Tuesday, July 10, 2018

జాతకచక్రం ద్వారా సంగీత - గాన విద్యలలో ప్రావీణ్యత (Astro Combinations for Musicians-Singers)


 పాట పాడటం, స్వరయుక్తమైన గానంతో శ్రోతలను పరవశింపచేయడం అంత సామాన్యమైన విషయం కాదు. చాలా మందికి సంగీత అభిరుచి ఉంటుంది, కానీ అతి తక్కువమందికి మాత్రమే ఆ అభిరుచి పేరుప్రఖ్యాతులను తెచ్చేంతగా సాధనచేసే తత్వాన్ని ఇస్తుంది. అటువంటి సంగీత ఙ్ఞానం ఎవరెవరికి ఏస్థాయిలో ఉంటుంది అనే విషయాన్ని జాతకచక్రం ద్వారా చక్కాగా సూచించవచ్చు.
ఎటువంటి గ్రహస్థితులు ఒకవ్యక్తిని గొప్ప సంగీత కళాకారునిగా నిలబెట్టుతాయి అనేది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు.

సంగీతం లేదా గాన కళను సూచించు గ్రహాలు
చంద్రుడు : చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు మరియు ఏవిషయంలోనైనా లోతైన భావనలను సూచిస్తాడు. సంగీత విద్వాంసులు కూడా పాట పాడుతున్నప్పుడు లయలో హెచ్చుతగ్గులు మారుస్తున్నట్లే, చంద్రుడు రోజుకో విధమైన కళతో హెచ్చుతగ్గులను పొందుతుంటాడు. కనుక సంగీత ప్రతిభకు చంద్రుడు చాలా ముఖ్యమైన గ్రహము.

శుక్రుడు : శుక్రుడు మీడియా, సంగీతం, సంగీత వాయిద్యాలు, డ్యాన్స్, పాడటం మరియు అయస్కాంత విషయాలను సూచిస్తాడు. బుధుడు, చంద్రుడు మరియు 2 వ ఇల్లు లేదా దాని యజమానితో శుక్రుడు సంబంధం కలిగి ఉన్నట్లైతే అది సంగీతప్రతిభను సూచించు చక్కటి యోగము.

బుధుడు : బుధుడు కమ్యూనికేషన్ ని సూచిస్తాడు. సంగీతం ద్వారా గాయకుడు తన మనసులోని భావమును పాటగా శ్రోతలకు వ్యక్తపరచి, వారిని పరవశింప చేస్తాడు. కొన్ని భావాలను పాటలోని రాగముద్వారా, కొన్ని భావాలను పాటలోని పదములద్వారా వ్యక్తపరుస్తాడు. ఈవిధంగా వ్యక్తపరచు శక్తిని బుధుడు సూచిస్తాడు.  శుక్రుడు లేదా 2 వ గృహంతో బుధుని సంబంధం సంగీత ప్రతిభకు మంచి సూచన.
శనైశ్చరుడు : సంగీతంలో తీక్షణమైన ఆసక్తి, ఆతురపడక ఓర్పుతో క్రమశిక్షణ ద్వారా చక్కటి ఙ్ఞానాన్ని పొందటాన్ని, మిగతావారు అందుకోలేని  లోతైన విషయపరిఙ్జానాన్ని శనైశ్చరుడు కలిగిస్తాడు. శనైశ్చరునికి ద్వితీయ భావంతోను, శుక్ర-బుధ-చంద్రులతోను సంబంధం కలిగినట్లైతే ఆ జాతకునికి లోతైన సంగీత ఙ్ఞానం ఉంటుంది.   

సంగీతం లేదా గాన కళను సూచించు భావాలు
తను భావం : ఏవ్యక్తికైనా మొదటి ఇల్లు కీలకమైనది. ఈ భావం లేదా భావాధిపతి 2,5 భావాలతో సంబంధం కలిగి ఉండడం సంగీతమును సూచిస్తుంది.
ద్వితీయ భావం : 2వ ఇల్లు వాక్కును మరియు గాన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క ద్వితీయ భావం, ఆ భావాధిపతి, ఆభావమును ప్రభావితం చేసే గ్రహాలను బట్టి అతని గాత్ర సామార్థ్యం ఎంతటిది అనేది నిర్ణయించ వలసి ఉంటుంది.

మూడవ భావం : 3వ ఇల్లు ప్రయత్నమును, సాహసమును, మీడియాను, కమ్యునికేషన్ ను సూచిస్తుంది.  ఒక నిండు సభలో పాటపాడాలంటే సాహసము కావాలి. తెగువతో ప్రయత్నం చేసే గుణం ఉండాలి.
ఐదవ గృహం : 5వ ఇల్లు మనసును, సృజనాత్మకతను, ఆహ్లాదమును సూచిస్తుంది. అభిరుచి కలిగి ఆనందంగా నేర్చుకునే సంగీత, సాహిత్యాది కళలను , ఆటలను సూచిస్తుంది.
పదవ భావం : 10 వ ఇల్లు వ్యక్తి యొక్క పదవిని, గౌరవమును, పేరు ప్రఖ్యాతులను సూచిస్తుంది. ఒక వ్యక్తి ఎటువుంటి ఉద్యోగమును నిర్వర్తించును అనేది ఈభావంనుండె గ్రహించ వలెను.
పదకొండవ భావం : 11 వ గృహం లాభమును మరియు కోరిక లు తీరుటను  సూచించును. ఎంత ప్రయత్నం, శ్రమ ఉన్ననూ పదకొండవ భావ సంబంధం లేనట్లైతే అతని కోరికలుఫలించవు.
సంగీతం లేదా గాన కళను సూచించు రాశులు
శుక్ర రాశులైన వృషభ-తులలు, బుధ రాశులైన మిథున-కన్యలు, ప్రథానంగా సంగీత కళాకారులను సూచించును.
చంద్ర రాశి అయిన కర్కాటకము భావుకత కలిగి ఉండుటను, తన్మయత్వముతో గానము చేయుటను సూచించును.
సింహము కూడా సృజనాత్మకతను ప్రతీక. మరియు ద్వితీయమునకు బుధుడు, దశమమునకు శుక్రుడు అధిపతి కనుక సంగీతకోవిదులను సూచించును.
పంచమ,దశమాలు శుక్రరాశులుగా గల మకరము లో పుట్టిన వారికి కూడా సంగీతం బాగా వంటపడుతుంది.
ఈ మూడు విధాలైన గ్రహ+రాశి+భావాల కలయికలు జాతకంలో కలిగిన వారు తప్పక సంగీతంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.

ఉదాహరణ జాతకం
Lata Mangeshkar : 28-09-1929, 21.50 pm, Indore 



వీరు దాదాపు 1,000  కిపైగా సినిమాలలో 50,000 కు పైగా పాటలు పాడారట. విలక్షణమైన గాత్రం వీరిప్రత్యేకత. ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. దానికి తగిన గ్రహస్థితులు ఈవిధంగా ఉన్నాయి.
వృషభ లగ్నం : శుక్రరాశి అయిన వృషభ లగ్నం వారికి సంగీతంలో చక్కటి అభిరుచి ఉంటుంది.
శుక్రుడు : లగ్నాధిపతియైన శుక్రుడు  చతుర్థమైన సింహం లో ఉన్నాడు : సంగీత విద్యలో ప్రావీణ్యతను తెలుపుతుంది. సింహరాశి సృజనాత్మకతను సూచిస్తుంది. శుక్రుడు దశమాన్ని వీక్షిస్తున్నాడు. వారికి శుక్రునివలన కళా సంబంధమైన వృత్తి ఏర్పడుతున్నదని స్పష్టంగా తెలుస్తుంది.
చంద్రుడు : తృతీయాధిపతి తృతీయంలో తన స్వగృహంలో ఉండడం వీరికి కల మరోబలమైన యోగం.  దీనివలన వీరికి విలక్షణమైన స్వరం కలిగిందని చెప్పవచ్చు. మీడియా కమ్యునికేషన్ రంగం అంతా తృతీయమే. చంద్రుడు బుధ నక్షత్రంలో ఉన్నాడు.  తృతీయాధి పతికి ద్వీతీయ,పంచమ  భావ సంబంధం కలిగింది. ఇదికూడా చక్కటి సంగీతయోగం.
బుధుడు:  బుధుడు ద్వితీయ, పంచమాధిపతి యై పంచమంలో ఉన్నాడు.  వీరికి గల సహజమైన సంగీత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. పంచమంవలన సినీరంగంలో సంగీతం ద్వారా ప్రముఖస్థానం పొందడం తెలుస్తోంది.
శనైశ్చరుడు: నవమ,దశమాధిపతి శనైశ్చరుడు సప్తమంలో (భావచక్రరీత్యా సప్తమంలోకే వస్తాడు) కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఆకేతువు శుక్ర రాశిలో ఉండటం గమనించవచ్చు. వృషభలగ్న జాతకులకు శనైశ్చరుడు యోగకారకుడు. అతడు వీరికి వృత్తియందు కల క్రమశిక్షణను, లోతైన పరిశ్రమను సూచిస్తున్నాడు.
గురుడు : లగ్నంలో ఉండటం ద్వారా వీరికి సృజనాత్మకతను, చక్కటి గురువులు లభించుటను, జీవితంలో కోరుకున్నవి సాధించుకొనుటను తెలుపుచున్నాడు.
మొత్తమ్మీద చూస్తే ...
లగ్నాధిపతి శుక్రుడు అవడం, శుక్రునికి దశమంతో సంబంధం కలగడం,
ద్వితీయ పంచమాధిపతి బుధుడు అవ్వడం
తృతీయాధిపతి బలం కలిగి ఉండడం, తృతీయ భావాధిపతికి ద్వితీయ భావంతో సంబంధం,
శనైశ్చరుని వలన స్థిరంగా లోతైన పరిశ్రమ చేసే ఓర్పుకలగడం
ఇవన్నీ వీరిని సంగీత రంగంలో ఉన్నతశిఖరాలపై నిలబెట్టాయి.

వీరి జన్మ సమయంలో భిన్న వాదనలు ఉన్నాయి, బాగా పరిశీలించిన మీదట వృషభ, మిథున లగ్నాలలో వృషభమే సరైనదని తెలుస్తోంది.
వీరిది బుధలగ్నమా, శుక్ర లగ్నమా అని ప్రశ్న చక్రం వేశాను. దానిద్వారా కూడా వీరిది శుక్రలగ్నమైన వృషభమనేది రుజువగుచున్నది. చంద్రుడు వృషభంలో ఉన్నాడు, జాతక చక్రంలో వలెనే శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. రూలింగ్ ప్లానెట్స్ లో శుక్రుడు ఉన్నాడు కానీ, బుధుడు లేడు.

ప్రశ్నచక్రం


మరిన్ని విశేషాలు త్వరలో తెలుసుకుందాము
మీ రాజశేఖరుని విజయ్ శర్మ

No comments:

Post a Comment