట కొంతకాలం చేశాను కనుక, తోటి వారి కష్టాలు చూస్తున్నాను గనుక మనసాగక ఇదంతా రాశాను. ఎవరి మనసైనా నొప్పించి ఉంటే మన్నించండి. ఈ విషయంలో మీరు చేయగల సహాయమేమిటో ఆలోచించండి. ఒక్కసారి మీదగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ అర్చకుని జీతం ఎంత? అతని కి వచ్చే ఆదాయం ఎంత? అతనికి వసతి సదుపాయం కల్పించారా? కల్పిస్తే అది ఎలాఉంది? గమనించి వచ్చి మీవ్యాఖ్యను రాయండి.

Friday, December 11, 2009

ఒక దేవాలయం




ఒక దేవాలయం కట్టడానికి సంకల్పం చేసిన దగ్గరనుండీ.., విగ్రహం తేవడం, దేవాలయ నిర్మాణానికి, నిర్మాణ అనంతరం నిత్య పూజలకు అర్చకుని జీతభత్యాలకు తగిన ఆదాయం కావాలి కనుక తోచిన చందాఇచ్చి, నలుగురినీ ఇమ్మని భక్తులను ప్రోత్సహించడం, గుడి పూర్తయిన తరువాత ఓ అర్చకుని చేర్చడం మొదలైన ప్రతి పనిలోనూ నావంతు తోడ్పాటును ఆలయ కమిటీ వారికి అందించాను. వారు నన్ను చాలా గౌరవించారు, గౌరవిస్తున్నారు కూడా. “ మీ సహకారం వల్లనే ఓ సంవత్సరం తిరగకుండానే మేము దేవాలయం కట్ట గలిగాము. మీ వక్చాతుర్యం గొప్పది. మీకు ఏ విషయం ఎలాచెప్పాలో చక్కగా తెలుసు.” అంటూ తెగ పొగిడేస్తారు. నాకు తెలుసు వాళ్లు కాస్త ఎక్కువ పొగుడుతున్నారని. కానీ నేను ఇవన్నీ వారి పొగడ్తల కోసమో, లేదా పేరుకోసమో చెయ్యలేదు.

వారు సంకల్పించినది కార్యం దైవకార్యం కాబట్టి, నాకు తెలిసింది అందరినీ దైవకార్యాలు చేసేటట్లు ప్రోత్సహించడమే కాబట్టి, నేను మంచిపని అని నమ్మాను కాబట్టి నేను ఆచరించి నలుగురినీ ఆచరించమని ప్రోత్సహించాను. అందులో కొంత ఆనందం పొందాను.

అయితే ఈ మధ్య నేను ఆ దేవాలయానికి వెళ్లిన ప్రతిసారీ వారు మీరు మళ్లీ ఏవో ఒక కొత్త కార్యక్రమాలు పెట్టి భక్తులు రోజూ దేవాలయానికి వచ్చేటట్లు చేయాలి. మీ వల్లనే ఇది సాధ్యం. ఆ పూజారి ( అర్చకులు ) ఉన్నారుగానీ వారికి మీరు చెప్పినట్లు భక్తులకి చెప్పడం రావటం లేదు. ...... ఇలా మళ్లీ భజనలు ప్రారంభించడం మొదలుపెట్టారు. నాకెందుకో కొంచం బాధనిపించింది.

రోజూ భక్తులు దేవాలయానికి రావడం మొదలు పెడితే దేవాలయ ఆదాయం పెరుగుతుంది. దానితో ఆలయ ఖర్చులు చూడవచ్చు అని వారి భావన. కానీ నాకు వారి భావం నచ్చలేదు. ఎవరో రావాలి , కానుకలు వేయాలి, ఆ కానుకలతో దేవాలయం నడవాలి. ప్రస్థుతం కానుకలు రావటం లెదట. అందువల్ల నిరంతరం వెలగవలసిన అఖండ దీపం ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మాత్రమే వెలుగుతోంది. నిత్య నైవేద్యం కోసం అర్చకునికి ఇస్తానన్న బియ్యం ఇవ్వటం లేదు. ఆలయం శుభ్రం చేయించడానికి పనిమనిషిని పెట్టటానికి కూడా డబ్బులు లేవట వారివద్ద. ఇలా అనేక పనులు ( ఖర్చుతో కూడినవి ) సరిగా చేయటం లేదు.

నేను ఇదంత చూచి ఒకటే చెప్పాను. నేను చెప్పే కబుర్లకు భక్తులు వస్తారనుకోవడం పొరపాటు పని. మీరు ఆచరించే పనిని బట్టే భక్తులు రావడం, రావక పోవడం ఉంటుంది. నేనేది చెప్తానో అది నేను కూడా ఆచరిస్తాను. అందుకే కోంత భక్తులు అనుసరించే అవకాశంఉంది. కానీ నేను ఏదైనా చెప్పాలంటే ముందు నేనది మంచిది అని నమ్మాలి. భక్తులు రావడానికి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. కానీ ముందు భక్తులు రావడానికి నా మాటల కన్నా, మీ చేతలే ముఖ్యమైనవి.
మీరు ప్రతినిత్యం పూజను సరిగా జరిపే మార్గం చూడండి. రోజూ అభిషేకానికి పాలు లేవు. దీపారాధనకు నూనె లేదు అని పూజను చేయడంలో అశ్రద్ధవహిస్తే , భక్తులు వచ్చేవారుకూడా రారు. ఎందుకంటే ఎక్కడ పూజలు సక్రమంగా జరుగుతాయో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ భక్తులు ఉంటారు. భక్తుల కోరికలు తీరాలంటే అక్కడి భగవంతుడికి మంత్రబలం ఎక్కువగా ఉండాలి. అంటే విశేషమైన పూజలు నిరంతరం జరుగుతూ ఉండాలి. ఆ మంత్ర బలం వల్ల దేవాలయంలో ప్రశాంతమైన స్థితి నెలకొంటుంది. ఎన్నో ఒత్తిళ్లలో దేవాలయానికి వచ్చిన వారికి కూడా అడుగిడిన వెంటనే ఓ అవ్యక్తమైన మానసిక శాంతి కలుగుతుంది. ఇంకా అక్కడే ఉండాలని పిస్తుంది.

ఇలా జరగాలంటే ఆలయ ధర్మకర్తలకు, అర్చకునికి భగవంతునిపై అచంచల విశ్వాసం ఉండాలి. స్వామికి జరుగవలసిన సేవ ఏదైనా జరగకపొతే తాము ఓ పూట భోజనం మానివేసి అయినా ఆ సేవ జరిపే చిత్తశుద్ధి ఉండాలి. అలాంటి వారికే భగవంతుడు వశుడవుతాడు. మీకు అలాంటి పట్టుదల ఉంటే చెప్పండి, నా సహకారాన్ని తప్పక అందిస్తాను. మనం అందరం కలిసి ఈ దేవాలయాన్ని ఓ ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దుదాము. మీకు కూడా ఇటువంటివి కొత్త కనుక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వాటిని నిజాయితీతో ఒప్పుకుని సరిదిద్దుకునే మనస్థత్వం మీకుండాలి. ఇంకొక విషయం మీరు దేవాలయంలో టికెట్ లు ఎప్పుడు పెడతారో అప్పటినుండీ నేను తప్పుకుంటాను. ఆ టికెట్ పద్ధతికి నేను వ్యతిరేకిని. అందుకు మీకు సమ్మతమైతే మనం ముందుకు సాగుదాము. అని చెప్పాను.

వారందరూ మీ సహకారముంటే మేము ఏమైనా చెయ్యగలము. మీరు చెప్పినవన్నీ తప్పక పాటిద్దాము. అని చెప్పారు. వారి స్పందన చూసి నేను కాస్త ఆనంద పడ్డాను. కొంత కాలం గడిచింది. ఒక నాడు దేవాలయానికి వెళ్లే టప్పటికి ఓ బోర్డు కనిపించింది. “ కానుకలు హుండీలో మాత్రమే వెయ్యండి ”. :)

Sunday, November 15, 2009

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు?

భగవంతుడికి కోపం ఎందుకు వస్తుంది? కామ క్రోధాలు ఉన్నచో అతడు భగవంతుడెందుకు అవుతాడు? అని అప్పుడప్పుడూ పూజల సందర్భంలో కొందరు ప్రశ్నిస్తుంటారు.

వాటికి నేను ఇలా సమాధానం ఇస్తుంటాను. భగవంతుడికి కోపం వస్తుంది. అది అందరి కోపం వంటిది కాదు. మనం తప్పు చేసినప్పుడు ఆయనకు కోపం కలుగుతుంది. అది అమ్మకు తన బిడ్డ ( తప్పు చేసినప్పుడు అతని ) మీద కలిగేటటువంటి కోపం. తన బిడ్డ తప్పుచేయగానే అతను మరోసారి అలా చేయకుండా ఉండేందుకు, అతనిని సక్రమ మార్గంలో నడిపేందుకు ఆ తల్లి తన బిడ్డను ( తెచ్చిపెట్టుకున్న ) కోపంతో దండిస్తుంది. అది నిజమైన కోపం కాదు. తెచ్చిపెట్టుకున్న కోపం. అంటే కోపం వచ్చినట్లుగా అతన్ని భ్రమింపచేసి, తద్వారా అటుల మరల తప్పు చేయకూడదు అని తెలియజేయుటే ఆమె లక్ష్యం. అది ఎక్కువ కాలం ఉండే కోపం కాదు. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా మాయమవుతుంది.

అది ఎప్పుడు మాయమవుతుంది?

ఆ బిడ్డ తల్లి కొట్టగానే అమ్మా! అంటూ ఏడుస్తాడు. తన బిడ్డ నోటి నుండి ఎప్పుడైతే తన కోసమైన ఆర్తి తో కూడిన పిలుపు వినిపిస్తుందో ఆ క్షణాన్నే ఆమె కోపం మాయమై ఆ స్థానంలో ప్రేమపొంగుకొస్తుంది.

” అయ్యో! కన్నా! గట్టిగా తగిలిందా నాన్నా!? ఇంకెప్పుడూ కొట్టనులే. ఎందుకురా నాన్నా నాకు కోపంతెప్పిస్తావు? మరోసారి ఇలాచెయ్యకే మరీ? ”
అంటూ అతన్ని ప్రేమతో లాలించి బాధను మరిపిస్తుంది.

సరిగ్గా అటువంటిదే భగవంతుని కోపం కూడా. మనం తప్పు చేసినప్పుడు, మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి అతను కోపాన్ని నటిస్తాడు. అది శాశ్వతమైన కోపం కాదు. ఎల్ల కాలమూ ఉండ బోదు. ఎప్పుడైతే మనం మన కొచ్చిన బాధలకు/ కష్టాలకు తాళలేక అతని శరణు ఆర్తితో అర్థిస్తామో ఆక్షణమే అతని కోపాన్ని ఉపశమించి, ప్రేమను కురిపిస్తాడు.

మళ్లీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది.

భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేటప్పుడు ఇందరు అవినీతి పరులు ఎలా పుట్టుకు వస్తున్నారు? భగవంతుడు వారందిరినీ సరిదిద్దడేమి?

అలా అర్థించిన ప్రతీ ఒక్కరి కష్టాలు తీరే టట్లైతే ఇందరికి ఇన్ని విధాలైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? వారి బాధలు తొలగిపోవేమి? అని


భగవంతుడు అందరినీ సక్రమ మార్గంలో నడిపేందుకే ఉన్నాడు. తల్లి తన అందరు బిడ్డలనూ ఒకే విధంగా చూస్తుంది. ఒకరిని ఒకలా, వేరొకరిని మరోలా చూడాదు. అందరూ మంచి మార్గంలోనే నడావాలని కోరుకొంటుంది. అందువల్లనే తప్పుచేసిన అందరినీ దండిస్తుంది. కానీ అందరూ తమను దండించింన వెంటనే ఆమెను శరణు వేడరు. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. ఒకరు ఆమెనుండి దూరంగా ఉండడం ప్రారంభించవచ్చు ( భగవంతుడి వల్ల తమకు జీవితంలో ఎన్నో దెబ్బలు తగిలాయని అతని పూజించడం మానిన భక్తుల వలే ), వేరొకరు ఆమెను మోసం చేయడానికి అంటే ఆమె సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరోలా ప్రవర్తించడానికి ప్రయత్నించ వచ్చు ( రోజూ గుడిలో పూజలు చేస్తూ, బయటకు రాగానే ఇతరులను మోసంచేస్తూ ఉండే భక్తుల వలే )

కానీ ఏ కొడుకు ఎలా ప్రవర్తించాడో దానికి తగిన విధంగా స్పందిస్తుంది తల్లి. అమ్మా అని అర్థించిన వాడిని అక్కున చేర్చిన ఆ తల్లే , తననుండి దూరమవ్వడానికి యత్నించే కొడుకు విషయంలో , మోసంచెయ్యడానికి యత్నించే కొడుకు విషయంలో వేరు వేరు విధాలు గా స్పందిస్తుంది. ఏది ఏమైనా ఆమె అంతిమ లక్ష్యం తన బిడ్డను సక్రమ మార్గంలో పెట్టడమే. విద్య ఒక్కటే అయినా అది నేర్చుకునే పిల్లవాడిని బట్టి దాన్ని వేరు వేరు విధాలుగా నేర్పుతాడు గురువు.

సరిగ్గ అదే విధంగా భగవంతుడు కూడా మనందరినీ సమానంగానే చూస్తున్నప్పటికీ, మన ఙ్ఞానాన్ని బట్టి మనకు వేరు వేరు విధాలైన పరీక్షలు పెట్టి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంటాడు.

అంటే భగవంతుడు మనల్ని చూసే విధానంలొ ఎటువంటి తేడాను లేదు. ఆ భగవంతుడి చర్యలను మనం స్వీకరించే విధానంలోనే ఉంది ఈ తేడా అంతా. ఒకడుతనకు కించిత్ ఆపద కలుగ గానే భగవంతుడిని శరణు వేడితే, మరొకడు తన తలకు ఎన్ని బొప్పిలు కట్టినా ఆభగవంతుడి మహిమను గుర్తించి, అతని శరణు వేడడానికి త్వరపడడు. అయినప్పటికీ ఆ భగంవతుడు వేరు వేరు పధ్ధతులలో అతనిని అనుగ్రహిస్తాడు.

Friday, November 6, 2009

శ్రీ రామచంద్ర హారతి పాట

నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. ఇది నాకే కాదు చాలా మందికి ఇష్టం. నాదగ్గర పాట ఉన్న పుస్తకాలు దాదాపు ఇరవై వరకూ ఉండాలి. అవన్నీ అందరూ తీసుకుపోగ చివరికి ఒకపుస్తకం మిగిలింది. అదికూడా జీర్ణమైపోతుండడం వల్ల దాన్ని ఇక్కడ భద్ర పరుచుకుంటున్నాను. ఇది మరెవరికైనా ఉపయోగపడితే మరింత సంతోషం.

శ్రీ రామచంద్ర హారతి పాట






రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం

కౌసలేశాయ మందహాసదాస పోషకాయ
వాసవాది వినుత సద్వరద మంగళం

చారు కుంకుమోపేత చందనాగరు చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం

లలిత రత్న కుండలాయ తులసీవనమాలికాయ
జలజ సదృశదేహాయ చారు మంగళం

దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ
భావజాగురువరాయ భవ్యమంగళం

పుండరీకాక్షాయ పూర్ణ చంద్ర వదనాయ
అండజా వాహనాయ అతులమంగళం

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ సుభద మంగళం

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

భద్రాద్రి క్షేత్రవాస, నారాయణ దాసపోష
నవ్య నీరద ఘనశ్యామ దివ్య మంగళం

మంగళం కోలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవతి తనూజాయ సార్వ భౌమాయ మంగళం.

Thursday, November 5, 2009

వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు

ఉదయం నిద్ర లేచిన వెంటనే పఠించు ధ్యానము:

బ్రహ్మమురారి త్రిపురాంతకారీ భానుశ్శశిః భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రశ్శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే
అనేకరత్న సంపన్నే పాదఘాత క్షమా భవ.

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం.

సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే.

స్నానము చేయునపుడు పఠించవలసినవి:

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

ఆవాహయామి త్వాం దేవి స్నానార్థమిహ సుందరి
ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే.

పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత స్తథా
ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో2పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:





వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా.

సరస్వతీ ప్రార్థన:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.

పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేశరవర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు
సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా.

దక్షిణామూర్తి ప్రార్థన:

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ్ ఙ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః.

గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.

భోజనమునకు ముందు:

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

భోజనమునకు తరువాత:

అగస్త్యం కుంభకర్ణం శమ్యం బడబానలం
ఆహారపరిణామార్థం స్మరామి వృకోదరం.

సంధ్యా దీపమునకు:

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే.

నిద్రకు ఉపక్రమించునపుడు :

అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం కృష్ణం జపేద్దుస్వప్న శాంతయే.

రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనేయసి స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి.

ఇంటి నుండి కార్యార్థులై వెళ్లునపుడు:

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం.

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః.

ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

ఔషధ సేవనము చేయునపుడు:

ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి.

శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తేకళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః.

Sunday, October 25, 2009

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి



ముందుగా
కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.

తతః శత పదాని గత్వా
- వంద అడుగులు వేయవలెను. తరువాత

అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ త్వరోగోర మమచాస్తు దేహః.


అంటూ పొట్టను ముమ్మారు నిమర వలయును. తద్వారా ఆహారము చక్కగా జీర్ణమగును.

Wednesday, September 2, 2009

దేవీ పూజావిధానం -1


లక్ష్మీ పూజ కానీ, రేపు దేవీ నవరాతృలలో చేసే దుర్గా పూజ కానీ- మరే దేవీ పూజ కానీ మీరు సొంతంగా- రోజూ ఇంట్లో చేసుకోవడానికి వీలుగా టపా రాస్తున్నాను. మీరు చేయ వలసిందల్లా " శ్రీ లలితా దేవీ " అని ఉన్నచోట మీరు పూజించే దేవత పేరు పెట్టు కోవడమే. స్త్రీ స్వరూప దేవతలకు మాత్రమే పనికి వచ్చే శ్లోకాలతో రాయబడుచున్నది. కనుక పురుష స్వరూప దేవతలకు పనికి రాదు.

టపాలో పూజ చేయవలసిన విధానంతో పాటు, లలితా దేవి పూజను కూడా రాస్తున్నాను. అది అందరికీ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. నిజానికి పూజా మంత్రాలతో కూడిన అనేక పుస్తకాలు బయట షాపుల్లో దొరుకుతున్నాయి. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో చెపుతూ ఒకొక్క సేవ వివరిస్తే బాగుంటుంది అనే భావనతో టపా రాస్తున్నాను.

షోడశోపచార పూజ: 16 రకాలైన సేవలను చేయుటయే "షోడశోపచార పూజ" అనబడుచున్నది. మన ఇంటికి వచ్చిన అతిథిని విధంగా గౌరవంతో సేవిస్తామో అదే విధంగా మన అభ్యర్ధనను మన్నించి వచ్చిన భగవంతుని 16 రకాలైన సేవలతో పూజిస్తామన్నమాట. కుదిరితే " పూజ చెయ్యబోతున్నారా..? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి " అనే టపా కూడా చదవండి.


ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.

శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఎంగిలి చేతిని కడగాలి )

( నమస్కారము చేస్తూ క్రింది నామాలు చదవాలి)

ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.

సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.

భూతోచ్ఛాటన: ( క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.

ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని రోగ్యముతో జీవించ వచ్చును.

సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే సంకల్పం పనికి వస్తుంది.)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)

....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో ఏ సంవత్సరమైతే ఆ పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )

( వీలైతే ఈ పూజా విధానం చివరిలో ఈ సంవత్సరాలు, నక్షత్రాలు మొ.గు మొత్తం పేర్లు రాస్తాను.)

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-

శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-

ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )


మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే. ( అని అక్షతలు నీళ్లు పళ్లెంలో వదిలి పెట్టాలి )

టూకీగా ఈ సంకల్పం వివరణ: కలియుగం ప్రథమ పాదంలో-భారతదేశంలో- హైదరాబాదులో- నాకు శుభమును కలిగించు గృహములో- దేముని ముందు ఉన్నటువంటి నేను- ఫలానా సంవత్సర-మాస-తిథి-వార-నక్షత్ర ములు కలిగిన ఈ శుభ దినమున- ....గోత్రంలో పుట్టిన-........ పేరుతో పిలవబడే-

ధర్మ పత్నితో కూడుకున్న వాడనైన( ఆడవారు ఇది చెప్పుకోనవసరం లేదు ) నేను-

శ్రీ లలితా దేవిని ఉద్దేశించి- శ్రీ లలితా దేవి ప్రీతి కొరకు-నాకు శ్రీ లలితా దేవి అనుగ్రహం కలగడం కొరకు- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి 16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను.

విధంగా సంకల్పించిన తరువాత కలశారాధన చేయాలి. అది తరువాతి టపాలో రాస్తాను. పూజ మొదలు పెట్టే ముందు చెప్పుకోవలసిన చిన్న కథ ఒకటి ఉంది.

పిట్ట కథ

పూర్వం రామ నాథం అనే ఒక మహా భక్తుడు ఉండే వాడు. అతడు ప్రతినిత్యం విష్ణు మూర్తి పూజచేస్తే కానీ మంచినీరు కూడా సేవించే వాడు కాదు. ఈతని భక్తికి మెచ్చి ఒక రోజు భక్త దయాళుడైన శ్రీ మహా విష్ణువు దర్శనమిచ్చారు. రామ నాథం స్వామి వారిని చూచి తనమయత్వంలో మునుగి పోయాడు. స్వామివారితో మాట్లాడుతున్నాడే గానీ, ఏమి మట్లాడుతున్నాడో ఏమీ ఎరుకలేదతనికి. స్వామివారే చివరికి నీ ఇంటికి వచ్చిన నన్ను చూస్తూ కూర్చోవడమేనా? నా కేదైనా పెట్టేదుందా? అని అడిగారు. రామనాథం కంగరుగా అరిటి పండు వలిచి పెట్టాడు.స్వామి అది తిని కొంతసేపటి తరువాత అంతర్థానమయ్యారు. స్వామి వారు వెళ్లిన తరువాత రామనాధం తాను స్వామికి పండు ఇవ్వడానికి బదులు తొక్క ఇచ్చినట్లు గుర్తించాడు. అయ్యో పరధ్యానంలో పొరపాటున స్వామికి తొక్క ఇచ్చి మహా అపరాధం చేశానే అని చాలా విచారించాడు.

కానీ ఏమి చెయ్యగలడు? పొరపాటు జరిగిపోయింది. దానిని సరిదిద్దుకోలేడు.

" జరిగిందేదో జరిగింది. జరిగిన దాని గురించి బాధపడి లాభంలేదు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి " అని నిశ్చయించుకున్నాడు రామనాథం.

మరలా ప్రతీ రోజూ యథాప్రకారంగా స్వామిని ఆరాధిస్తున్నాడు. కొంత కాలానికి మరల రామనాథానికి స్వామి దర్శనమిచ్చారు. అతనికి పూర్వం తాను చేసిన అపరాథం గుర్తుకు వచ్చింది. ఈ సారైనా స్వామికి అరటి పండును సమర్పిద్దామని జాగ్రత్తగా అరటి పండు వలిచి స్వామికి ఇచ్చాడు. స్వామి చిరునవ్వు నవ్వి ఆ పండు ప్రక్కన పెట్టి మాయమై పోయారు. రామనాథం ఆశ్చర్యపోయాడు. ఏమిటీ స్వామి పుర్వం తొక్క ఇస్తే స్వీకరించారు. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా పండు వలిచి ఇస్తే ప్రక్కన పెట్టి మాయమై పోయారేమిటా అని ఆత్మ విచారణ చేసుకున్నాడు.

అప్పుడు తెలిసింది. మొదటి సారి తొక్క ఇచ్చినప్పుడు రామనాథం మనసు స్వామిపై పూర్తిగా లగ్నమై ఉండడం వల్ల తొక్కను కూడా ప్రీతిగా స్వీకరించారు. కానీ రెండవసారి అతని మనసు అరిటిపండును వలవడంలోనే లగ్నమైంది. కనుక స్వామి ఆ అరటి పండును అతనికే ఇవ్వడం ద్వారా

" నీ మనసు దేనిపై లగ్నమై ఉందో అదే నీకు నేను ఇచ్చేది " అని చెప్పినట్లైంది.

కనుక పూజ చేసే టప్పుడు మనము ఏమి సమర్పిస్తున్నాము అన్న దాని కన్నా, ఎంత భక్తితో, ఏకాగ్రతతో సమర్పిస్తున్నాము అన్నది గ్రహించాలి. మనసు నిలువకుండా చేసే ఎంతటి పుణ్యకార్యమైనా వ్యర్థమే. అలా నిలవాలంటే నామస్మరణ చాలా చక్కని ఉపాయం. నామస్మరణను గూర్చిన మరో చక్కని కథతో " దేవీ పూజావిధానం-2 " రాస్తాను. అంత వరకు సెలవు.