Wednesday, December 21, 2011

అప్పుల బాధ తీరాలంటే ఋణ విమోచక అంగారక స్తోత్రమ్ పారాయణ చెయ్యండి

ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

స్కంద ఉవాచ:

ఋణ గ్రస్త నరాణాంతు ఋణముక్తిః కధం భవేత్ I

బ్రహ్మోవాచ : 
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ I

 ఓ అస్య శ్రీ అంగారక స్తోత్ర మహా మంత్రస్య I గౌతమ ఋషిః I అనుష్టుప్ చ్ఛందః I అంగారకో దేవతా I మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః I 

ధ్యానమ్ :

రక్త మాల్యాంబర ధరః శూల శక్తి గదాధరః I
చతుర్భుజో మేషగతో వరదశ్చధరా సుతః II

మంగళో భూమి పుత్రశ్చ ఋణహర్తా కృపాకరః I 
ధరాత్మజః కుజో బౌమో భూమిజో భూమి నందనః II 

అంగారకో యమశ్చైవ సర్వ రోగాపహారకః I 
స్రష్టా కర్తాచ హర్తాచ సర్వదేవైశ్చ పూజితః II  

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ I
ఋణం నజాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయః II 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష ఋణమాశు విమోచయ II   

రక్త గంధైశ్చ పుష్పైశ్చ ధూప దీపై ర్గుడోదనైః I 
మంగళం పూజయిత్వాతు మంగళాహని సర్వదా II 

ఏక వింశతి నామాని పఠిత్వాతు తదంతికే I 
ఋణరేఖాః ప్రకర్తవ్యా అంగారేణ తదగ్రతః II  

తాశ్చ ప్రమార్జయేత్ పశ్చాత్ వామపాదేన సంస్పృశన్ 


మూలమంత్రః 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల I
నమోస్తుతే మమాశేష  ఋణ మాశు విమోచయ II

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనం లభేత్I
మహతీం శ్రియ మాప్నోతి హ్యపరో ధనదో యువా II
అర్ఘ్యమ్ :

అంగారక మహీ పుత్ర భగవన్ భక్త వత్సల I 
నమోస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ  II 

భూమి పుత్ర మహా తేజ స్స్వేదోద్భవ పినాకినః I 
ఋణార్తస్త్వాం ప్రపన్నోస్మి గృహాణార్ఘ్యం నమోస్తుతే II

ఇతి ఋణ విమోచక అంగారక స్తోత్రమ్

ఈ విధంగా స్తోత్రము చేసి చివరి రెండు శ్లోకములతో మూడు పర్యాయములు దోసిలితో నీళ్లు వదిలి పెట్ట వలెను.   

ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పుల బాధ తీరని వారు ఈ స్తోత్ర పారాయణ చేసి ఫలితాన్ని చూడండి. ఒక పీటమీద ముగ్గులు పెట్టి దానిమీద ఎర్రని బట్ట పరచి -  దానిమీద అంగారకుని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని చిత్రపటమును ఉంచి - ఎర్రని పూలు, ఎర్ర గంధము తో ఈ క్రింది నామాలు చదువుతూ పూజించాలి.

            ఓం మంగళాయ నమః - ఓం భూమి పుత్రాయ నమః - ఓం ఋణ హన్త్రే నమః - ఓం ధన ప్రదాయ నమః - ఓం స్థిరాసనాయ నమః - ఓం మహా కాయాయ నమః - ఓం సర్వకామ ఫల ప్రదాయ నమః - ఓం లోహితాయ నమః - ఓం లోహితాక్షాయ నమః - ఓం సామగాన కృపాకరాయ నమః - ఓం ధరాత్మజాయ నమః - ఓం కుజాయ నమః - ఓం భౌమాయ నమః - ఓం భూమిజాయా నమః  - ఓం భూమి నందనాయ నమః - ఓం అంగారకాయ నమః - ఓం యమాయ నమః - ఓం సర్వరోగాపహారకాయ నమః - ఓం స్రష్ట్రే నమః - ఓం కర్త్రే నమః - ఓం హర్త్రే నమః - ఓం సర్వదెవ పూజితాయ నమః 

అని పూజించ వలెను.  

తరువాత చండ్ర కర్ర ను కాల్చగా వచ్చిన బొగ్గుతో రెండు అడ్డ గీతలు గీసి, వాటి మధ్యలో మీ అప్పుల మొత్తమును రాయవలెను.  
ఉదాహరణకు :

------------------


రు. 50,400 - 00


------------------

పై విధంగా రాసిన తరువాత పై స్తోత్రమును ఏడు పర్యాయములు చదివి  ఏడవ పర్యాయము చదువుతూ ఆ గీతలను, సంఖ్యను ఎడమ పాదముతో పూర్తిగా తుడిచి వేయ వలెను. ఈ విధంగా నలభై రోజుల చెయ్యవలెను. చివరి రోజు చండ్రకర్రలతో కుజునికి హోమంచేసుకుంటే మంచిది. 

ఈ విధంగ చేసిన వారికి సంపదలు పెరిగి, అప్పుల బాధ తీరిపోతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు !
     

Friday, November 25, 2011

గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు


   గ్రహణములకు సంబంధించి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు  ప్రస్తావిస్తాను.

   గ్రహణ స్పర్శ సమయమున స్నానమును, మధ్యకాలమున హోమము-దేవతార్చనము-శ్రాద్ధములను, విడుపు సమయమున దానము, పూర్తిగా విడిచిన తరువాత మరల స్నానమును చేయాలి.

     " సర్వేషా మేతవర్ణానాం సూతకం రాహుదర్శనే" అనుటచేత  ఈ గ్రహణ సమయంలో అన్ని వర్ణముల వారికీ జాతాశౌచముండును. కనుక అప్పుడు ముట్టిన వస్త్రములన్నిటినీ తడుపవలెను.  కనుక ఈ సమయంలో ఏమీ ముట్టుకోకుండా స్నానమాచరించి జపాదికాలు చేసుకోవాలి. గ్రహణమునకు ముందు మూడు రోజుల నుండి గానీ, ఒక రోజు నుండి గానీ ఉపవాసముండి ఈ గ్రహణ స్నానాదులు చేసినచో మహాఫలము.  పుత్రపుత్రికలు కలవారు గ్రహణ సంక్రాంతులందు ఉపవాసము ఉండనవసరం లేదని కొందరి మతము.

      గ్రహణ సమయంలో అందరూ పట్టు స్నానం చేసి , వారి వారి ఉపదేశ మంత్రాలను జపించాలి.  మధ్యలో మరోసారి స్నానంచేసి, మళ్లీ గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేస్తారు.  ఈ సమయంలో స్నానానికి : ఉష్ణోదకము కంటే సీతోదకము, వేరేవారు సంపాదించిన ( తోడి పెట్టిన ) దానికంటే స్వయముగా సంపాదించినది, బావులలో జలముకంటే కొండలు మొదలైనవాటిలో పుట్టి స్రవించి పారునది, అంతకంటే సరోవరము లోనిది, దానికంటే నదీ జలము, దానికంటే గంగా జలము, దానికంటే సముద్రోదకము క్రమముగా ఉత్తమములు. ఈ గ్రహణ సమయానికి జాతాశౌచ, మృతాశౌచములున్నప్పటికీ గ్రహణ సంబంధమైన స్నానదానాదికాలు చేయాలి.  స్త్రీలు  ఆ సమయంలో రజస్వలై ఉన్నప్పటికీ  కూడా వేరేగా ఒక పాత్రలో ఉన్న జలముతొ స్నానము చేసి ఈ వ్రతాన్ని ఆచరించ వలెను.  గ్రహణస్నానము కట్టిన బట్టలతోనే చేయవలెను. తడిసిన బట్ట పిండకూడదు. వేరొక వస్త్రమును ధరించ రాదు.

" సర్వం గాంగా సమం తోయం సర్వేవ్యాస సమాద్విజాః
సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్ర సూర్యయోః " 


సూర్యచంద్ర గ్రహణ సమయంలో దొరికె జలమంతయూ గంగా సమానము, ద్విజులందరూ వ్యాససమానులు, చేసే ప్రతి దానమూ భూదాన సమానము. 

  శ్లో: " చంద్ర సూర్య గ్రహే తీర్థే మహాపర్వాదికే తథా
మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాసనక్షత్రాదీన్నశోధయేత్"


      చంద్ర సూర్యగ్రహణ సమయములలోను, తీర్థ ప్రదేశమందును, మహాపర్వదినములలోను మంత్ర పురశ్చరణ దీక్షకు కానీ, ఉపలక్షణముచే మంత్రోపదేశమును చేయుటాకు కానీ  మాసనక్షత్రాది శోధన అవసరములేదు

అనుట చేత కొత్తగా మంత్రోపదేశం తీసుకోవాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో సద్గురువుల వద్ద జపదీక్ష తీసుకుని జపిస్తారు. మంత్రోపదేశమునకు సూర్యగ్రహణమే ఉత్తమమని, చంద్రగ్రహణము దారిద్ర్యాది దోషకారి అని కొందరి మతము.


"చంద్ర సూర్యో పరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః
జపాద్దశాంశతో హోమ స్తథా హోమాచ్చతర్పణం
హోమా2శక్తౌ జపంకుర్యాద్ధోమసంఖ్యా చతుర్గుణం"


చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి, స్పర్శ కాక మునుపే స్నానము చేసి, అది మొదలుకొని శుద్ధమోక్షము వరకు మంత్రము ఏకాగ్రతతో జపించ వలెను. జప సంఖ్యకు పదవవంతు హోమము, దానికి పదవ వంతు తర్పణము చేయవలెను. హోమము గానీ, తర్పణము గానీ చేయలేని పక్షమున ఆ సంఖ్యకు నాలుగు వంతులు జపమే చేయవలెను. ( ఉదాహరణకు గ్రహణ సమయంలో మొత్తము 1,000 సార్లు జపం చేయగలిగితే అందులో పదవ వంతు 100 సార్లు హోమము, అందులో పదవ వంతు 10 సార్లు తర్పణము చేయవలెను. హోమము చేయలేని పక్షమున 100 కు నాలుగురెట్లు ఎక్కువగా అనగా 400 సార్లు మరల జపమే చేయాలి. అదే విధంగా తర్పణము చేయలేనిచో 40 సార్లు జపం చేయాలి. ) ఈ పురశ్చరణాంగమైన ఉపవాసమును పుత్రవంతులైన గృహస్థులును చేయవచ్చును. గ్రహణ సమయంలో పురశ్చరణ చేయదలచినవారికి మిగతా స్నాన దానాది నైమిత్తికములు చేయుటకు వీలవదు, కనుక అవి భార్యా పుత్రులు మొదలైన వారితో చేయించ వలెను.  పురశ్చరణ దీక్షపూనని వారు కూడా తమ తమ ఇష్టదేవతా మంత్ర జపమును, గాయత్రీ మంత్ర జపమును తప్పక చేయవలెను. లేనిచో ఆయా మంత్రములకు మాలిన్యమగును.

గ్రహణ సమయంలో శయనించినచో రోగము, మూత్రము విడచినచో దారిద్ర్యము, పురీషము విడచినచో క్రిమిజన్మము, మైధునము చేసినచో ఊరపంది జన్మము, అభ్యంగనము( తలంటి స్నానము ) చేసినచో కుష్టు రోగము, భోజనము చేసినచో నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము - గ్రహణానంతరము భుజింపరాదు. నిలువ ఉంచిన జలమునూ వర్జనీయము. కానీ మీగడ, మజ్జిగ, తైలపక్వము ( నువ్వుల నూనెతో వండినది ), క్షీరము  మొదలైనవి గ్రహణ పూర్వమందువి ఐనను గ్రహించ వచ్చును. కానీ వాటియందు దర్భ లు ఉంచ వలెను.

ఈ గ్రహణ సమయంలో చేసే గోదానము, భూదానము, సువర్ణ దానము మహా ఫలవంతములు.


గ్రహణ సమయంలో చేయుశ్రాద్ధము ఆమ ద్రవ్యము చేతగానీ, హిరణ్యము చేతగానీ చేయవచ్చును. సంపన్నులైన ఎడల వండిన అన్నము చేత కూడా చేయవచ్చును. తీర్థయాత్రల యందు ఏవధముగా శ్రాద్ధము చేయుదురో అదే విధముగా ఘృత ( నెయ్యి ) ప్రధానముగా చెయ్యవలయును. ఈసమయంలో భోక్తకు మహా దోషము.  

సర్వంశ్రీగురు చరణారవిందార్పణమస్తు

మార్గశిర పౌర్ణమినాడు చంద్ర గ్రహణము

సభాయైనమః

మార్గశిర పూర్ణిమ అనగా 10-12-2011 శనివారం నాడు సా. 06-16 ని.లు నుండి, రా. 09-48 ని.ల వరకు కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించును.

ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ప్రారంభమై 15 నిమిషాల తరువాత మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి కొనసాగును.

రోహిణీ నక్షత్రం వారికి స్వల్ప దోషము, మృగశిరవారికి అధిక దోషము కలదు. ఈ నక్షత్రముల వారు, వృషభ రాశి వారు దోష నివృత్తి కొరకు గ్రహణ సమయములో చంద్ర, కేతు గ్రహములకు జపములు చేసుకొనుట మంచిది.
మరునాడు ఉదయం  వెండితో చేయించిన చంద్ర బింబము, పాము పడగలను శివలింగము పై ఉంచి రుద్రాభిషేకము చేసుకుని

 నూతవస్త్రంలో ధాన్యముపోసి వానియందు చంద్రబింబము, పాముపడగ ఉంచి బ్రాహ్మణునకు దానము ఇవ్వాలి. నేతితో కూడిన కంచు పాత్రనుకూడా దానంగా ఇవ్వాలి.

దానం ఇచ్చే టప్పుడు : " మమ జన్మరాశి,  జన్మ నక్షత్ర స్థాన చంద్ర గ్రహణ సంభవ వశాత్, సూచిత ఆగామి సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశ స్థాన స్థిత శుభఫలిత ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే." అని సంకల్పం చెప్పుకోవాలి.

" తమోమయ మహభీమ సోమసూర్య విమర్థన
హేమతారా ప్రధానేన మమ శాంతి ప్రదోభవ"

" విదుంతుధ నమస్తుభ్యం సింహికానందనా2చ్యుత
దానేనా2నేన నాగస్య రక్షమాం వేదజాత్భయాత్" 


అనే శ్లోకాలు చదువుతూ దానం ఇవ్వాలి.



గ్రహణముల గురించి సవివరముగా ఇంకా రాయవలసి ఉంది. అది రేపు ప్రచురిస్తాను.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు
--
భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ







Thursday, October 20, 2011

గాయత్రీ హృదయమ్



 
నారద ఉవాచ:

భగవన్ దేవ దేవేశ భూత భవ్య జగత్ప్రభో |
కవచంతు శ్రుతం దివ్యం గాయత్రీ మంత్ర విగ్రహమ్ ||

అధునా శ్రోతు మిచ్ఛామి గాయత్రీ హృదయం పరమ్ |
యద్ధారణాద్భవేత్పుణ్యం గాయత్రీ జపతో2ఖిలం ||

నారాయణ ఉవాచ:

దేవ్యాశ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణేస్ఫుటమ్ |
తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్ ||

విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీ వేదమాతరమ్ |
ధ్యాత్వా తస్యాస్త్వథాంగేషు ధ్యాయే దేవతాశ్చదేవతాః ||

పిండ బ్రహ్మాండయో రైక్యా ద్భావయే త్స్వతనౌ తథా |
దేవీ రూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః ||

నా దేవో 2 భ్యర్చయే ద్దేవమితి వేద విదో విదుః |
తతో భేదాయ కాయేస్వే భావయే ద్దేవతా ఇమాః ||

అథ తత్సం ప్రవక్ష్యామి తన్మయత్వ మధో భవేత్|
గాయత్రీ హృదయస్యాస్యా ప్యహమేవ ఋషి స్మృతః ||

గాయత్రీ చ్ఛంద ఉద్దిష్టం దేవతా పరమేశ్వరీ |
పూర్వోక్తేన ప్రకారేణ కుర్యా దంగాని షట్క్రమాత్ ||

ఆసనే విజనే దేశే ధ్యాయే దేకాగ్ర మానసః |

అధార్థన్యాసః| ద్యౌర్మూర్ధ్ని దైవతమ్| దంతపంక్తావశ్వినౌ| ఉభే సంధ్యే చోష్ఠౌ| ముఖ మగ్నిః| జిహ్వా సరస్వతీ|గ్రీవాయాంతు బృహస్పతిః| స్తనయోర్వసవోష్టౌ| బాహ్వోర్మరుతః| హృదయే పర్జన్యః| ఆకాశ ముదరమ్| నాభా వంతరిక్షమ్| కట్యో రింద్రాగ్ని| జఘనే విఙ్ఞానఘనః ప్రజాపతిః| కైలాస మలయా ఊరూ|విశ్వేదేవా జాన్వోః| జంఘాయాం కౌశికః| గుహ్యమయనే| ఊరూ పితరః పాదౌ పృథివీ| వనస్పతయోంగులీషు| ఋషయో రోమాణి| నఖాని ముహూర్తాని| అస్థిషు గ్రహాః| అసృఙ్ఞ్మాంసం ఋతవః| సంవత్సరావై నిమిషమ్| అహోరాత్రావాదిత్యశ్చంద్రమాః| ప్రవరాం దివ్యాం గాయత్రీం శరణ మహం ప్రపద్యే||

ఓంతత్సవితుర్వరేణ్యాయనమః| ఓం తత్పూర్వజాయాయ నమః| తత్ప్రాతరాదిత్యాయ నమః| తత్ప్రాతరాదిత్య ప్రతిష్ఠాయై నమః ||  

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివస కృతం పాపం నాశయతి ||

సాయంప్రాతరధీయానో అపాపో భవతి | సర్వ తీర్థేషు స్నాతో భవతి | సర్వైర్దేవైర్ఙాతో భవతి | అవాచ్య వచనాత్పూతో భవతి | అభక్ష్య భక్షణాత్పూతో భవతి | అభోజ్య భోజనాత్పూతో భవతి | అచోష్య చోషణాత్పూతో భవతి | అసాధ్య సాధనాత్పూతో భవతి | దుష్ప్రతిగ్రహ శత సహస్రా త్పూతో భవతి |సర్వ ప్రతిగ్రహా త్పూతోభవతి | పంక్తి దూషణాత్పూతో భవతి | అనృత వచనాత్పూతో భవతి | అథా బ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతి | అనేన హృదయే నాధీతేన క్రతుసహస్రేణేష్టం భవతి | షష్టి శత సహస్ర గాయత్య్రా జప్యాని ఫలాని భవంతి | అష్టౌ బ్రాహ్మణాన్సమ్యగ్రాహయేత్ తస్య సిద్ధిర్భవతి |

య ఇదం నిత్య మధీయానో బ్రాహ్మణః ప్రాతశ్శుచిస్సర్వపాపైః ప్రముచ్యత ఇతి బ్రహ్మలోకే మహీయతే | ఇత్యాహ భగవాన్నారాయణః |



ఇతి దేవీభాగవతాంర్గత గాయత్రీ హృదయమ్ |

Saturday, October 1, 2011

గాయత్త్రీ కవచమ్


                                                              

నారదఉవాచ:

స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర

ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః

కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో

నారాయణ ఉవాచ :


అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే

సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా

తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్

చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతమ్

చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్

ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే

గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ

పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ

పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ

ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ

తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ

దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్

నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్

చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా 

ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా 

దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్

మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా

గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్

దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు 

ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్

ముచ్యతే సర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్ 

శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్ సంపూర్ణం 

ఈ కవచాన్ని స్వయంగా పారాయణ చేసి ఫలితాన్ని పొందాను. ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప ప్రారంభంలో హృదయమును, అంత్యమునందు కవచమును పారాయణ చేయు సాంప్రదాయము కలదు. హృదయమును త్వరలో అందించ గలను.

సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు


Monday, September 12, 2011

శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ


చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం


Wednesday, July 20, 2011

మంత్ర జప సాధన లో తలెత్తే కొన్ని సందేహాలు - సమాధానాలు


శర్మ గారికి నమస్కారములతో!


     ఒక్కొక్క సారి గాయత్రీ జపము లో కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేసుకోవడం కుదురుట లేదు. మనస్స్సు కుదురు గా ఉంచాలంటే ఏమి చేయాలి? ఈ ధ్యానములో, గాయత్రీ మాతను ఊహ చేసుకొని జపం చేయ వచ్చా? లేక ఇతర దేవత లేదా గురు స్వరూపములను ఊహ చేయవచ్చా? ఇది కూడా మనసు ఎక్కువ సేపు నిలబడదు. కొంత సేపు ఒక దేవత, తరువాత కొంత సేపు ఇంకొక దేవత లేదా గురు స్వరూపము  తో జపము చేయవచ్చా? అసలు గాయత్రీ మంత్రం ఎలా చేయాలి? 

  మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

                                      

"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "   పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది  మంత్రము అన్నారు.  గాయత్రీ లేదా మరో దేవతా  జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. వీటిగురించి మరో టపాలో తెలియజేస్తాను. ) ప్రస్థుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.

౧) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం.   ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం బ్రాహ్మణుడు వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు) ప్రాధమికం అనే దృష్టితో  ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు.  ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సంతలు  చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం  బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా  కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు  రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ  మెట్టుకి వెళ్లాలి. 

౨) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి .   ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.

౩) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం.  పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి. ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా  మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.

అ) మరో ఆలోచనలో పడడం
ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది. ( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి )  ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.

ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.


ఆ) మనసు తొందర పడడం :    నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు  లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం".  అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.

పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి  త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే
కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.

౪) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి.  కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది.  ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి. అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి.  వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు. వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.

మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.


పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.

౧) మొదట గురువు వద్ద  మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.

౨) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి.  క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.

౩) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత  స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.

ఇంకనూ అనేక విషయాలు ఉన్నవి. కానీ కొన్ని మాత్రమే తెలపగలం. కొన్ని ఎవరికి వారు సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. 



సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు!

Monday, May 30, 2011

రాముడు ఏమి తపస్సు చేశాడు?

      రాముడు తపోధనుడైన, శక్తిశాలి అయిన రావణుని సంహరించ గలిగాడు కదా! మరి ఆ రాముడు చేసిన తపస్సు ఏముంది? రావణాసురుడు ఘోర తపస్సు చేసి అనేక శక్తులను, వరములను పొందాడు. మరి రాముడు చేసినట్టు ఎక్కడా వాల్మీకి రామాయణంలో చెప్పలేదే. కానీ రామునికి అంత శక్తి ఎక్కడనుండి వచ్చింది?

     కేవలం ఓ మనిషిగా ధర్మ బద్ధమైన జీవనమును ఏవిధంగా జీవించవచ్చో చేసి చూపాడు. మనిషిగా పుట్టాడు. ఎటువంటి మాయలూ చేయలేదు. నాటి రాజ కుటుంబాలలోని బిడ్డలవలెనె ఎదిగాడు. కానీ మిగతా వారిలో లేని విలక్షణత " ధర్మాచరణం " .  ఈ పదం వినడానికి, అనడానికి చాలా సులువుగానే ఉంటుంది కానీ పాటించడానికి చాలా కష్టపడాలి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న చెక్కు చెదరని విశ్వాసముండాలి. ఇందులోని విచిత్రమేమిటంటే  ధర్మాన్ని ఆచరించడంలోని కష్టం పైనుండి చూసే వాడికే కనిపిస్తుంది. ఆచరించే వాడికి కష్టమంటే తెలియదు. అతను ఓ ఉత్తేజంతో నిండి ఉంటాడు. శోకం, భయం, అన్నవి అతని దరిదాపులలో కూడా ఉండవు. ఎందుకంటే తాను చేస్తున్నది ధర్మం అన్న నమ్మకం పరిపూర్ణంగా అతనికి ఉంటుంది కనుక.

తండ్రి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుని అనుసరించాడు. తన వినయంతో విశ్వామిత్రుని అనుగ్రహాన్ని పొంది ఎంతో తపస్సు చేస్తే కానీ సంపాదించ లేని అనేక "అస్త్ర శస్త్రాలను" కైవసం చేసుకున్నాడు. పితృవాక్య పరిపాలన, గురువుల యందు గౌరవం, ఏక పత్నీ వ్రతము, ఆశ్రిత జన రక్షణ తన ధర్మములు అని ఆచరించి చూపించాడు.  అటువంటి ధర్మాచరణం వలన రాముడు తపోధనుడయ్యాడు. రావణాది తపశ్శక్తి సంపన్నులైన రాక్షసులను కూడా సునాయాసంగా వధించగలిగాడు.


ఋతం తప స్సత్యం తప శ్శ్రుతం తప శ్శాన్తం తపో దమ స్తప శ్శమ స్తపో దానం తపో యఙ్ఞం తపో భూర్భువస్సువ బ్రహ్మైతదుపాస్యైతత్తపః  |అని ఉపనిషద్వాక్యం.


 ఋజు వర్తనము,  సత్య వాక్పరిపాలనము , వేదశాస్త్రముల అధ్యనము, శాంత స్వభావము, బాహ్యేంద్రియములను అదుపుచేయుట, అంతరింద్రియ నిగ్రహము, దాన ధర్మములను ఆచరించుట, యఙ్ఞములను నిర్వహించుట, బ్రహ్మమైన గాయత్రిని ఉపాసించడము మొదలగునవన్నియు తపశ్చర్యలే. దివ్యశక్తి ప్రదాయకములే. 



    దీనిని బట్టి మనం అరణ్యాలకు వెళ్లి దీర్ఘకాలం ఆహార పానీయములను వదిలి జీవించడమొక్కటే తపస్సు అని అనుకోనవసరం లేదు.  మనని తపింప చేయు ధర్మ బద్ధమైన ఏ కార్యమైననూ తపస్సే. అది ఒక విద్యలో రాణించాలని విద్యార్థులు చేసే ప్రయత్నం కావచ్చు, సత్యము మాత్రమే పలకుతూ జీవించడానికి చేసే యుద్ధం కావచ్చు లేదా మన ధర్మ బద్ధమైన వేద సమ్మతమైన జీవనమును నమ్మి దానిమార్గంలో నడవడానికి చేసే ప్రయత్నమైనా కావచ్చు. ధర్మమును తప్పని నిబద్ధత, మన ఊపిరిని ఉత్సాహముగా మార్చే పట్టుదల ఉన్న కార్యమేదైనా తపస్సే అని అనవచ్చు.

  కొందరు సిద్ధపురుషులు మాత్రమే జన్మతః వైరాగ్యమును, ఙ్ఞానమును కలిగి సంసారమున బడక నిత్య ధ్యాన నిమగ్నులై ఉంటారు. అది అందిరికీ ఆచరణ యోగ్యమైనది కాదు.  కనుక "ధర్మాన్ని నమ్మి ఆచరించడమే అన్నిటికన్నా ఉత్తమమైన తపస్సు".  ఇది గృహస్థులకు మాత్రమే సాధ్యం. సంసారానికి భయపడి, అన్నిటిని వదిలి అడవులకు పారిపోయి చేసేది తపస్సు కాదు. 



Sunday, May 29, 2011

ఈ పేద పిల్లల చదువుకు సహాయమందించండి

నమస్కారం
     నేను పురోహితుడినైనా అనవసర భేషజాలకు పోకుండా నేను నివసించే ప్రాంతంలోని గుడిసెలలోని వారితో అప్పుడప్పుడు మాటలు కలుపుతుంటాను. వారి పిల్లలో గల ఆత్మన్యూనతను పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి అవీ ఇవీ పెట్టి మాటలలో వారి వివరాలు తెలుసుకుంటూ ఉంటాను. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడ పాఠాలు ఎలా జరుగుతున్నాయో పిల్లల ద్వారా తెలుసుకుంటాను. వారికి ఆడుకోవడానికి కావలసిన వస్తువులు, చదువుకు కావలసిన నోటు పుస్తకాలు కొనిపెడుతుంటాను. వారికి అప్పుడప్పుడూ చిన్న చిన్న తరగతులు నిర్వహిస్తూ ఉంటాను.

అలా నాకు తెలిసిన ఒక అమ్మాయి పదవ తరగతి పాసయింది. కానీ తల్లికి పక్షవాతం రావడంతో ఇంటి పని వల్ల, పెద్దలు ప్రోత్సహించక పోవడం వల్ల, ధనము లేక ఇంటర్ కు వెళ్ల లేక పోతోంది. ఒక సంవత్సరం ఖాళీగా గడిపింది. చాలా రోజుల తరువాత మొన్న నాకు కలిసి విషయం చెప్పి నాకు చదువుకోవాలనుంది అని చెప్పింది.  "ఎవరైనా సహాయం చేస్తే నువ్వు చదువుకుంటావా?" అని అడిగితే తప్పకుండా చదువుతాను అని చెప్పింది.

తల్లి తండ్రులు కూలి పని చేసుకునే వారు. వాళ్ల ఇళ్లలో పదవతరగతి పూర్తిచేసినది ఈ అమ్మాయి మాత్రమే. ఇంటర్ చదవాలను కుంటోంది. సంవత్సరానికి ఎనిమిది నుండి తొమ్మిది వేలు అవుతాయి. రెండుసంవత్సరాలు సహాయం కావాలి. ఇది ఒక్కరే అందించినా ఫర్వాలేదు. నలుగురైదుగురు కలిసైనా ఫర్వాలేదు. ఏదో విధంగా ఆ అమ్మాయిని చదివించగలిగితే తప్పక ఆ అమ్మాయి వృద్ధిలోకి వస్తుంది. 

అలాగే మరో అమ్మాయి ఉంది. ఆమెకు పన్నెండు సంవత్సరాలు ఉంటాయేమో. ఇళ్లలో పాచి పనికి వెళుతుంది. కానీ ఆ అమ్మాయి పనిచేస్తూ పాటలు పాడుతుంది. ఉన్నది ఉన్నట్టు గా అద్భుతంగా పాడుతుంది. ఈశ్వర ప్రసాదం వలన ఆ అమ్మాయికి చక్కటి స్వరం ఉంది. ఎవరైనా సహాయపడి సంగీతం నేర్ప గలిగితే ఆ సినిమా పాటలకు బదులు చక్కటి కీర్తనలు పాడుకుంటూ తరిస్తుంది. దయచేసి ఎవరైనా సహాయం అందించండి.

ఆసక్తి కలిగిన వారెవరైనా ఉంటే నాకు మెయిల్ చెయ్యగలరు.


rajasekharuni.vijay@gmail.com


Cell no : 9000532563

నేను చెయ్యగలిగినది మధ్యవర్తిత్వం ఒక్కటే. నాదగ్గర ధనములేదు. కానీ అవసరం ఎక్కడ ఉందో నేను సూచించ గలను. ఎవరైనా స్పందించి సహాయపడితే ఆపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అన్నదే నాతపన. అందుకే ఈ చిన్ని ప్రయత్నం.  ఈశ్వరానుగ్రహం కలిగి ధన సమృద్ధులైన వారు ముందుకు వచ్చి సహాయం అందించండి. ఒక వేళ మీరు సహాయం చేయలేక పోయినా, దానికి సమర్థులైన మీ స్నేహితులకు ఈ టపా చిరునామా ( post link ) ని మెయిల్ చెయ్యండి. మీరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదించిన వారవుతారు.

ధన్యవాదములు

Sunday, May 15, 2011

సంధ్యావందనం తరగతులు నిర్వహించ బడుతున్నాయి

నమస్కారం

వైశాఖ బహుళ విదియ  అనగా May 19 వతేదీ నుండి సంధ్యావందనము నేర్ప బడుతున్నది. ఉపనయనము ఐనవారు పాల్గొన వచ్చును.

ముద్రలతో , సుస్వరము గా నేర్చుకొన దలచిన వారికి, భాగ్యనగర వాసులకు ఇది మంచి అవకాశము. సద్వినియోగ పరుచుకొనగలరు.


సంధ్యా హీనో2శుచిర్నిత్యం అనర్హస్సర్వ కర్మసు
యదన్యత్ కురుతే కర్మ తత్సర్వం నిష్ఫలం భవేత్

సంధ్యాహీనుడైన వాడు నిత్యము అశుచి అవుతున్నాడు. అతడు కర్మలు చేయుటకు అనర్హుడు. ఒకవేళ ఏదైనా కర్మ చేసినా అది నిష్ఫలమే అవుతుంది.  

రోజూ స్నానం చేయుటచేత దేహము ఎలా శుభ్ర పడుతున్నదో, అదేవిధముగా మనము రోజూ చేసే సంధ్యావందనము మన మనస్సును శుభ్ర పరుస్తున్నది. రోజు ప్రారంభమున స్నానము చేయుట ఎంత ప్రధానమో, ఏ కర్మ చేయుటకైనా ముందు సంధ్యావందనము చేయుట ద్వారా మనసును స్థిర పరుచుకొనుటకూడ అంతే అవసరమని తెలుస్తున్నది.

కనుక బ్రాహ్మణులైన ప్రతీ ఒక్కరు సంధ్యావందనమును తమ కనీస కర్తవ్యముగా గుర్తించి, ప్ర్తీతితో నిర్వహించాలి.

మనము చేయడమే కాక మన చుట్టూ ఉన్న నలుగురికి నేర్పి ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశముతోనే  కొన్నిటినైనా ( సంధ్యావందనం, మంత్ర పుష్పం, నమక చమకములు వంటివి ) సుస్వరంగా నేర్పాలని ఈ ప్రయత్నము చేస్తున్నాను.   

అమ్మ అనుగ్రహముతో ఎంత ఎక్కువమంది నేర్చుకోగలిగితే అంత సంతోషము.

పాల్గొన దలచిన వారు నాకు మెయిల్ చేసి లేదా నాకు ఫోన్ చేసి ( సాయంత్ర పూట మాత్రమే )  సంప్రదించ గలరు.


rajasekharuni.vijay@gmail.com

cell no : 9000532563

ధన్యవాదములు
--

ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ

http://rajasekharunivijay.blogspot.com/  

దేవాలయాలు - నిర్వహణ - కొన్ని విశేషాలు

      పూర్వం రాజులు ఆయా ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడ తమకు ఎదురైన దేవతా మూర్తుల అద్భుత శక్తులకు ముగ్ధులై దేవాలయములను నిర్మించే వారు. అలాగే దేశమున కరువు కాటకములు, మానసిక పైత్యములు ప్రబలినపుడు  పండితుల సూచన మేరకు కొందరు  రాజులు దేవాలయములను నిర్మించే వారు.  ఇది ఉత్తమమైన పద్దతి.

   కొందరు పేరు ప్రతిష్ఠలు లేదా అధికారము చిరకాలము నిలుపుకొనుటకు నిర్మించేడివారు. నేడు కూడా పేరు కోసమో, పరపతి తెలుపుకొనుటకో/ పెంచుకొనుటకో, మరికొంచెం నీచ స్థాయికి దిగి దేవాలయాల పేరుతో ధనమును చేకూర్చుకొనుటకో దేవాలయములు నిర్మిస్తున్నారు.

                                               

ఇవేవీ కాక మరో కారణం వలన కూడా దేవాలయములను నేడు నిర్మించు వారు కనిపిస్తున్నారు.

   మనలో చాలా మందికి ఎంతోకొంత సమాజ సేవ చేయాలన్న సంకల్పం ఉంటుంది. కొందరికి అది సంకల్పంగానే ఉంటుంది. కొందరి విషయంలో అది కార్య రూపం దాలుస్తుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడం, అనాథలకు - వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, అన్నార్తులకు అన్నదానం చేయడం, ఉచిత వైద్య సేవలు అందజేయడం ఇలా అనేక  రూపాలలో తమ సేవను సమాజానికి పంచుతుంటారు. వీటన్నిటికంటే ఉత్తమమైన సేవ ఏమిటి అని అందులో కొందరు కొంచం ముందడుగు వేసి ఆలోచిస్తారు. మన జీవిత గమ్యం సర్వవ్యాపి అయిన ఆపరమేశ్వరునిలో లీనమవడమే అని నమ్మిన కొందరు సాధ్యమైనంత ఎక్కువ మందికి అటువంటి పురోగతిని సాధించుటలో సహాయపడడమే నిజమైన సేవ అని తెలుసుకుంటారు. కొందరికి ఆకలి బాధ ఉండవచ్చు. కొందరికి ఆరోగ్య బాధ ఉండ వచ్చు. కాని నేటి రోజులలో ఎందరికో మానసిక బాధలు. అన్నీ ఉన్న వానికీ, ఏమీలేనివానికీ కూడా ఈ మనోవ్యధలు తప్పడం లేదు. ఈ మానసిక అస్థిరతను సరిచేయుటకు వేద సాంప్రదాయమున అనేక ఉపాయములు ఉన్నవి. అందు ‘భక్తి మార్గము’ ఒకటి. అటువంటి భక్తి మార్గమును అవలంబిచుట వలన ఇహమున కల అనేక సమస్యలను సరిదిద్దుకొన గలుగుటయే కాక, ఏదైతే జీవన పరమ గమ్యమని ఆధ్యాత్మికులు నమ్ముదురో ఆ గమ్యమును చేరుటకూడా సులభతరమౌను. కనుక ఈ విషయముల యందు అత్యంత నమ్మిక ఉన్న కొందరు ఒక దేవాలయమును  నిర్మించెదరు. సద్గురువులైన పండితులను అర్చకులుగా నియమించి, వారి ఆదేశానుసారం నడుస్తూ తాము తరించడమే కాక అనేక మందికి ఒక ఆధారామును ఇచ్చి తరింపచేసిన వారవుతున్నారు.   వీరు ఉత్తమమైన ధర్మకర్తలు అని చెప్పవచ్చు.


    ఒక విగ్రహము పెట్టి, అందంగా  నాలుగు గోడలు నిర్మించినంత మాత్రమున అది దేవాలయము అయిపోదు. ఒక వేళ అలా పిలువబడినా  అది ప్రాణం లేని దేహముతో సమానము. సర్వఙ్ఞుడైన ఆచార్యుడు( అర్చకుడు), అతని ఆదేశానుసారము నడుచుకొను ధర్మకర్త , ఆచార్యుని ఉపాసనచే కలుగు మంత్ర శక్తి, ధర్మనిష్ఠ, నియమ పాలన  అనునవి ఐదు పంచప్రాణముల వంటివి. నిర్మాణము కేవలము దేహము మాత్రమే.  దేవాలయము అనునది ఒక అద్భుత శక్తి కేంద్రము. దేవాలయము నుండి ఆశక్తి తరంగములు అక్కడి ఉపాసనా శక్తిని బట్టి దేశ దేశాంతరములు ప్రసరిస్తాయి. కేవలము మనము మాత్రమే పూజలు జరిపితే అక్కడ కొంత శక్తిమాత్రమే కేద్రీకృతమౌతుంది. అనేక మంది, అనేక పర్యాయములు నిరంతరాయంగా జరుపుతూ ఉంటే అక్కడ అఖండ శక్తి ప్రసారం జరుగుతుంది. ఆ అవకాశం దేవాలయములలో మాత్రమే ఉంది. తత్కారణం గా ఎన్నో అలజడులతో దేవాలయమునకు వచ్చిన వారికి కూడా దేవాలయములో అడుగు పెట్టగానే ఒక చక్కటి ప్రశాంతత కలగడం, అసలు పరిష్కారమే లెదు అనుకున్న సమస్యలకు కూడా భగవంతుని సన్నిధిలో ఒక పరిష్కారం లభించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ పేద, ధనిక భేదంలేదు. ఎవరు ఎలా వచ్చినా ఆర్తితో ప్రార్థన చేసినంత మాత్రముననే ఒక సద్భావన మనసును ఆక్రమిస్తుంది. అటువంటి ఉత్తమ ఫలితాలు కలగాలంటే ధర్మకర్తలు, అర్చకులు ఉత్తములై ఉండాలి. మొదట వీరిద్దరు భక్తులైన నాడు మిగిలిన వారికి మార్గము చూపగలరు. కేవలము చూపులకు భక్తి నడవడిక కలిగిన ధర్మకర్తలు, అర్చకులు దేవాలయమును  ఉత్తమముగా తీర్చిదిద్దలేరు. ఒకరికొకరు పరస్పర సహకారము వలన మాత్రమే శక్తి కేంద్రమైన దేవాలయము తయారవగలదు. 


సేవలన్నిటిలోకీ ఉత్తమమైన సేవ ఈ దేవాలయ నిర్వహణ. దీని ద్వారా ఎందరో ఆర్తులకు పరమేశ్వరుని అనుగ్రహము కల్పించ వచ్చు.  భక్తి తత్పరులైన ధర్మకర్తలు  పరమ భక్తులైన, ఉపాసకులైన అర్చకులను నియమించి వారి సలహా ప్రకారము దేవాలయమును నిర్వహించవలెను. అప్పుడు అది ఆనంద నిలయము అవుతుంది. లేనిచో కేవలము పేరుకు మాత్రమే దేవాలయముగా నిలచి చేతలకు అది ఒక వ్యాపార కేంద్రము అవుతుంది.

"దేవాలయాలు" అనే లేబుల్ తో ఉన్న మరిన్ని టపాలను ఇక్కడ చూడండి.  

Tuesday, March 22, 2011

పురాణాలు - ఉప పురాణాలు

శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వ చతుష్టయమ్‌ |
అ - నా - ప - లిం - గ - కూ - స్కాని పురాణాని పృథక్‌ పృథక్‌ ||

1. మత్స్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('మ' ద్వయం)
2. మార్కండేయ పురాణం - శ్లోకాల సంఖ్య : 9,000
3. భవిష్య పురాణం - శ్లోకాల సంఖ్య : 14,000 ('భ' ద్వయం)
4. భాగవత పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
5. బ్రహ్మ పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000 ('బ్ర' త్రయం)
6. బ్రహ్మాండ పురాణం - శ్లోకాల సంఖ్య : 12,000
7. బ్రహ్మ వైవర్త పురాణం - శ్లోకాల సంఖ్య : 18,000
8. వామన పురాణం - శ్లోకాల సంఖ్య : 10,000
9. వాయు పురాణం - శ్లోకాల సంఖ్య : 24,600
10. విష్ణుపురాణం - శ్లోకాల సంఖ్య : 23,000 ('వ'చతుష్టయం)
11. వరాహ పురాణం - శ్లోకాల సంఖ్య : 24,000
12. అగ్ని పురాణం - శ్లోక సంఖ్య : 16,000 - అ
13. నారద పురణం - శ్లోక సంఖ్య : 25,000 - నా
14 పద్మ పురణం - శ్లోక సంఖ్య : 55,000 - ప
15. లింగ పురాణం - శ్లోక సంఖ్య : 11,000 - లిం
16. గరుడ పురాణం - శ్లోక సంఖ్య : 19,000 - గ
17. కూర్మపురాణం - శ్లోక సంఖ్య : 17,000 - కూ
18. స్కాంద పురాణం - శ్లోక సంఖ్య : 81,000 - స్కా 

ఇవికాక - 18 ఉప పురాణాలున్నాయి. అవి :

1. సనత్కుమార పురాణం, 2. సాంబ పురాణం, 3. సౌర పురాణం, 4. నారసింహ పురాణం, 5. నారదీయ పురాణం, 6. వారుణ పురాణం, 7. వాసిష్ఠ పురాణం, 8. కాపిల పురాణం, 9. కాళికా పురాణం, 10. దౌర్వాస పురాణం, 11. ఔశసన పురాణం, 12. ఆదిత్య పురాణం, 13. మాహేశ్వర పురాణం, 14. శివపురాణం, 15. భాగవత పురాణం, 16. పారశర పురాణం, 17. నంది పురాణం, 18. మానవ పురాణం.
 


భక్తి సుధ వారి సైట్ నుండి....

Saturday, March 19, 2011

యుగాదులు - మన్వాదులు

యుగాదులు :
కార్తీక శుద్ధ ద్వాదశి - కృత యుగాది
వైశాఖ శుద్ధ తదియ - త్రేతా యుగాది
మాఘ బహుళ అమావాస్యా - ద్వాపర యుగాది
భాద్రపద బహుళ త్రయోదశీ - కలి యుగాది

 మన్వాదులు :

చైత్ర శుద్ధ తదియ - ఉత్తమ మన్వాది
చైత్ర పౌర్ణమి - రౌచ్యక మన్వాది
జ్యేష్ఠ పౌర్ణమి - భౌచ్యక మన్వాది
ఆషాఢ శుద్ధ దశమి - చాక్షుష మన్వాది
ఆషాఢ బహుళ అష్టమీ - రుద్రసావర్ణిక మన్వాది
శ్రావణ బహుళ అమావాస్య - అగ్ని సావర్ణిక మన్వాది
భాద్రపద శుద్ధ తదియ - తామస మన్వాది
భాద్రపద బహుళ అష్టమీ - సూర్య సావర్ణిక మన్వాది
ఆశ్వయుజ శుద్ధ నవమీ - స్వారోచిష మన్వాది
కార్తీక శుద్ధ ద్వాదశీ - స్వాయంభువ మన్వాది
కార్తీక పౌర్ణమీ - ఇంద్ర సావర్ణిక మన్వాది
పౌష్య శుద్ధ ఏకాదశీ - రైవత మన్వాది
మాఘ శుద్ధ సప్తమీ - వైవస్వత మన్వాది
ఫాల్గుణ పౌర్ణమీ - బ్రహ్మ సావర్ణిక మన్వాది

    ఈ మన్వాదులందు కూడా శ్రాద్ధామును ఆచరించ వలెను. పిండములు లేకుండా- హిరణ్య విధానముగా చేయవచ్చు. ఈ మన్వాదులలో పితృదేవతలకు శ్రాద్ధమును ఆచరించడం వలన రెండువేల సంవత్సరాల కాలం వారు తృప్తి నొందుదురు. శ్రాద్ధమునకు ముందుగానే తిల తర్పణ చేయవలెను.

Wednesday, March 16, 2011

ఆబ్దికాదులను ఆచరిస్తున్నారా? అయితే "ఆబ్దిక శ్రాద్ధవిధి" ని తెలుసుకొనండి.

     నేటి మన జీవనం పరిగెత్తుటకే సరిపోతున్నది. సౌకర్యాలు అనేకం వచ్చాయి. కాలు కదపనవసరం లేకుండా కావలసిన పనులన్నీ చేసుకోగలిగిన ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు నిత్యం పరుగే. ఒక్క క్షణం తీరిక ఉండని జీవితం. ఎందుకోసమో ఆరాటం. దేనికోసమో పోరాటం.  ఈ నవ నాగరిక జీవితం మనకు సుఖాన్నిస్తోందా!?  ఏమో ఈ పరుగులలో పొందే సుఖం కూడా ఒక అనుభూతినివ్వలేక పోతోంది.   ఆశ్చర్యకరమైన, అర్థం కాని విషయమేమిటంటే ఎంతగా సౌకర్యాలు పెరుగుతున్నాయో- అంతగా మన జీవితంలో పరుగు పెరిగిపోతున్నది. ఏ సౌకర్యాలు లేని రోజులలో ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణం కూడా కష్టమైన రోజులలో మన పూర్వుల జీవనం ఎంతో సాఫీగా, ఎటువంటి తొందరా లేకుండా సవ్యంగా సాగిపోయింది. మనకు నేడు ప్రపంచీకరణ పుణ్యమా అని అమెరికాలో ఉన్న సౌకార్యాలు అనకాపల్లిలోనూ లభ్యమౌతున్నాయి( ధనముంటే ). కానీ మన పూర్వీకులకు ఉన్న ప్రశాంత జీవనం మనకులేదు. ఆప్రశాంతత బయట నుండి వచ్చేది కాదు, అది ఆంతరంగికమైనది. ఎన్ని ఆధునిక సౌలభ్యాలున్నా ఇంకా ఏదో కావాలని తాపత్రయం. అందుకే అశాంతి. ఈ తాపత్రయంలో మన సాంప్రదాయాలను వదిలేస్తున్నాం. మన దేశాన్ని వదిలేస్తున్నాం. మనల్ని మనమే వెలివేస్తున్నాం. అందులో భాగంగా పూజాదికాలను మానివేస్తున్నారు. ఇక ఆబ్దీకాదులను ఎందరు నిర్వహిస్తున్నారు? వాటి ప్రాముఖ్యత ఎంతమంది గుర్తిస్తున్నారు?
   పూర్వం మన వారు ఆబ్దీకానికి అత్యంత శ్రద్ధవహించేవారు. మామూలుగా రోజూ చేసే పూజలో పాటించే మడికంటే ఇంకా కఠినతరమైన మడిని ( శుభ్రతను )  పాఠించేవారు. నేటికీ అది అమలులో ఉంది. అయితే ఈ ఆచారవ్యవహారాలలో నేటి తరానికి అవగాహన అంతగా లేక, చెప్పే వారులేక ఈ ఆబ్దిక విధిలో శ్రద్ధ కరువవుతున్నది. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అన్నారు. బ్రాహ్మణులలో అయితే భోక్తలను ( బ్రాహ్మణులను ) పిలిచి భోజనం పెట్టడం ఆచారంగా ఉంది. బ్రాహ్మణులు అన్న( అన్నముతో చేసే )శ్రాద్ధమును, మిగతావారు ఆమ ( బియ్యము,పచ్చి కూరలు మొదలైన వానితో ) శ్రాద్ధమును ఆచరించాలి. పూర్వము మేషము ( మేక ) ను, మధువు ( మద్యము) ను పితృదేవతా ప్రీతికొఱకు బ్రాహ్మణులకు సమర్పించేవారు. ఇప్పుడు మేషము బదులుగా మాషములతో( మినుముతో ) చేసిన  గారెలు , మద్యమునకు బదులుగా తేనెను బ్రాహ్మణునికి సమర్పించాలి. కలియుగములో మధుమాంసములు బ్రాహ్మణులు స్వీకరించడం నిషిద్ధం.


   రోజూ పూజచేస్తే పుణ్య బలంతో సుఖములను పొందుతారు. చేయకపోతే పూర్వపాపఫలితాన్ని ఈజన్మలో ఎదుర్కొనలేక అనేక ఇబ్బందులు పడుతారు. అంతే కానీ ప్రత్యేక పాపం రాదు. అయితే ఆబ్దికాదులను నిర్వహించకపోతే పితృదేవతల శాపాన్ని పొందవలసి ఉంటుంది. ఆబ్దికాన్ని నిర్వహించడం ప్రతి గృహస్థుని విధి. మనకి సంవత్సరకాలం, పితృదేవతలకి ఒక రోజు అవుతుంది. వారు రోజూ ఆకలితో పీడింపబడుతూ ఉంటారు.  ప్రతీ సంవత్సరం పితృతిథినాడు ఆబ్దీకమును నిర్వహించి పలు  ( గోవులు, బ్రాహ్మణులు, పక్షులు, అగ్ని హోత్రము, జల చరముల ) రూపాలలో కల వారికి పితృదేవతల నుద్దేశించి భోజనమును సమర్పిస్తాము. అలా ప్రతీసంవత్సరం ఆబ్దీకమును నిర్వహించడం వారికి రోజూ భోజనమును పెట్టడం వంటిది. ఆసమయములో చేసే దాన,ధర్మములు ఊర్ద్వలోకాలలోని పితృదేవతలకు అనంతములై అందుతాయి అని శాస్త్ర వచనం. ఆవిధంగా తృప్తులైన పితృదేవతలు వంశాభివృద్ధి జరగాలని, అక్షయముగా నున్న సిరిసంపదలతో వంశములోని వారు సుఖించాలని దీవిస్తారు. సాధారణముగా పితృశాపం తగిలిన వారికి సంతానముండదు. సంతానం లేకపోవడానికి కల ప్రధాన కారణాలలో ఇది ఒకటి.  ఆర్తితో వారిని ప్రార్థించి, ఈ ప్రత్యాబ్దికాదులను శ్రద్ధతోనిర్వహించడమే దానికి నివారణోపాయం .

 
   చనిపోయిన రోజు ఏ తిథి ఉందో ఆ తిథినే ఆబ్దీకమును ఆచరించాలి. ( పుట్టిన రోజునుకూడా తిథుల ప్రకారం జరుపుకోవాలి ) పెద్దలు చనిపోయిన మొదటి సంవత్సరములో ( ప్రతీ నెలా ఆ తిథినాడు వచ్చే ) పన్నెండు మాసికములను వదలకుండా నిర్వహించాలి. కొందరు తెలియక ఈ నెలలలో కొన్ని వదులుతున్నారు. అది మా ఆచారం అని చెప్తున్నారు. అది సరైన పద్ధతికాదు. తప్పక ఆచరించాలి. మనకు కుదరకపోతే మాకు ఆచారం లేదు అని చెప్పుకోవడం నేడు కనిపిస్తోంది. ఇది కలిప్రభావం తప్ప మరొకటి కాదు.

  పూజాదికాలు కాస్త ఎక్కువగా చేస్తేనే వ్యంగ్యంగా మాట్లాడే జనం మధ్యలో జీవనం సాగిస్తూ - ప్రత్యాబ్దీకమును, పుష్కర శ్రాద్ధాదులను తెలిసో తెలియకో, నమ్మకం ఉండో లేకో నేటికీ  ఇంకా ఆచరిస్తున్న వారున్నారు. అటువంటి వారికి ప్రయోజన కరంగా ఉంటుందని నాదగ్గర కల కీ.శే.లు చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రిగారిచే రచింపబడిన "ఆబ్దికశ్రాద్ధవిధి" అనే పుస్తకమును PDF గా పొందుపరుస్తున్నాను. అది ఆస్తికులకు మరింత ఆసక్తిని, సంగ్ధిగ్ధంలో ఉన్నవారికి కొంత అవగాహనను కలిగిస్తుందని ఆశిస్తున్నాను.  ఇది చాలా వరకు బ్రాహ్మణులు శ్రాద్ధము ఆచరించడానికి గల నియముములను వివరించినను, కొన్ని అందరికీ ఉపయోగపడు నియమములును కలవు. ఎవరికి సంబంధించినవి వారు తెలుసుకొనగలరు.

పుస్తకం కొరకు ఈ క్రింది లింక్ లో చూడండి. 

https://docs.google.com/viewer?a=v&pid=explorer&chrome=true&srcid=0B0Zi3RYt07USMzdmNzc1YWYtYWRlZS00Y2QxLWFmOTgtNWM3MmIwN2I4Y2M2&hl=en

Saturday, February 19, 2011

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

    రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబలను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆమెలా( - ) ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతని అగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా? పతి వ్రత అయిన సీత తన తపో శక్తి తో రావణుని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా?..............  ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్ని అవసరమైనవి,  కొన్ని అనవసరమైనవి, తలా తోక లేనివి.  

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు? ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంధం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

అంత ఆదరణ కలగడానికి రామాయణంలో ఏముంది? రామాయణం లో ఏముంది? అనికాదు, ఏది లేదు? అని ప్రశ్నించుకోవాలి మనం. రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గ దర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి.


తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః | |

సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్తులకు చలించని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్నిటినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడి తప్పనివాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు? 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |

సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్రా కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమును కూర్చువాడు ఎవరు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |

థైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?

ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసుకోవాలని నాకు కుతూహలముగా ఉన్నది.

అందుకు నారదుడు  పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన  శ్రీరాముని తెలుపుతాడు.
ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు......... ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని  తెలిపి అతని దివ్య కధను వాల్మీకి కి వివరిస్తాడు. 

పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములే అనుకుందాము. రామాయణము కేవలము ఒక ( చరిత్ర అని గాక ) కథ  అనుకుందాము. ఈ గుణములన్నీ కథా ప్రారంభముననే ప్రస్థావించ బడ్డాయి అంటే ఇంతటి గుణములు కల నాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!

అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించ బడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామి భక్తి పరాయణుడైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బధం( రామ సుగ్రీవులు) ఉంది.  పిత్రు వాక్య పరిపాలకుడుగా, శిష్యుడిగా, సోదరుడిగా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్యగుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రామణుని వంటి వారికి కలిగే గతీ వివరించ బడింది.ఇది ఒక చరిత్ర కాక కేవలం ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలనలో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామి భక్తిలో హనుమంతుడు,  అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింప బడినది. రామాయణంలో ఈ పైపాత్రలన్నీ ఆయా గుణములలో అత్యున్నతమైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయాగుణములలో అంత కంటే  ఉదాత్త పాత్రలను సృష్టించ లేక పోయారు.అటువంటి పాత్రలను పరిచయం చేసిన వాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణములు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్న ఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది.   మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశమైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో! అందుకే మన భారతీయలుకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయమైన ఈ రచనలో, అందులోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.


రామాయణమును గురించి సరైన అవగాహన లేక : మనకు అనేక రామాయణములు వచ్చినవి. వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పుదోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణ ములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైన అవగాహన ప్రజలకు లేదు.  పైగా పాఠ్య పుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణమును ఎక్కడా పరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు. అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవుతున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.

గుర్తింపు కోసం:  అవును గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచు వారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టామనుకోండి వాడికీ వీడికీ ఏదోగొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్య మంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు, వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు.(ఇటువంటి ధృక్పధంతోనే తల్లి సీతమ్మను నిందిస్తూ రాసిన చెత్త రాతలను ఈ మధ్యనే ఒక బ్లాగులో మనం గమనించాము.) టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదరగొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపు మనకి లభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒక వార్త అవుతుంది. కొన్ని రోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు. కొన్ని రోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు. పైగా మనం అనవసరంగా ఆ రాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్ నో తిట్టామని తెలిసినా, మన ఐడెంటిటీ క్రైసిస్ బయట పడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.

మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన :  మత వ్యతిరేకత తోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈ  విమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణం గా ఇటువంటి వారు ఇందులోని మంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే  చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా విరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు, తమదే సరిఅయిన మార్గ మన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అని పించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమైన మార్గంలో ఉన్నామన్నది వీరి ఆలోచన. తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.

ఋషుల భావం గ్రహించలేక : మన పురాణములన్నీ ఋషుల చే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు.  ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసి ధనవంతుడైపోతాడు, అలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింప బడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు. సరిగ్గా ఇటువంటి సందర్భాలు విమర్శచేయడానికి  అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగా నే ధనవంతుడైపోతాడా? లేదా పూజ చేయగానే పాపాలన్నీ తొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీ ఎలా సాధ్యం? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ ఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? నన్ను తప్పుగా అనుకోకండి. నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చి క్రుంగి, కృశించి  పోతాం. అంటే తిండి మనకు శక్తి ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మే సిద్ధాంతం. కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమేమైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆపరిశోధనలను పుస్తకాలలో చదువుకున్నాము కనుక దానిని అందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే. మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడం తెలుస్తోంది - శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయ గలుగుతున్నాం కనుక ) మధ్యలో జరిగే గ్లూకోజ్ గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికి కనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల  కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీ కొందరు చింతన ద్వారా గ్రహించి(పరిశోధించి) వాటి సారాన్ని మనకు అనేక కథలు గా రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థంకాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.

ఇలా అనేక కారణములతో రామాయణాది పురాణేతిహాసములు విమర్శలకు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికిమార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

౧. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణాలను ( మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.
౨.  ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చ బడినవి ఏమిటో తెలుస్తుంది.
౩. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమనుకుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండా ఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజమేమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచక పోతే సరిఅయిన అవగాహనలేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

౪. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయ సాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించ పరచడమే. కనుక చట్ట పరమైన, న్యాయ పరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి.  అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురినీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నే మనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.

"ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం?" త్వరలో....

Tuesday, February 8, 2011

ధర్మ యుద్ధం మెదలు పెట్టండి

  భరతమాత బిడ్డలందరూ కోపంతో రగిలి పోయే శీర్షిక. అదీ తల్లి సీతమ్మని కించ పరుస్తూ. ఇది చూసి ఊరుకుంటూ కూర్చుంటే ఆ తల్లి బిడ్డలుగా మనం తలదించుకున్నట్టే. ఇలా ఎంతకాలం. నేను పుట్టిన భూమిలో నా తల్లిపైనే నిందలా? ఏమిటీ వైపరీత్యం. నిన్న బ్రాహ్మణ్యమే లేదన్నారు. అటుమొన్న పూజలెందుకు? అని ప్రశ్నించారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమని మిన్నకున్నాము. కానీ నేడు మనందరికీ తల్లి అయిన సీతమ్మను...

ఇలా చూస్తూ కూర్చుంటే మాతల్లినీ మీతల్లినీ తిట్టినా పట్టని మనుషులమౌతాము.  ధర్మ యుద్ధం ఇకనైనా మొదలుపెట్టాలి. లేకుంటే ఈ బ్లాగులలో మరీ విపరీత ధోరణులు పెరిగిపొతున్నాయి. మన సహనం చేతకానితనం కాకూడదు. రాజు చేసే పని రాజు చేయాలి. అందరూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తే ఇలానే ఉంటుంది.

వెంటనే ఆబ్లాగు యజమానులు ఆశీర్షిక తొలగించి, తమ చర్యకు క్షమాపణ తెలియజేయాలి. న్యాయపరంగా మనమేమీ స్పందిచలేమా? ఇటువంటి వాటికి తగిన సమాధానం చేప్పలేమా?

Saturday, January 22, 2011

కళ్లముందే జరుగుతున్నా గుర్తించలేని గుడ్ది వాళ్లమై పోతున్నాము

నేడు మనం చాలా విషయాల్ని కొట్టి పడేస్తున్నాము. కానీ మన పూర్వులు ఎంత శ్రమించి మనకు ఈ సాంప్రదాయాల్ని, శాస్త్రాల్ని ప్రసాదించారో తెలుసుకోలేకున్నాము.

జనవరి - 11 వ తేదీ మాకు తెలిసిన ఒకరింట్లో ఒక పెద్ద వయసు స్త్రీ చనిపోయారు. ఆరోజు మంగళవారం, ఉత్తరాభాద్రా నక్షత్రం. మంగళ వారం చనిపోవడం, అందునా ధనిష్ఠా పంచకములలో చనిపోవడం చాలా కీడు. మళ్లీ వాళ్లింట్లో మరో వ్యక్తి చనిపోతారని పెద్దలు చెప్తారు. కనుక దహన సంస్కారమప్పుడు కొన్ని శాంతి క్రియలు చేయాలి. మరి వారు అవి చేశారో లేదో తెలియదు.

మళ్లీ నిన్న అంటే  పెద్దావిడ చనిపోయిన పదకొండవరోజు శుక్రవారము మరొకరు వారికి చలా దగ్గరి బంధువులు చనిపోయారు.

ఇలాంటి వెన్నో చూస్తూ కూడా మనం నమ్మలేకుండా ఉన్నాము. మన శాస్త్రాల ,  సాంప్రదాయ విలువల్ని గుర్తించ లేకున్నాము.

ధనిష్ఠ పంచకములు : ధనిష్ఠ, శతభిషం, పూర్వా భాద్ర, ఉత్తరా భాద్ర, రేవతి ఈ ఐదింటి యందు ఎవరైనా చనిపోతే ఆ ఇంటిని ఆరునెలలు వాడరాదని శాస్త్ర వచనం.

Thursday, January 20, 2011

ఓ పురోహితుని పరిచయం - నాకు వచ్చిన ఈ లేఖ

 నేను మొన్న రాసిన "మీరూ పురోహితులుగా మారండి" అనే వ్యాసానికి స్పందనగా నాకు ఒక మెయిల్ వచ్చింది. నేనాశించిన పురోహితం అటువంటిదే అని చెప్పడానికి బ్లాగు మిత్రులతో అది పంచుకుంటున్నాను.


రాజశేఖరుని విజయ్ శర్మ గారు
నమస్కారములు.

మీరు రాసిన "మీరూ పురోహితులుగా మారండి" అనే వ్యాసం చదివాను. చాలా చక్కగా రాసారు. మీ వ్యాసం చదివాక మేము కూడా ఇదే మార్గంలో 40 సంవత్సరాలుగా జీవిస్తున్నాము అని చెప్పడానికి సంతోషిస్తన్నాను.
ఆర్తితో చేరవచ్చిన వారిని ఆర్తిహరులుగా, రోగులై ఆశయ్రించిన వారిని యోగులుగా తీర్చిదిద్ది, సనాతన ధర్మాన్ని శాస్త్రంతో సమన్వయించటంలో అపరపారాశర్యునిగా, ఆచరించి చూపటంలో జగదాచార్యునిగా వాసికెక్కిన కులపతి శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి దర్శకత్వంలో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ, పరోపకారమే పరమాశయంగా, స్వధర్మాచరణమే తపస్సుగా, జీవించటమే యోగసాధనగా, ఇల్లే ఈశ్వరాలయంగా భావించే  రామనాథం( పేరు మార్చాను) గారు మా తండ్రిగారని చెప్పుకోవవడానికి నేను ఎంతో గర్వపడుతాను. ఆయన అడుగుజాడలలోనే మాతల్లిగారు కూడా పయనించిన మహోన్నతమూర్తి. మేమందరం ఇలా ఉన్నమంటే వారి ఆశీఃఫలమే తప్ప మరొకటి కాదు.


మా తండ్రిగారికి ఎంఏ తెలుగు చదివేరోజులలో కులపతి శ్రీమాన్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి శిష్యరికం లభించింది. ఆయన వలన హోమియోవైద్యం మరియు ఆధ్యాత్మిక జీవన విధానము అవడ్డాయి. మా తండ్రిగారు అధ్యాపకవృత్తిలో ఉంటూనే ఉచిత హోమివైద్యసేవ చేసేవారు. ఆర్తితో వచ్చినవారి సాంత్వన వచనాలు చెప్పి వారి ఆర్తిని తీర్చేవారు. అలాగే రామాయణం, భారతం వంటి వాటిలోని పాత్రల ద్వారా నిత్యజీవితంలో మన నడవడిని ఎలా తీర్చదిద్దుకోవాలో ప్రవచనాల రూపంలో చెప్పేవారు.

అలాగే ఆయన అధ్యాపకవృత్తిలో ఆయన దగ్గర చదుకోవడానికి వచ్చే విద్యార్థులకు లౌకికమైన విద్యతో పాటు జీవితానికి కావలసిన ఆధ్యాత్మిక సమన్వయం, ఆధ్యాతికత వేరు, జీవితం వేరు కాదని, జీవితాన్ని ధర్మబద్ధంగా నడుపుకుంటూనే ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించాలో ఆచరణాత్మకంగా బోధించేవారు. మాతల్లిగారు కూడా పంతోమంది విద్యార్ధులకు మార్గదర్శకత్వం చేసేవారు.. ఎంతోమంది మాకు అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్ళుగా కలిసిపోయినవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తికాదు. దానితోపాటు తల్లి కడుపు చూస్తుంది, తండ్రి ....... చూస్తాడు అన్నట్టుగానే మాతల్లిగారు ఇంటికి ఎవరు వచ్చినా వారు చెప్పకపోయినా తెలుసుకుని వారికి ఏదికావాలో అది కడుపునిండా పెట్టేవారు.

మాయింటిని ఒక దేవాలయంగా, అడుగుపెడితే దేవాలయంలోకి అడుగుపెట్టినట్టుగా భావించేవారు. అంతేకాకుండా మాయింటికి మాస్టర్ కుటీర్ అని నామకరణం చెయ్యడమే కాకుండా మాఇంటి ముందుభాగానికి సాంత్వన అని, వైదద్యసేవ చేసే చోట స్వస్థత అని, మేము పూజ, ధ్యానం చేసుకునేచోట సాధన అని, మాయింటి మేడమీద ఉన్న రెండువాటాలకు కలాప, శంబళ అని నామకరణం చేసారు. దీనికి ఆయన స్వస్థత అనే చోటుకు వస్తే భౌతికమైన ఆరోగ్యం చేకూరుతుందని, సాంత్వన అనే చోటుకు వస్తే జీవితంలోని ఒడిదుడుకులకు చక్కని పరిష్కారం లభించి, ఆధ్యాత్మిక సాధనకు మార్గం సుగమం అవుతుందని, అక్కడినుడి సాధన అనే చోటుకు వస్తే చేస్తున్న, చేసిన, మరియు మొదలుపెట్టిన సాధన ఫలించి పరమగురువుల స్థానములైన కలాప, శంబళ గుహలను చేరి వారి ప్రణాళికలో జీవితాలను నడుపుకుని, పుట్టినందుకు మానవజన్మను సారథకం చసుకుంటారు అని తరచు చెప్పేవారు. అలాగే అలా తీర్చదిద్దబడిన వారిలో తగివారు ఎవరైనా ఉంటే వారికి కళ్యాణం కుదిర్చేవారు. ఇలా చెయ్యడంవల్ల సమాజానికి మంచి క్రమశిక్షణ గల తరాన్ని అందించినట్లు అవుతుంది అని చెప్పేవారు. ఎంతో కళ్యానం కానివారికి కూడా మార్గదర్శనం చేసి సంబంధాలు కుదిర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఒకటి రెండు ఉదంతాలు ప్రప్తావించి ముగిస్తాను.

మాచిన్నతనంలో ఒక విద్యార్థి కళాశాలో చేరి మాతండ్రిగారితో సాన్నిహిత్యం పెరిగాక ఆయన మాయింటికి సాయంత్రంపూట ధ్యానానికి వస్తుండేవాడు. అతనిది మాఊరికీ దగ్గరలోని చిన్నపట్టణం. అక్కడ కళాశాల సౌకర్యం అప్పట్టో సరిగా లేనందువలన మరియు మాతండ్రగారు పనిచేసే కళాశాల మాకోనసీమలో ప్రముఖమైనది కావడం వల్ల అతను అందులో చదువుకున్నాడు. మాకు ప్రతిరోజూ ఉదయం ధ్యానం, పూజ, సాయంత్రం ధ్యానం అనంతరం మంచి పుస్తకం మాతల్లిగారు చదువుతుంటే వినడం మాకు అలవాటు. ఎవరైనా వచ్చినా వీటిలో తప్పకుండా పాల్గొనేవారు. ఎవరికయినా ఏదైనా, ఏవిషయం మీద అయినా సందేహం వస్తే మాతండ్రిగారు తీర్చేవారు. అలాగే మాతల్లిగారు సహాయపడేవారు. వచ్చినవారిలో ఎవరయినా అర్థాకలితో ఉన్నా గమనించి వారికి తినడానికి ఏమయినా పెట్టేవారు. ఇలా వారు చూపించే ప్పేమ, ఆప్యాయతలకు కరగిపోయి వారి సమస్యలను కూడా చెప్పుకునేవారు. మాతల్లి దండ్రులిద్దరూ వారిని తమ కన్నబిడ్డలలాగ ఆదరించి, వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఆవిధంగా వారు మంచిమార్గంలో మంచి వ్యక్తిత్వం గల పౌరులుగా, పదిమందిని తామే నడిపించగల ధీరులుగా తయారయ్యేవారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న విద్యార్థి మాయింటికి ధ్యానానికి వచ్చినప్పుడు మా యొక్క ఈవిధమైన జీవనవిధానానికి ఆకర్షితుడైనాడు. అలా ఒకసంవత్సరం గడిచాక ఒకనాడు మాతండ్రిగారితో మాస్టారూ నాకు రూములో ఉండి చదువుకోవడం ఇబ్బందిగా ఉంది. మీ ఇంటిదగ్గర అయితే నాకు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలవుంది. రావచ్చా? అని అడిగాడు. దానికి ఆయన దాన్దేముంది. తప్పకుండా రావోయ్ అన్నారు. అప్పటినుండి రోజువారి ధ్యానంతో పాటు మిగిలిన సమయంలో మాయిటిదగ్గరే చదువుకుంటూ ఉండేవాడు. అతనికి వాళ్ళ ప్రక్క పల్లెటూరిలోని బంధువుల ఇంటినుండి భోజనం వచ్చేది. శలవువులు వస్తే మాత్రం వాళ్ళ ఊరు వెళ్ళేవాడు. ఏరోజైనా భోజనం రాకపోతే మాతల్లిగారే గమనించి సమయానికి అతనికి భోజనం పెట్టేవారు. అలా మాయింట్లో చదువు, అప్పుడప్పుడు మాతల్లిగారి చేతి భోజనం, మాతండ్రడిగారు చెప్పే మంచిమాటలతో అతను మాకుంటుంబ సభ్యుడిగా కలిసిపోయాడు. అప్పటికి మేము చాలా చిన్నవాళ్ళం. మేము అతనితో ఆడుతూపాడుతూ, అతను చెప్పే కథలువింటూ అతనితో కలిసిపోయాం. అలా అతను పూర్తికాలం మాయింట్లోనే ఉండిపోయి, అక్కడినుండే కళాళాలకు వెళ్ళే స్థితికి వచ్చాడు. అతని చదువు కొద్దికాలంలో అయిపోతుందనగా ఒకనాడు అతను మాతండ్రిగారితో మాస్టారూ మాపెద్దచెల్లెలు ఉంది. ఆమె విప్లవంగా మగళ్ళందరినీ ద్వేషిస్తోంది. మగవాళ్ళందరూ వెధవలు. వాళ్ళందరినీ కాల్చిపారెయ్యాలి. పెళ్ళాం మగాడి బానిస..... ఇలా మాట్లాడుతూ, వేదికలమీద ఉన్యాసాలు ఇస్తూ పెళ్ళి వద్దనే స్థితికి వచ్చింది. మాకు ఏమిచెయ్యాలో తెలియడంలేదు అన్నాడు. అప్పుడు మాతండ్రడిగారు అయితే మీచెల్లెలిని కొంతకాలం మాయింట్లో ఉండటానికి తీసుకురా. మేము ఆమె ప్రవర్తన, ధోరణి, నడవడి గమనించి మంచిమార్గంలోకి వచ్చేలా చూస్తాం. కానీ ఈవిషయాలేమీ ఆమెకు చెప్పకు. అన్నారు. ాతను తక్షణమే తన చెల్లెల్ని తీసుకువచ్చి మాయింట్లో దింపేసి వెళ్ళిపోయాడు. మాతల్లిదండ్రులు ఆమెను తమ సోంతకూతురులాగా ఆదరించారు. వారు మోదట ఆమె చేసిన వాదనకు ఎదురు చెప్పకుండా ఆమె దారిలోనే సమాధానపరుస్తూ, నెమ్మదిగా ఆమెలో మార్పు తీసుకువచ్చారు. ఒకనాడు మాతల్లిగారు ఆమెతో నువ్వు మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళంటున్నావు కదా. మీతండ్రగారు, మాస్టారు(మాతండ్రిగారు) కూడా చెడ్డవాళ్ళేనా అని అడిగారు. అప్పుడు ఆమె వాళ్ళిద్దరూ మాత్రమే మంచివాళ్ళు తక్కినాళ్ళు కాదంది. సరే అయితే అలాంటి ఇంకొకళ్ళు ఉంటే పెళ్ళి చేసుకుంటావా అని లడిగా మాతల్లిగారు. దొరికితే తప్పకుండా చేసుకుంటాను అంది. ఇది జరిగి కొన్నాళ్ళకు వాళ్ళ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న వాళ్ళ అన్నయ్య స్నేహితుడిని చూసింది. అతనిని బాగా గమనించి, పరీక్షించి ఒకరోజు మాయింటికి తీసుకువచ్చి ఇతనినే చేసుకుంటాను అంది. మాతల్లిదండ్రులు మనఃస్ఫూర్తిగా ఆశ్వీరదించారు. అతను మాతండ్రీగారిలాగే చాలామంచివాడు. ఆరకంగా ఆఅమ్మాయి జీవితం మాతల్లిదండ్రుల వలన చక్కబడింది, ఇప్పుడు ఇద్దరమ్మాయిలతో చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటూ పదిమంది మంచిచేసే స్థితిలో ఉంది.

ఇలాంటిదే మరొకటి

మాతండ్రిగారు ప్రతిరోజూ ఉచితంగా హోమియోవైద్యం చేసేవారు. ఎవరు ఎప్పుడు వచ్చినాకూడా విసుగు కనిపించనీయకుండా ఆప్యాయంగా మందు ఇచ్చి వారికి కావలసిన సహాయం చేసేవారు. ఒక్కోసారి అర్థరాత్రిపూట కూడా తేలు వంటి విషకీటకాలు కరిచాయని మందుకోసం పరుగున వచ్చేవారు. అలాంటి సందర్భాలలో ఏమాత్రం కంగారు పడకుండా మందువేసి బాధ నివారణ అయ్యేవరకు రోగి ప్రక్కనే ఉండి సాంత్వన వచనాలు చెబుతుండేవారు. వారు కొద్దిసేపటిలోనే బాధ నివారణ అయి సంతోషంగా దండాలు పెడుతూ వెళ్ళిపోయేవారు. ఒకనాడు రాత్రి పదిగంటల ప్రాంతంలో ఒకవ్యక్తి వచ్చి తలుపుతట్టారు. మాతండ్రిగారు తలుపు తీసి ఏమిటండీ వచ్చినపని? అని అడిగితే దానికి ఆయన మేము ఈఊరికి కొత్తగా వచ్చాము. మాఅబ్బాయికి ఆస్త్మావ్యాధి ఉంది. సమయం సందర్భం లేకుండా ఊపిరి తీసుకోలేనంతగా ఆయసంతో బాధపడతాడు. ఇప్పుడు కూడా అలాగే వచ్చి గిలగిలలాడిపోతున్నాడు. మేము ఈఊరికి క్రొత్త కాబట్టి ఏమిచెయ్యాలో తెలియక మాప్రక్కవాళ్ళని అడిగితే మీదగ్గరకు వెళ్ళమన్నారు అని చెప్పారు. వెంటనే మాతండ్రిగారు గురువుగారికి దండం పెట్టుకుని (ఏపని చేసినా మొదట గురువుగారికి దండం పెట్టుకోవడం ఆలవాటు. అదే మేమందరం పాటిస్తున్నాము) ఒక మోతాదు మందు ఇచ్చి ఇది వెంటనే అబ్బాయికి వేసెయ్యండి. రేపు సావకాశంగా అతనిని తీసుకువస్తే లక్షణాలు, మూలకారణం, చరిత్ర అన్నీ చూసి వ్యాధి నివారణ చేస్తాను అన్నారు. వచ్చినాయన మందు తీసుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఎంతో సంతోషంగా వారి అబ్బాయిని తీసుకుని మాయింటికి వచ్చి మాస్టారూ మీరిచ్చిన మందు ఇంటికి వెళ్ళిన వెంటనే అబ్బాయికి వేసేసాను. మందు వేసిన అరగంటలో ఆయసం తగ్గి సుఖంగా నిద్రపోయాడు. వ్యాధి వచ్చిన తరువాత ఇంతసుఖంగా రాత్రిపూట నిద్రపోవటం ఇదే మొదటిసారి అన్నారు. అప్పుడు మాతండ్రిగారు మనదేముందండీ అంతా గురువుగారి దయ అనిచెప్పి, అబ్బాయి వ్యాధికి కారణాలు, ఎన్నాళ్ళనుంచి వస్తోంది వంటి వివరాలు కనుక్కుని వైద్యం ప్రారంభించారు. అప్పటినండి అతను తరచు మాయింటికి వచ్చి మందు తీసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మాతండ్రిగారు అతను ఏమి చేస్తుంటాడు ,అతని మానసిక స్థితి, కుటుంబ వివరాలు వంటివి కనుక్కున్నారు. అతను ఇంజనీరింగ్ రెండోసంవత్సరం మాకు దగ్గరలోని కళాశాలోనే చదువుతున్నాడు. అతని తండ్రిగారికి వ్యాపారంలో భాగస్వాములు మోసం చెయ్యటం వల్ల నష్టం వచ్చందిట. పూలు అమ్మిన చోట కట్టెలు, కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మలేనివిధంగా వ్యాపారం చేసే ఉరు వదిలి మాఊరు రావటం జరిగింది. ఈఅబ్బాయి బాగా మెరిట్ విద్యార్థి. అతను ఇంటర్మీడియెట్ చదువుతుండగా ఐఐటికి కూడా చాలా కష్టపడి చదివాడు. కానీ కొద్దిలో ర్యాంకు తప్పిపోయి డిప్రెషన్ లోకి వచ్చేసాడు. అప్పటి నుండి తనమీద తనకే నమ్మకం తగ్గిపోయి, మానసికంగా కృంగిపోయి శారీరక అనారోగ్యం పాలైపోయాడు. ఇదంతా విన్న మాతండ్రిగారు అతనిని నువ్వు నాదగ్గర మందు తీసుకోవడంతో పాటు, నువ్వు కళాశాలనుండి ఇంటికి వచ్చాక సాయంత్రం పూట మాయింటికి ధ్యానానికి రా. అంతా గురువుగారే చూసుకుంటారు అని చెప్పారు. అలాగే అతను మాయింటికి రోజూ ధ్యానానికి వచ్చేవాడు. ధ్యానం అయిన తరువాత అతనికి ఉండే సందేహాలను మాతల్లిదండ్రులు తీర్చి సాంత్వన కలిగించేవారు. అతను  నెమ్మదిగా గురువుగారి దయవల్ల అతని శారీక, మానసిక ఆరోగ్యాలు దారిలో పడసాగాయి. ఒకరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బాగా వర్షం కురుస్తున్నవేళ అతను ఏడుస్తూ బాగా డిప్రెషన్ కి లోనయి మాయింటికి వచ్చి మాతల్లిగారితో ఆంటీ నేను బాగా డిప్రెస్ అయిపోయాను. నేను ఎందుకు పనికివస్తానో తెలియదు. అందుకని చచ్చిపోవడానికి వెడుతున్నాను. ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకయినా మంచిదని మీకు చెప్పడానికి వచ్చాను. వస్తాను అని చెప్పి వెళ్ళిపోబోయాడు. అసమయంలో మాతండ్రిగారు కళాశాలకు వెళ్ళారు. ఇలాంటి సందర్భాలలో మాతల్లిగారు కంగారు పడరు. నిదానంగా ఆలోచిస్తారు. వెంటనే ఆవిడ అదేమిటి అలా అంటున్నావు. ముందు నువ్వసలు లోపలికి వచ్చి కూర్చో అని అతనిని పట్టుకుని లోపలకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చి అతతని బాధ కనుక్కుని తప్పు నాన్నా ఇలాంటి పిచ్చిపనులు చెయ్యకూడదు. గురువుగారి దయ ఉండబట్టి నీకు కనీసం మాయింటికి వచ్చి చెప్పాలి అనిపించింది. లేకపోతే ఏమయ్యేది అంటూ ఓదార్చారు. తరువాత వేడిపాలు ఇచ్చి పడుకోబెట్టారు. ఈలోగా మాతండ్రిగారు వచ్చి పరిస్థితి చూసి అతనికి ధైర్యం చెబుతూ నువ్వు ఇలా అధైర్యపడితే మీతల్లిదండ్రులు ఏమైపోతారు. జీవితంలో ఎన్నో ఓటములు వస్తుంటాయి. ప్రతి ఓటమిని ఒక విజయానికి పునాదిరాళ్ళుగా తీసుకోవాలి. చూస్తూ ఉండు తొందరలోనే గురువుగారి దయవల్ల మీ కుటుంబపరిస్థితి చక్కబడుతుంది. అలాగే నీ ఆరోగ్యం బాగుపడి, నువ్వు ఇంజనీరింగ్ మంచిమార్కులతో ప్యాసవుతావు. ఆపైన అమెరికా కూడా వెడతావు అంటూ ధైర్యం చెప్పారు. అతను తన ఆలోచనని విరమించుకుని, స్థిమితపడి ప్రశాంతమైన మనస్సుతో ఇంటికి వెళ్ళాడు. అతనికి అప్పుడు అమెరికా వెళ్ళడమనే ఊహ కలలో కూడా లేదు. కానీ గురువుగారి అనుగ్రహం వల్ల మాతండ్రిగారు చెప్పినట్లుగానే కొంతకాలానికి అతని తండ్రికి ఆయన భాగస్వాములతో ఉన్న సమస్యలు పరిష్కారమయి నష్టం కొంత భర్తీకావడం జరిగింది. ఆతరువాత ఆయన క్రొత్త వ్యాపారం ప్రారంభించి నిలదొక్కుకుని మంచిస్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ మంచిమార్కులతో ప్యాసయి, పైచదువులకు అమెరికా వెళ్ళడం, తదుపరి అక్కడే ఉద్యోగం తెచ్చుకోవడం జరిగాయి.

ఇలాంటి ఎన్నో విషయాలు మాయిట్లో మాతల్లిదండ్రుల ద్వారా జరగడం మేమెరుగుదుము. ఇలాంటివన్నీ చూస్తే మీరు రాసిన "మీరూ పురోహితులుగా మారండి"  అనేదానికి మాయిల్లె ఒక ఉదాహరణ అనిపిస్తుంది.

నమస్కారాలతో....

Tuesday, January 18, 2011

మీరూ పురోహితులుగా మారండి

  
   హిందూ మతం లోని ఆనందం, ఔన్నత్యం మీకు పూర్తగా తెలియాలంటే మీరు పురోహితులుగా మారాలి. ఏకులం వారైనా ఏమతం వారైనా ఈ పురోహితం చేయవచ్చు. నేను ఓ పురోహితుడిని కనుక ఆ ఆనందమేమిటో దానిరుచేమిటో ఎరిగిన వాడిని కనుక ఆ ఆనందం మీకూ పంచుదామని ఈ ప్రయత్నం. పురోహితులుగా మారాలంటే దానికి ప్రత్యేకమైన యోగ్యతలేవో కావాలి,  మనకి పొద్దున  లేచింది మొదలు ఉద్యోగం చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదు, మళ్లీ ఈ పురోహితం ఎక్కడ వెలగబెట్టగలం, ఇది మనకి కుదరదు అనుకొంటున్నారేమో! అలా అనేముందు దీనిని ప్రయత్నించి అప్పుడు ఆ మాట చెప్పండి. నేనూ ఒప్పుకుంటాను. కనీస ప్రయత్నం లేకుండా ఓ మంచి ఆలోచనని కాదనకండి.  పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.

౧. పురోహితులుగా ఏమి చేయాలి?

 ఏముంది సమాజ హితం.

౨. దానికి నేనెటువంటి గుణాలు కలిగి ఉండాలి?

 కాస్త సాధన - కాస్తనిజాయితీ- కాస్త సాటిమనిషి పట్ల , సమాజం పట్ల ప్రేమ - తెలియనిది తెలుసుకోవాలనే తపన ఇవి ఉంటే మీరు పురోహితులుగా రాణించేస్తారు.

౩. అంటే ఇవి లేక పోతే పనికి రామా?

ఎందుకు పనికి రారు పనికొస్తారు. మీకు కనక శ్రద్ధ - తప్పును ఒప్పుకుని మార్పును స్వీకరించే గుణం  ఉంటే పై విషయాలు అలవరచుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. పైగా మనలో చాలా మందికి నా సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన చాలా ఉంది. కాకపోతే అది ఎలా చేయాలో తెలియదు.

౪. సరే అయితే ఇప్పుడు మేము కూడా పంచ,కండువా కట్టుకుని పూజలూ అవీ చేస్తూ ఉద్యోగాలు మానేసి మీకూడా తిరగాలా ఏమిటి?

అబ్బే అవేవీ అవసరం లేదు. మీమీ ఉద్యోగాలు  నిరభ్యంతరంగా చేస్తూనే పురోహితమూ చేయవచ్చు. పైగా దీనికోసం మీకు ఇష్టంలేకుండా ఏత్యాగమూ చేయనవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఎవరికి మీరు పురోహితంద్వారా మేలు చేయాలనుకుంటున్నారో వారిని వెతుక్కోవడం, పురోహితం ప్రారంభిచడం.  పురోహితుడవ్వాలంటే బ్రాహ్మణుడు మాత్రమే అవ్వాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఆసక్తి ఉన్న ఎవరైనా అవ్వొచ్చు. నిజానికి ఇప్పటికే చాలామంది తమకు తెలియకుండానే పురోహితం చేస్తున్నారు.

౫. అర్థకాలేదు. పూర్తిగా వివరంగా చెప్పండి.

 అదీ అలాఅడిగారుకనుక చెప్తున్నాను. :)

మనం ముందర పురోహితులుగా అవడానికి మానసికంగా సిద్ధపడాలి అంటే ముందు పురోహితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నాదృష్టిలో "ఆధ్యాత్మిక లేమితో బాధపడేవారి హృదయాలను ఆధ్యాత్మికతతో నింపడమే పురోహితం"    అంటే ఓ డాక్టరు వ్యాధిగ్రస్థునికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చినట్లు, మనమూ సమస్యలో ఉన్నవారికి ఆసమస్యకు మూలకారణం వివరించి ఆనందం రుచి చూపిస్తూ, తోటి వ్యక్తులను తద్వారా సమాజాన్ని ఆనందం వైపు నడిపించడమే పురోహితం అంటే.

ఇక మనం పురోహితులము అవ్వాలంటే మనకు కావలసిన అర్హత ఙ్ఞానం. వ్యాధికి సంబంధించిన సంపూర్ణ అవగాహన. వ్యాధి ఏమిటి?  ఆధ్యాత్మిక లేమి ఏ మానసిక సమస్యకైనా మూలకారణం ఇదే అనిగుర్తుంచుకోవాలి . ( అనేక భౌతిక విషయాలలో కూడా ఆధ్యాత్మిక సాధన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ) మరి దాని చికిత్స ఏమిటి? ఆధ్యాత్మిక సాధన. చికిత్స ద్వారా మనం వారికి అందించ గలిగినది ఏమిటి? ఆనంద జీవనం.

మన ఋషులు భారతీయ జీవన విధానాన్ని రూపొందించడంలో ఎంతో తపన చెందారు. ఆనందం ఎక్కడనుండి వస్తోంది? దానిని పరిపూర్ణంగా పొందడం ఎలా? కష్ట సుఖాలకు అతీతంగా నిశ్చల ఆనంద స్థితి ఏవిధంగా పొందగలం? మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వారి తపస్సు ద్వారా పొందారు. దానిని భవిష్యతరాలకు అందించడానికి తపించారు. వారి ప్రేమను తలచినప్పుడల్లా నాకళ్లు చమరుస్తాయి. భారతీయ జీవన విధానం వారు మనకు పెట్టిన భిక్ష. అది ఆనందం అనే పరమావధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించ బడింది. కానీ నేడు ధనం పరమావధి అని ప్రాకులాడడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి. మన పూర్వులకు ఎంత ప్రేమ ఉంటే నేటికీ మనం భారతీయ జీవన విధనాన్ని కళ్లారా చూడగలుగుతున్నాం!?  ఈ విధానం నలుగురూ అమలుపరచేలా చేయడంలో ఎంత తపించి ఉంటారు!? మన మీద ఎంత ప్రేమ ఉంది వారి హృదయాలలో!?   అదే మనకు స్ఫూర్తి కావాలి. మనకున్న బలహీనతలను తొలగించడంలో వేయింతల బలాన్ని ఇవ్వాలి. ఋషులు మనకు ఒక జీవన విధానాన్ని ప్రసాదించారు. దానికి ప్రాతి పదికగా వేదాన్ని వారసత్వంగా ఇచ్చారు. ఆ ఋషుల స్ఫూర్తితో తన ప్రతి చర్యలోనూ ప్రేమను నింపుకుని తాను తరిస్తూ చుట్టూ ఉన్న నలుగురినీ తరింప చేసేవాడే పురోహితుడు. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఙ్ఞానాన్ని, ఎంతో కొంత అఙ్ఞానాన్నీ కలిగి ఉంటారు. ఎవరూ పరిపూర్ణులు కారు. కానీ తమఙ్ఞానాన్ని నలుగురికీ పంచాలనుకునేవారు క్రమక్రమంగా కొత్త విషయాలను తెలుసుకుంటూ పరిపూర్ణ ఙ్ఞానం ( ఆనందం ) వైపు పయనిస్తారు. ముందు మనకుతెలిసినదెంతో మనం ఇంకా సాధించ వలసినదేమిటో విచారణ చేసుకోవాలి. ఆ తరువాత మనకు తెలిసిన పరిధిలో సాటివారికి తగు సహాయమందించాలి. అలా సాయమందించడంలో మననూ అనేక తెలియని విషయాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. వాటికి "సద్గ్రంధ పఠనం-సజ్జన సాంగత్యం- స్వీయ సాధన" మొదలైన వాటి ద్వారా సమాధానాలను రాబట్టుకోవచ్చు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలకు కారణం చాలావరకు ఆధ్యాత్మిక లేమి. ఆధ్యాత్మిక సాధన ఉన్నట్లైతే మనం, మన సమాజం నేడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అసలు సమస్యలే కావు. కనక ఆదిశగా మనం పయనిస్తూ తోటివారిని పయనింప చేసే ప్రయత్నమే పురోహితం అంటే. మీకు కష్టంలో ఎవరైనా కనపడితే చూస్తూ ఊరుకోకండి. దానికి తగిన తరుణోపాయం ఆధ్యాత్మిక సాధన అన్న విషయాన్ని వారికి నచ్చే, వారు మెచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ తపన, తోటి వారిపై గల ప్రేమ, మీకు భగవంతుడి పై గల నమ్మకం, మీ ప్రార్థనలో కల ఆర్తి, గురువుల ఆశీస్సులు మీకు దారి చూపుతాయి. ఇంకా  ఈ విషయంలో  సాధకులైన తోటి మిత్రుల సహకారాన్ని పొందండి. మీకవసరమనుకుంటే నా పూర్తి సహకారాన్ని నేనందిస్తాను.

ఇక్కడ మీకో సందేహం రావచ్చు.  "నాకే ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. ఇక తోటి వారికేమి నేర్పగలను? " అని

నిజానికి చాలామందికి కూడా ఇదే సందేహం. ఆధ్యాత్మికతకు ఒక్క మాటలో వివరణ ఇవ్వడం చాలా కష్టం. కానీ "నిన్ను నిన్నుగా నిలబెట్టుకోవడమే ఆధ్యాత్మికత" అంటాను నేను. మన బుద్ధి అనేక సందర్భాలలో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా ప్రశ్నించిన బుద్ధికి సరైన సమాధానాన్నిచెప్పి నేను సక్రమ మార్గంలోనే ఉన్నాను అని నిర్థారించుకుంటూ ముందుకు వెళుతూ ఉండడమే ఆధ్యాత్మికత. ఆ బుద్ధిని నిద్ర పుచ్చి మనసు లాగిన కేసల్లా మళ్లడమే ఆధ్యాత్మిక లేమి. ఇదిఅర్థంకాకనే మనలో చాలామంది ప్రక్కవాళ్లకి సమస్య వచ్చినప్పుడు - ఆ సమస్యకు తగిన పరిష్కారం  వారికి తెలిసినా కూడా సలహా చెప్పడం మానేస్తున్నారు. మనం సలహా చెప్పినప్పుడు వారు వేశే ప్రశ్నలకు మనం సంతృప్తి కరమైన సమాధానాలు ఇవ్వలెమేమో అన్న సందేహం. ఇక్కడ ఆలోచించ వలసినది అది కాదు. అదే సమస్య మనకి ఎదురైతే మనకి మనం సమాధానం చెప్పుకోగలమా లేదా అన్నది ముందు ఆలోచించాలి. నేనే ఆపరిస్థితులలో ఉంటే ఏమిచేస్తాను? అంతకంటే మెఱుగైన పద్ధతి నాదగ్గర ఉందా? అని మనం ఆలోచిస్తే సరిఅయిన సమాధానం దొరుకుతుంది. అప్పుడు మనం ఇతరుల సమస్యకు మూలకారణం, దాని నివారణొ పాయం చెప్పడం మొదలు పెట్టాలి. అదీ వారి స్థాయికి తగిన రీతిలో. ఇదంతా కాస్త మనో బలమున్న ఎవరైనా చెయ్యగలరు. దానికి పెద్ద విధి విధానాలెమీ తెలియనవసరం లెదు. ఏ మంత్రోపాసనలు అవసరం లేదు. కానీ ఆమనో బలం ఎవరికి ఉంటోంది? అన్నది ప్రశ్నించుకుంటే కేవలం భగవత్ భక్తులకు, నిజమైన సంఘ సేవకులకు ఎక్కువగా ఉన్నది. మీరు ఏ కథ తీసుకోండి సాధరణం గా మనసు తీవ్రంగా గాయపడిన వారుకూడా ఈ భగవత్ సేవ లేదా సంఘ సేవ అనే రంగాలలోకి దిగితే వారి మానసిక అశాంతి తొలగి స్వస్థత చేకూరడమే కాక ఆయా రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం కాదు. అది మనసును ఆత్మతో లయంచేసే ప్రక్రియ. ఈ రెండు రంగాలూ ఆధ్యాత్మికతకు బాగా ఊతమునిచ్చేవే.

సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తిని బట్టి అతనికి ఏమార్గంలో తరుణోపాయం చూపాలి అన్నది ఉంటుంది. ఒక మార్గం పూజలు, మంత్రోపాసనలు అయితే ఇక రెండవది మనలోని దుర్గుణాలను,అత్యాశను తగ్గించుకుంటు సంఘ సేవకు నడుంబిగించడము. ఈ రెండిటిలో ఏదైనా ఉత్తమమే. వీటిని మరొకరికి నేర్పడానికి మనకున్న అనుభవానికి తొడు వారికి పూర్తిగా సాయపడాలన్న ఆర్తి ఉండాలి.

 తప్పుదారిన వెళ్లబోవుచున్న మీస్నేహితునికి సరైన సమయంలో సరైనవిధంగా పరిష్కారాన్ని అందించ గలిగారా మీ ఆనందానికి అవధులు ఉండవు. అతడు పూర్తిగ తప్పుడు మార్గం పట్టాక(అంత్య దశలో) సలహా ఇవ్వడం - దానిని అతనిచే పాటింపచేయడం చేయాలంటే ఎంతో అనుభవం కావాలి. అదే మీకు విషయం తెలిసిన(ప్ర్రారంభ దశ) దగ్గరనుండి పురోహితాన్ని(చికిత్సను) మొదలు పెట్టారనుకోండి త్వరగా ఫలితాలు సాధించ గలరు.

నేను నా స్నేహితులతో తఱచు అనే వాడిని. మనకు బాగా దగ్గర స్నెహితులలో ఎవరైనా చెడు మార్గం పట్టి పాడై పోయారంటే, లేదా నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య వంటి వాటికి పాల్పడ్డారంటే దానికి మనము కూడా బాధ్యులమే అని. మనం అతను పాడైపోవడం చూస్తూ - మంచి ఏమిటో తెలిసి కూడా ఎటువంటి స్పందన చూపక పోబట్టే వాళ్లు ఆస్థితిలో ఉన్నారు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే ఎంత మొఱటు వ్యక్తిలోనైనా మార్పును తీసుకు రావచ్చు. అది నేను చెప్పే పురోహితం వల్ల సాధ్యమే. దీనికి అనుభవం కంటే ఆ తోటి వ్యక్తిపై మీకు కల ప్రేమ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

నేను ఓ పురోహితుడిగా నిలబడటానికి ఎంతో తపించాను. దానికి తగిన అర్హత పొందే క్రమంలో నన్ను నెనే మార్చుకున్నాను. ఎంతో ఆనందాన్ని నా సొంతం చేసుకున్నాను. ఓ పురోహితుడిగా నాకెదురైన ఏ సమస్యనూ నా వల్ల కాదని వదిలేయడం నాకు గుర్తులేదు. నా ప్రతి అడుగులోనూ ఎందరో గురువులు అదృశ్యరూపంలో నన్ను మున్ముందుకు నడిపించారు.వారందరికీ గురుదక్షిణగా నేనీ బ్లాగు ప్రారంభించాను.