Friday, August 28, 2015

రక్షాబంధనం ఎవరు చేయాలి? ఎప్పుడు చేయాలి?



రక్షాబంధనం
తెలుగువారికి విశేష ఆదరమైన “ధర్మసింధు” నందు ఇలా ఉంది.
శ్రావణ పూర్ణిమ యందు రక్షాబంధనము చేయవలెను. సూర్యోదయము మొదలు ఆరుఘడియలు (1ఘ = 24ని.లు) కంటే ఎక్కువగా వ్యాపించి ఉన్న రోజున అపరాహ్ణ సమయ మందు గానీ, ప్రదోష సమయమందు గానీ భద్ర కరణం లేని సమయమున చేయవలెను. ఒకవేళ సూర్యోదయము తరువాత పూర్ణిమా తిథి మూడు ముహూర్తముల (1 ముహూర్తము=2 ఘడియలు = 48ని.లు) కంటే తక్కువయైనచో ముందురోజు భద్ర కరణం లేని ప్రదోష సమయంలో చేయవలెను. గ్రహణము, సంక్రాంతి దోషములు ఈ రక్షాబంధనమునకు వర్తించవు.
రక్షాబంధనము గట్టునప్పుడు పఠించ వలసిన మంత్రము :
శ్లో|| యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః| తేన త్వామభిబధ్నామి రక్షమాచలమాచల||
 మహాబలుడైన రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఎవరిచేతనైతే కట్టబడినాడో, వానిచే నిన్నుగట్టుచున్నాను. ఓ రక్షాబంధమా! నీవు చలింపకుము.
నిర్ణయ సింధు”లో ఇంకా విశేషంగా ఇలా తెలిపారు.
 శ్లో|| తతో2పరాహ్ణ సమయే రక్షాపొటలికాం శుభాం| కారయే దక్షతైః శస్తైః సిద్ధార్థైః హేమ భూషితైః|| -హేమాద్రి
తరువాత అపరాహ్ణ సమయమందు శుభకరమైన రక్షాపొటలికను ( పొట్లం / Bundle) చేయాలి. అది శుభప్రదమై ప్రశస్తమైన అక్షతలతో – బంగారంతో అలంకరించ బడిన తెల్ల ఆవాలతో చేయాలి.
శ్రావణ పూర్ణిమ నాడు ధరించవలసిన ఈరక్షను “భద్ర” ఉన్నసమయాన ధరించినట్లైతే అది రాజును చంపుతుంది.
శ్లో|| ఉపలిప్తే గృహమధ్యే దత్త చతుష్కే న్యసేత్కుంభం| పీఠే తత్రోపవిశేత్ రాజా అమాత్యైః యుతశ్చ సుముహూర్తే| తదనం పురోధా నృపతేః రక్షాం బధ్నీతమంత్రేణ|| - భవిష్యే
అలికిన ఇంటి మధ్య నాలుగు కాళ్ల పీట మీద కుంభం ఉంచాలి. అక్కడ మరొక పీఠమందు రాజు మంత్రులతో కూడి మంచి ముహూర్తమందు కూర్చోవాలి. ఆపిదప పురోహితుడు రాజుగారికి మంత్రపూర్వకంగా రక్షాబంధనం చేయాలి.
శ్లో|| బ్రాహ్మణైః క్షత్రియైః వైశ్యైః శూద్రైః అన్యైశ్చ మానవైః| కర్తవ్యోరక్షితా చారో ద్విజాన్ సంపూజ్య శక్తితః||
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఇతర మనుజులు అందరూకూడా శక్తి కొలది బ్రాహ్మణుల పూజించి ఈరక్షా ఆచారమును (పైన తెలిపిన విధంగా)  చేసుకోవాలి.

పైవిషయాలన్నిటినీ లోతుగా ఆలోచించిన పిదప మనకు తెలిసేవిషయాలు ఏమంటే
౧. రక్షాబంధనం బ్రాహ్మణునిచే ధరించాలి. ఎందుకంటే మహా బలవంతుడైన రాక్షస రాజు బలిచక్రవర్తి కూడా బ్రాహ్మణునికి బద్ధుడైనాడు. అలాగే మనలోని రాక్షస ప్రవృత్తి తొలగింప చేయు శక్తి మంతుడు మంత్రశక్తి ఉన్న పురోహితుడే. అతని ఆశీర్వచనముతో అతనిద్వారా ధరించాలి.
౨. ఏసమయంలో పడితే ఆసమయంలో ధరించ రాదు. మధ్యాహ్నంకాని, సాయంత్రం ప్రదోష కాలంలో గానీ ధరించాలి. భద్ర కరణం (దీనికి యముడు అధి దేవత ) ఉన్న సమయాన అస్సలు పనికి రాదు. 


౩. ఏదిబడితే అది రక్షగా ధరించరాదు. అక్షతలు, బంగారంతాపడం కలిగిన లేక బంగారం రజను చల్ల బడిన తెల్ల ఆవాలు కలిపి ఒక పొట్లం క్రింద కట్టి, దానికి దారం చుట్టి అది రక్షగా ధరించాలి. 
వైదికమిత్ర” సౌజన్యంతో...

Thursday, August 27, 2015

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త ఏవి చేయరాదు?




గర్భిణీ పతి ధర్మములు :


శ్లో|| గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాద్యథోచితం | సూతే చిరాయుషం పుర్తమన్యథా దోషమర్హతి||


గర్భిణీ స్త్రీ గోరిన వస్తువును ఉచితమైనదానిని తెచ్చియిచ్చుట భర్త యొక్క ముఖ్య ధర్మము. చిరాష్మంతుడగు పుత్రుడు గల్గును. లేనిచో దోషము గల్గును.


మఱియు సముద్ర స్నానము, చెట్లు నరుకుట, క్షౌరము, శవము మోయుట, విదేశ ప్రయాణము చేయరాదు. ఏడవనెల మొదలయిన నాటి నుండి క్షౌరము, మైథునము, తీర్థయాత్ర, శ్రాద్ధభోజనము, నావయెక్కుట విడువ వలెను. పర్వతా రోహణము, యుద్ధములు జేయుట, గృహమునకు స్తంభ ముహూర్తముగానీ, గృహారంభముగానీ, వాస్తుకర్మ గానీ చేయరాదు. నఖ కేశములు కత్తిరించుట, కుమారునకు చౌలకర్మ చేయుట, వివాహము, ఉపనయనము, పిండదానము, శవమును అనుసరించి వెళ్ళుట, ప్రేతకర్మలు చేయుట చేయరాదు.


      క్షౌర కర్మ, ప్రేతకర్మ చేయరాదన్ననూ ప్రాప్తమున్నచో ( తలిదండ్రుల మరణాదులచే ప్రాప్తమైనచో ) చేయక తప్పదు.  కొందరు తలిదండ్రుల ప్రత్యాబ్దీకములందు బిండదానము చేయుచున్నారు. పిండప్రదానము దర్శమహాలయ శ్రాద్ధాదులందు చేయనవసరం లేదు.



 




Wednesday, August 19, 2015

మూఢాలలో మంగళ గౌరీ వ్రతం చేయవచ్చా!?








శ్లో|| నశుక్ర దోశః నసురేద్య దోశః తారాబలం చంద్రబలం విచింత్యం|
ఉద్వాహితాయాః నవ కన్యకాయాః దీపోథ్సవో మంగళ శోభనాని|| ___ జ్యోతిర్నిబంధే
కొత్తగా పెళ్లయిన వథువుకు గురు శుక్ర దోషములు ఉండవు. తారాబల, చంద్రబలాలు అవసరం లేదు. మంగళ కరమైన వ్రతములు దీపోత్సవములు ఆచరించ వచ్చును


 
శ్లో||సీమంతే జాతకే పుంసే మన్వాదిషు యుగాదిషు
మహాలయే మృతాహేచ భూదానే సేతుదర్శనే
వారణాస్యాం గయాక్షేత్రే చతుర్ధ్యాంగణపూజనే
మాంగల్యగౌరీపూజాచ వరలక్ష్మీ తథైవచ
ఏతేషు సర్వకార్యేషు మూఢదోషోనవిద్యతే|| ___ జ్యోతిర్నిబంధే
సీమంతము, జాతకర్మ, పుంసువనము, మన్వాది, యుగాది, మహాలయ శ్రాద్ధము, మృతాశౌచము, భూదానము, సేతుదర్శనము, కాశీ గయా క్షేత్ర ములు, వినాయక చవితి, మంగళ గౌరీ మరియు వరలక్ష్మీ వ్రతములు మొదలగు వాని విషయములో మూఢదోషము ఉండదు. కనుక మూఢములైననూ ఇవి ఆచరించ వచ్చును.