Wednesday, December 30, 2009

మూఢనమ్మకాలు

రహమతుల్లా గారు నా ఆస్తిక-నాస్తిక వాదన అనే టపాకు వ్యాఖ్యగా మూఢనమ్మకాలపై మంచి విషయాలు ప్రస్థావించారు. అక్కడ వెంటనే ప్రచురింప బడక పోవడం వల్లననుకుంటా నా క్రితం టపా కానుకలు హుండీలో మాత్రమే వెయ్యాలా? అనే టపాలో కూడా వ్యాఖ్యగా రాశారు.

ఇక వారు ప్రస్థావించిన అన్ని విషయాలనూ నాకు నేను ప్రశ్నించుకుంటే వాటికి ఏ సమాధానాలు ఇచ్చుకుంటానో వాటిని ఇక్కడ తెలియజేస్తాను. అవి చాలా మందికి కలిగే సందేహాలు కనుక ఈ టపా అందరికీ ఉపయోగ పడవచ్చు.

ఇక వరుసగా ఆ విషయాలు ( ప్రశ్నలు )చూద్దాం.


1* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు, ఇదొక మానసిక దివాళాతనం

ఈ విషయంలో నేను ప్రత్యక్షంగా చూస్తేకానీ ఏమీ స్పందించలేను. ఎందుకంటే ఇక్కడ ఒకరి ఎంగిలి ఒకరు ఎంతో మక్కువతో తింటున్న ప్రజలను చూస్తున్నాను. హోటళ్లలో అయితే అది శాఖాహారమా, మాంసాహారమా అని కూడా ఆలోచించటం లెదెవరూ. చక్కగా చికెన్ తో ఏదో వేపుడు చేసిన మూకుడు లోనే, నూడుల్స్ వేయిస్తాడు. జనాలు అవి ఆవురావురుమని తింటున్నారు . దీనిని చూసిన నాకు అదేమీ అంత పెద్ద పైత్యమనిపించడంలేదు. కానీ ప్రత్యక్షంగా చూస్తే మరోలా అనిపించవచ్చునేమో.

2* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఇది ఆచరించవలసిన విధానమే. దేవాలయం అంత విశాల ప్రాంగణంలో కట్టాలి అని తెలియజేయడానికి ఇది సంకేతం. మన ఇల్లు కట్టినట్టు చిన్న చిన్న స్థలాలలో దేవాలయాలు కట్టకూడదు. వంటిల్లు, హాలు ఒకేలా కట్టము కదా? అలగే దేవాలయాన్ని ఎలా నిర్మించాలి అనే విషయంలో కొన్ని విధనాలు పాఠించాలి మనం.

3* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.

ఇది నిజంగా మూఢనమ్మకమే. ఇది తప్పక ఖండించాలి.

4* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.

ఇది నేను ఇదివరకు వినలేదు. గ్రామ వాతావరణంలో అది సబబేనేమో.. ఆ జాతరలు జరిగే రోజులు అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో వస్తాయా? అలా అయితే అది సమంజసమే కదా? శుభకార్యాల పేరుతో జనాలు ఎక్కువగా ఒక్కచోట చేరటం వల్ల అవి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా? పూర్వం గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా ఈ వ్యాధులకు ఎంతో మంది బలైపోయేవారు. అందుకే అటువంటి నమ్మకం ఏర్పరచుకుని ఉంటారు. అది మంచిదే అనిపిస్తోంది.


5* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

అవునా? నాకు ఈ విషయం తెలియదు. ఏదీ సరిగా తెలియకుండా వ్యాఖ్యానించడం అంత సబబుకాదు. అందుకే నేనేమీ చెప్పలేను.

6* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఇది దారుణం. చేత బడుల గురించి వినడమే గానీ , నిజంగా చూడలేదు.అయితే చేతబడులు లేవని నేను నమ్మలేను. అది ఒక హిప్నాటిజం లాంటిది.పూజలు అనేవి మానసిక బలాన్ని పెంచగలవని నమ్ముతాను.అలాగే చేతబడులు మానసికంగా కృశింపచేయడానికి ఉపయోగ పడతాయేమో అనుకుంటున్నాను. కానీ నేడు అంత దీక్షగా చేయగలిగే వారెంతమందీ అన్నదే సందేహం.

7* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.

ఇది ఖచ్చితంగా మూఢనమ్మకం. ఆ పూజారి ప్రజల బలహీనతలతో బ్రతుకుతున్నాడని చెప్పగలను.


8* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

ఇది మూఢనమ్మకం కాదు. ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంతగా పనిచెయ్యవు. ఆకాశంలో జరిగే క్రియలు మన దేహంపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయన్నది నేను నమ్ముతాను. చంద్రుడి వెన్నెల మనసుకు ఎలా ఆనందాన్నిస్తుందో, సూర్యుడి వేడి దేహానికి తాపాన్ని ఎలా కలుగజేస్తున్నదో అలాగే ఆ గ్రహణ సమయంలో కూడా మన దేహం ( ఈ ప్రకృతి మొత్తం ) దాని ప్రభావానికి లోనవుతుంది. వేసవి కాలంలో పల్చని వస్త్రాలు ధరించాలి. సీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరించాలి. అలా అని అది నియమం కాదు. ధరించక పోతే ఏమౌతుంది? ఆ బాధను భరించవలసి ఉంటుంది. అలాగే ఈ గ్రహణ సమయంలో భోజనాదులు కూడా నిషిద్ధం. అలా చేయటం చేయక పోవడం వారి వారి నమ్మకం మీద ఉంటుంది.

అన్నీ కంటికి కనపడవు. కొన్ని కంటికి కనిపిస్తే , కొన్ని బుద్ధికి తడతాయి మరి కొన్ని మనసుకు గోచరిస్తాయి. వేటి కీ అందక పోయినా అవి అసత్యాలని కాదు. ఏది సత్యం, ఏది అసత్యం అనేది తెలియాలంటే నిరంతర వినయంతో కూడిన, తప్పును సరిదిద్దుకోగలిగిన వివేచన మాత్రమే మనకు దారి.

9* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.

ఇక కొన్ని ఇలాంటి నమ్మకాలు కొంత సత్యానికి , కొంత కల్పన చేర్చి మరింత చేసి మసి పూసి మారేడు కాయ చేసినవన్నమాట. నాకు సరిగ్గా తెలియదు కానీ తుమ్మగానే మనలో రక్త ప్రసరణ స్తంభించడం, గుండె ఆగడం వంటివేవో అనేక మార్పులు జరుగుతాయట. ఇది సైంటిఫిక్ రీజన్. అందు వలన ఓ క్షణం ఆగి ఏ పనైనా ప్రారంభించమనడం వరకూ నేను ఆచరిస్తాను. ఇక మన తప్పును ఎవరి తుమ్ముపైనో రుద్ధడం అనేది చేతకాని తనం.

10* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.

కన్యా దానం అనేది శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ, ఇలా కాదు సరైన వరునికి దానమివ్వమని చెప్పారు. తద్వారా వారికి సంతానం కలిగి వంశ అభివృద్ధి జరుగుతుంది. ఆ పుట్టిన వారు పితృకర్మలు చేస్తే వీరికి పుణ్యగతులు కలుగుతాయి. అందుకోసం కన్యాదానం చెయ్యమన్నారు. కానీ అది ఇలా వదిలించుకోవడంగా రూపుమారడం శోచనీయం.

11* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.

ఆవుకు మనిషి పుట్టడం నిజంగా జరిగిందా? ఒక వేళ జరిగితే దీపాలు వెలిగించడం అనేది ఓవిధంగా మంచిదే. ఈ విషయం వల్ల నిరూపణవుతున్నదేమిటీ----? మనిషికి కామం మితిమీరిందన్నది తెలుస్తున్నదికదా? ఆ కామాన్ని అదుపులో పెట్టు నాయనా అని ఎవరికి చెప్పాలి. అందరూ పశుప్రవృత్తినుండి, మానవ ప్రవృత్తికి రావాలి ( మనలో చాలా వరకూ పశు ప్రవృత్తి ప్రబలుతోంది అన్నది అందరూ అంగీకరించని నిజం ). అలా రావాలంటే ఈ పూజలూ మొదలైనవి చాలా సహాయపడతాయి. పైగా ఇవి లోకక్షేమంకోరి చేస్తున్నామంటే మరింత త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఎక్కువ. ( తను బాగుపడడానికి ఎంతో బద్ధకించే వాళ్లు ఎంత ఎక్కువ మంది ఉన్నారో..., లోక కళ్యాణం కోసం అనగానే అందరికంటే శ్రద్ధగా చేసేవాళ్లు అంతకంటే ఎక్కువమంది నేడు ఉన్నారన్నది కూడా పచ్చి నిజం . అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను పూజలు చేయించే చోట్ల చాలా మందికి చెప్తాను. మీరు ఇలా రోజూ దీపారాదనచెయ్యండి, మీకు శుభం కలుగుతుంది అంటే వినేవాళ్లు తక్కువే. కానీ నేను లోక క్షేమంకోరి ఓ యాగం చేస్తున్నాను. మీరు వచ్చి తప్పక పాల్గొనాలి అని పిలిచినదే తడవు నాకు అనేక విధాలు సాయపడ్డవారు చాలామంది ఉన్నారు. ) ఈ విధంగా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం అనేది అనాలోచితమైన పని కాదు. ఎంతో ఆలోచించి ఓ మహాను భావుడెవరో ప్రవేశపెట్టిన ఓ పథకం.

ఈ పని ఇలా జరగడమే ఉత్తమం కూడా. మన నేతలలో ఎవరో చాలా పెద్ద కుంభకోణాలలో ఉన్నారనుకోండి. అది ప్రత్యక్షంగావెలుగు చూపితే వచ్చే మంచి కంటే చెడే ఎక్కువ. లోపల వారిని శిక్షించి పైకి మరొ విధమైన రూల్ ని పాస్ చెయ్యడమే తెలివైన ప్రభుత్వం చేసే పని. తద్వారా ప్రజలకు అభద్రతా భావం ఏర్పడకుండా ఉంటుంది. అటువంటిదే ఈ పని కూడా.


12* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

వాటి ప్రాశస్త్యం ఏమిటో నాకైతే తెలియదు. ఇలాంటివి గ్రామాలలో ఇంతలా ఎలా పెరుగుతున్నాయో ఓసారి ఆలోచించాలి. కోరికలు పెరగడమే ఈ నమ్మకాలు పరాకాష్టకు రావడానికి కారణంగా తోస్తోంది. ఏదైనా అతి పనికి రాదు.

13* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.[1]

ఇది ఓ పిచ్చి లాంటిదే. ఆ డబ్బును బీదప్రజలకు దానంగా ఇస్తే ఎన్ని కుటుంబాలకు తిండీ గుడ్డా అందుతాయో కదా..? :(

14* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm


ఇటువంటి వ్యక్తులను ఎలానమ్ముతారో ప్రజలు. ఇటువంటి దొంగ బాబాలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి ప్రభుత్వం.


15* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

కేరళ జ్యోతీష్యాన్ని గురించిన పూర్తి వివరాలు నాకు తెలియదు. నా వరకూ జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది మనం కష్టంలో ఉన్నప్పుడు చుక్కానిలా పనిచేస్తుంది. ఏదారీ తోచని వారికి ఓ వెలుగు బాట చూపుతుంది. కానీ ఎల్లప్పుడూ ఆ జ్యోతీష్యం అవసరం లేదు. మీరు ఎవరూ తీర్చలేని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఆధారపడండి అని అందరికీ చెప్తుంటాను.


16* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

వీటి విషయంలో కూడా ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరిగింది. దీనికి ముఖ్యకారకులు రాళ్ల వ్యాపారులు. జ్యోతీష్యులను పావులుగా చేసి జనాల బలహీనతలతో ఆటలాడారు/ఆడుతున్నారు.

జనాలు కూడా అమాయకులై ధరించడం లేదు. నేను ఇన్ని వేల రత్నాన్ని ధరించాను అని చెప్పుకోవడం ఓ గౌరవం, ఓ దర్జా అయిపోయిందిప్పుడు. నేను ఎవ్వరికీ రాళ్లు పెట్టుకోమని చెప్పను. ఒకవేళ పెట్టు కుంటమన్నా దానికి వేలకు వేలు ఖర్చుపెట్టవద్దు అని ఖచ్చితమైన సలహా ఇస్తాను. దానికంటే రోజూ ఇంట్లో దీపారాధన చెయ్యడం వెయ్యిరెట్లు మంచిది. కానీ జనాలకు శ్రమలేకుండా, పనయ్యే మార్గం కావాలి. దానికి ఎంతైనా ఖర్చుపెడుతున్నారు.

17* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట

చీము,నెత్తురుతో జుగుప్సాకరంగా ఉండే వైతరిణీ నదిని దాటవలెనంటే గోదానం చెయ్యాలి. ఆ గోదాన మహిమ వల్ల దానిని దాటగల శక్తి వస్తుంది.

గోదానానికే ఎందుకంత ప్రశస్తి కలిగింది? అంటే దీనికే కాదు (పైన 10 లో చెప్పినట్టు) ఇంకా అనేక దానాలకు కూడా చాలా గొప్పదనం కలదని చెప్పారు మన పెద్దలు. ఇక్కడ ముందు ఆలోచించ వలసింది గోదానం గొప్పేమిటని కాదు. దానం గొప్పేమిటని?

పూర్వం ధనాన్ని గోవులతో కొలిచే వారు. అంటే అతనికి ఎంత గోసంపద ఉంటే అంత ధనవంతుడన్నమాట. అలాగే ఈ గోపోషణ అనేది పరమ ఉత్తమమైన పనిగా ఎంచబడేది. అలాగే ఈ వైతరిణీ నది అంటే మరేదో కాదు మన జీవితమే అనేక పాపాలతో కూడుకున్న జుగుప్సాకరమైన వైతరిణీ నదికి సంకేతం. ఈ విధంగా పోల్చుకుంటే

మన జీవితాన్ని సునాయాసంగా దాటడానికి దానం అనేది పరమ సాధనంగా ఉపయోగ పడుతుంది. అంటే మనం సంపాదించినది పరోపకారార్థం ఏకోరికాలేకుండా దానం చేయగలిగిన నాడు ఆ జీవితం సుఖదుఃఖాలకు అతీతంగా ఆనందడోలికల్లో తేలిపోతుంది.

హిందూ సాంప్రదాయంలో ( హిందూ అనే కాదు చాలా సాంప్రదాయాలలో ) ఉన్న నిగూఢార్థం అర్థమవ్వాలంటే ఎంతో తపన ఉండాలి. సత్యమునే పలకండి అని అన్ని మతాలు చెప్తున్నాయి. ఆసత్యాన్నే ఎందుకు పలకాలి ? అలా పలికితే మనకు మంచి ఎలా జరుగుతుంది? పలకక పోతే పాపమెలా కలుగుతుంది? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటే దాని పూర్వాపరాలు తెలుస్తాయి. దీనికి చక్కని ఉదాహరణ మన చిన్నప్పుడు చదివిన " నాన్నా పులి" అనే గొర్రెలు కాచే పిల్లవాడి కథ . ఇలాంటి అనేక కథల ప్రభావమో, జీవితానుభవమో మొత్తానికి సత్యాచరణం మంచిదని ఒప్పుకోవడానికి చాలా మందికి అభ్యంతరమేమీ లేదు. కానీ ఇలాంటి కొన్ని ధర్మాలను ఒప్పుకోవడానికి అనేక సంశయాలు వేధిస్తుంటాయి. దానికి వినయంతో కూడిన అన్వేషణే మార్గం.


మన బుద్ధికి,ఊహకు అందని / సమంజసమనిపించని చాలా విషయాలను మనం ముఢనమ్మకాలుగా చెప్తాం. కానీ మనకు తెలిసినవే సమగ్రమైనవి, సరిఅయినవి అనే అభిప్రాయం సరి కాదు. నాకు లేదు. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. మీకు నచ్చితే మరికాస్త ఆలోచించండి. లేదంటే మరల ప్రశ్నించండి. :)

14 comments:

  1. ఈ రహంతుల్లాగారు

    తెలుసుకుందామనే కోరికో లోకప్రయోజనం కోసమో ఈ వ్యాఖ్యలు వ్రాసినట్లు నాకు తోచడం లేదు. ఆయనకేవో ప్రత్యేక లక్ష్యాలున్నట్లున్నాయి. ఎందుకంటె నాబ్లాగుళొ కూడా సంబంధం లేనిపోస్ట్ లలో ఇవే ప్రస్నలు ఆరోపణలతో కనిపిస్తున్నారు. కనుక ఆయన మీరేమి చెప్పినా అంగీకరించరు అనుకుంటున్నాను.

    ReplyDelete
  2. నిజమేనండోయ్, ఈ రహంతుల్లా గారు నా బ్లాగ్ లో కూడా ఇవే ప్రశ్నలు కాపీ పేస్టు కొట్టారు , నేను సమాధానం ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను. యమపురి

    ReplyDelete
  3. ఓ అలాగా.

    అంగీక రించనఖర్లేదు. కనీసం ఆలోచిస్తారని అనుకుందాం. అలా కాకపోయినా ఇలాంటి సందేహాలతో ఉన్న మరికొందరికి ఉపయోగ పడవచ్చు అనుకుంటున్నాను.
    పోనీ లెండి వారి వల్ల ఓ మంచి టపా రాశాను. అంతా మనమంచికే :)

    అప్పారావు గారు మంచి టపా రాశారు.

    ReplyDelete
  4. మంచి వివరణ ఇచ్చారండీ. రహంతుల్లా గారు ఏ ఎద్దేశ్యంతో ఆ ప్రశ్నలు వేసినా నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను.

    ReplyDelete
  5. చాలా పెద్ద పోస్టు. మరోసారి నిదానంగా చదవాలి. మీ సమాధానాలు నిజాయితీగా ఉన్నాయి. అభినందనలు.

    ఒక చోట మాత్రం నవ్వొచ్చింది. ౩.పాప బుధవారం పుడితే అరిష్టమా? - మా పాప బుధవారమే పుట్టింది. ఒకవేళ అరిష్టమని ఎవరైనా ప్రూఫ్ చేసినా సరే, మా పాపాయి మాకు ముద్దే. :-)

    5. మాది అనంతపురమే, అయినా నేను వినలేదు. ఒకవేళ నిజమనుకున్నా, దానివల్ల నష్టం లేదనుకుంటున్నాను. కుక్కను కాలభైరవుడని పూజించే ఆచారం ఉన్నది. కొన్ని గుళ్ళల్లో ఓ మూల ఈ కారభైరవ రూపాన్ని (కుక్క విగ్రహం కాదు) దణ్ణం పెట్టుకుని, ఆ విగ్రహానికి ముందు చప్పట్లు కొట్టటం నేను ఎన్నో ఏళ్ళుగా చూశాను.

    అయినా ఓ విషయాన్ని విమర్శించడానికి, తీవ్రంగా విశ్లేషించడానికి పనికి వచ్చే తెలివి, మనుషులను అర్థం చేసుకోవడానికి, సమన్వయించడానికి పనికిరాకపోవడం శోచనీయం. ప్రతి విషయం తరచి తెలుసుకోవలసిందే. తప్పులేదు. అయితే, అందుకని, ఒకరి పద్ధతులను, ఆచారాలను "తప్పు" అనడం సరి అయిన పద్ధతి కాదు.

    ReplyDelete
  6. "5* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

    అవునా? నాకు ఈ విషయం తెలియదు. ఏదీ సరిగా తెలియకుండా వ్యాఖ్యానించడం అంత సబబుకాదు. అందుకే నేనేమీ చెప్పలేను."

    Am from Hindupur, S.sadlapalli lonee untunnanu, meeru prastavinchina vigraham ekkadaa leedu, oka vela unnaa puja chesi oorukonee paristithi loo akkadi janam leeru.

    am dam sure about it..

    sorry for writing in english

    ReplyDelete
  7. గోదానాలు, చేతబడులు లాంటివి కొన్ని మినహాయిస్తే మీసమాధానాలతో ఏకీభవిస్తున్నాను,"మన పెద్దలు చెప్పినవన్నీ ఆణిముత్యాలే" టైపులో కాకుండా ఆలోచించి ఏది ఉచితం ఏదనుచితం, ఏదవసరం ఏదనవసరం అని ఆలోచించగలిగిన మీలాంటివారి అవసరం ప్రస్తుతం మనకెంతోవుంది.

    ReplyDelete
  8. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete
  9. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)

    ReplyDelete
  10. నూతన సంవత్సర శుభకాంక్షలు .

    ReplyDelete
  11. చాలా విషయాలను శాస్త్రీయ, ఆధ్యాత్మిక పరంగా వివరించారు. వారు ఏ ఉద్దేశంతో రాసినా కొన్ని ఆచారాలకు వివరణ ఇచ్చారు. ధన్యవాదములు.
    నూతన సంవత్సర శుభకాంక్షలు .

    ReplyDelete
  12. రాజశేఖరుని విజయ్ శర్మ గారూ
    అంగీక రించనఖర్లేదు. కనీసం ఆలోచిస్తారని అనుకుందాం. అలా కాకపోయినా ఇలాంటి సందేహాలతో ఉన్న మరికొందరికి ఉపయోగ పడవచ్చు అనుకుంటున్నాను అనే మీ దృక్పదం మంచిది,ఆదర్శనీయం.ఆలోచన ఎంతో అవసరం.మీరు కొన్నింటిని మూఢనమ్మకాలుగా అంగీకరించారు.కొన్నినమ్మకాల వెనుక హేతుబద్దత మీ జవాబుల ద్వారా తెలుసుకున్నా.ఇంకా కొంత మందికి చెబుతా.

    ReplyDelete
  13. For more details regarding attack on Star Comedian Brahmanandam log on to the following link:
    http://blogubevars.blogspot.com/2010/01/4.html

    ReplyDelete
  14. రహమతుల్లా గారు : మీ వ్కాఖ్య అనుచితంగా నాకేమీ అనిపించలేదు. పైగా నాకు తెలిసినంత వరకూ తెలపడం నా బాధ్యత అనిపించింది. అందుకే స్పందించాను.

    ఇక మీరు ఇప్పుడు చెప్పిన విషయంలో అయితే : (మీరు ఇచ్చిన లింక్ లో తల్లీ బిడ్డలకు సంబంధించిన ఏ వివరాలు నాకు కనపడలేదు.) పూజ చేసి కూర్చుంటే అన్నీ మనకనుకూలమైపోవు. పూజ మనకు మనోబలం ఇచ్చే సాధనం మాత్రమే. మనప్రయత్నం మనం చేయాలి. అది లెకుండా దేముడు ప్రత్యక్షమై వరాలిస్తాడు, మన కష్టాలు తీరస్తాడు అనుకోవడం అది మూఢనమ్మకమే అవుతుంది. పూజా విధానానకి సంబంధించిన నా గత టపాలలో కూడా ఇదే చెప్పాను.

    ప్రతీ దానిలోనూ చెడూ మంచీ (తప్పూ ఒప్పూ ) ఉంటాయి. చెడు ను కొద్ది కొద్దిగా తొలగిస్తూ, క్రమంగా మంచి మార్గంలో నడవడమే మనం చేయవలసింది. అలాగే చెడునే చూడడం కాక, ఆ చూసిన చెడునుంచి కూడా మంచిని గ్రహించాలి. ధన్యవాదాలు.

    ReplyDelete